మనకి అరకు, ఊటీ లాంటి ఎత్తైన ప్రాంతాలు విహార స్ధలాలు. సముద్ర మట్టానికి ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత పడిపోతుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరం పొడవునా చల్లటి వాతావరణం జనాన్ని సేదతీరుస్తుంది. కానీ దేశం దేశమే కొండలపైన ఉంటే? ఇక ఆ దేశం అంతా అందమైన ప్రకృతి దృశ్యాలతో అలరారుతుంది. అలాంటి దేశం ఆఫ్రికా లోని లెసోతో.
ప్రతి దేశానికి దిక్కులుంటాయి. అనగా ఉత్తరాన ఫలానా, దక్షిణాన ఫలానా… ఇలా. కానీ లెసోతో ఒక విధంగా దిక్కులు లేని రాజ్యం. కారణం ఏమిటంటే ఆ దేశం పూర్తిగా మరో దేశం లోపల ఉంది. నిజాం రాజు స్వతంత్ర దేశంగా తన సంస్ధానాన్ని ప్రకటించుకుంటే ఎలా ఉండేది? ఆ దేశం చుట్టూ భారత దేశమే ఉండేది. అలాగే లెసోతో చుట్టూ దక్షిణాఫ్రికా దేశమే ఉంటుంది. లెసోతో ప్రజలు ఏ దిక్కుకు వెళ్ళి సరిహద్దు దాటినా దక్షిణాఫ్రికా భూభాగంపై అడుగు పెట్టాల్సిందే.
లెసోతో జనాభా కేవలం 2.2 లక్షలు మాత్రమే. 30,000 చదరపు కిలో మీటర్ల వైశాల్యం కలిగి ఉన్న లెసోతోలో ఎక్కడికి వెళ్ళినా కొండలూ, లోయలే దర్శనం ఇస్తాయి. చేతికి అందినట్లుగా ఉండే మేఘాలు, తెల్లగా మంచుతో కప్పబడి ఉండే కొండ శిఖరాలూ, కొండలతో సహా ఎటు చూసినా పచ్చటి పరుపు పరిచినట్లు ఉండే నేలా లెసోతో దేశాన్ని ‘కింగ్ డమ్ ఆఫ్ ద స్కై’ (ఆకాశ రాజ్యం) గా మార్చాయి.
లెసోతోలో అత్యంత తక్కువ ఎత్తైన ప్రాంతం సముద్ర మట్టానికి 4,593 అడుగుల ఎత్తులో ఉండడం బట్టి అది ఆకాశ రాజ్యం ఎందుకు అయిందో అర్ధం చేసుకోవచ్చు. రాచరికం ఇంకా కొనసాగుతున్న లెసోతోలో అత్యధికులు పేదవారు. భూములను సాగు చేసుకునే రైతులు. అనగా వ్యవసాయం ప్రధాన వృత్తి. వజ్రాల గనులు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఆ వజ్రాలకు యజమానులు మాత్రం ప్రజలు కాదు.
లెసోతో రాజధాని మసేరు. దేశం అతి పెద్ద నగరం కూడా ఇదే. ఈ దేశంలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి నీటి వనరులను స్వంతం చేసుకోవడానికి పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలు, చైనా కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఉదాహరణకి మఖాలే గ్రామం వద్ద నిర్మించిన మెటోలాంగ్ డ్యామ్ కు పశ్చిమ, అరబ్ దేశాలు ఫైనాన్స్ వనరులు సమకూర్చగా చైనా కంపెనీ ‘సినో హైడ్రో కార్ప్’ నిర్మించి పెట్టింది. ఈ డ్యామ్ వల్ల అనేకమంది లెసోతో గ్రామాలు తమ ఊళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం లెసోతో రాజు పేరు కింగ్ లెట్సీ III. రాచరికాన్ని ఇక్కడ రాజ్యాంగబద్ధం చేశారు. పరిపాలనలో రాజు పాత్ర నామమాత్రం అని చెబుతారు గానీ ఆస్తులు, వనరుల పరంగా చూస్తే పరిస్ధితి దానికి భిన్నం.
లెసోతో ప్రజలు సోతో భాష మాట్లాడుతారు. లెసోతో అంటే సోతో భాషా మాట్లాడే ప్రజలు ఉన్న దేశం అని అర్ధం.
వివిధ కాలాల్లో తీసిన ఈ ఫోటోలను ది అట్లాంటిక్ ప్రచురించింది.



















