బి.జె.పి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రజాస్వామ్యంపై హఠాత్తుగా బెంగ పట్టుకుంది. జనం ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చుంటున్నందుకు ఆయనకు కోపం వచ్చింది. ఓటు హక్కు ఉండి కూడా ఓటు వేయని జనం ఇక భవిష్యత్తులో ఎప్పటికీ ఓటు వేయకుండా నిషేధం విధించాలని ఆయన ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నారు.
జనం కోసం జరిగే ఎన్నికల్లో జనమే ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యం ఎలా బతికేను అన్నది అద్వానీ భయం! “ఓటు వేయని ప్రజలపైన అపరాధ రుసుము విధించే దేశాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి” అని అద్వానీ అన్నారు.
“భారత దేశంలో ఆ విధంగా అపరాధ రుసుము విధించడానికి నేను యిష్టపడను. అయితే ఒకసారి ఎన్నికలలో ఎవరన్నా ఓటు వేయకపోతే వారిని తదుపరి ఎన్నికల్లో ఓటు వేయనివ్వకుండా అడ్డుకోవాలి” అని అద్వానీ సూచించారు. ఈ విషయంలో తాను ఎన్నికల కమిషన్ కు లేఖ కూడా రాశానని అద్వానీ చెప్పారు.
“ప్రజలు తమకు ఓటు వేసేందుకు ఉన్న హక్కు గురించి తెలుసుకోవాలి. ఆ హక్కును ప్రతి ఎన్నికలలోనూ వారు వినియోగించుకోవాలి” అని అద్వానీ గారు బోధించారు.
ఓటు హక్కును ప్రజలకు బలవంతంగానైనా అమలు చేయించడానికైనా సిద్ధపడుతున్న అద్వానీ గారు ఇతర ప్రాధమిక హక్కుల గురించి కూడా ఇదే పద్ధతి సూచిస్తే జనానికి ఉపయోగం. ఓటు వేయడం వల్ల జనానికి ఏమి ఉపయోగమో ఇంతవరకు వారికి అనుభవంలోకి రాలేదు. జనం ఓట్ల ద్వారా నెగ్గిన నేతలు సొంత వ్యాపారాలను, ఆస్తులను వృద్ధి చేసుకుంటూ తమకు అందుబాటులో లేకుండా పోవడమే వారు చూశారు గానీ తమ సమస్యలను పట్టించుకుని పరిష్కరించడం ఎప్పుడూ చూడలేదు. ఇక వారి ఓటుకి ఏ విలువ ఉన్నట్లో అద్వానీ చెబితే బాగుండేది.
ఓటు వేయనందుకు నిషేధిస్తారు సరే. మరి ఓట్ల జాతరలో సవాలక్ష హామీలు ఇచ్చి మర్చిపోయే నాయకులను నిషేధించవద్దా? ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయా నేతలు ఇచ్చే హామీలను రికార్డు చేసుకుని వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా తదుపరి ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా నిషేధం విధించాలని అద్వానీ డిమాండ్ చేయగలరా?
ఎవరి దాకానో ఎందుకు అద్వానీ గారే బాబ్రీ మసీదు కూల్చేటప్పుడు అక్కడే వేదికపై ఉన్నారు. కానీ లిబర్హాన్ కమిషన్ ముందు తనకు ఏ పాపం తెలియదని చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చి రాముడి గుడి కట్టాలని కోరుతూ రధయాత్ర చేసిన అద్వానీ లిబర్ హాన్ కమిషన్ తో మాత్రం తనకు ఏమీ తెలియదని చెప్పారు. ఇలాంటి అబద్ధాలని చెప్పే నాయకులను ఎన్నికలనుండి డిబార్ చేయొద్దా?
అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇప్పిస్తామని కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ వాగ్దానాలు ఇచ్చాయి. ఎన్.డి.ఏ హయాంలో ఆ హామీ నెరవేరలేదు. యు.పి.ఏ హయాంలోనూ నెరవేరలేదు. మరి ఆ పార్టీలకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను తీసేయొద్దా?
ప్రజాస్వామ్యం అంటే ఓట్లు, ఎన్నికలు ఒక్కటే అన్నట్లుగా రాజకీయ నాయకులు మాట్లాడడం మోసం తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమ భవిష్యత్తుని తామే తీర్చిదిద్దుకునే ఒక ఉన్నతమైన జీవన విధానం. అది ఇంతవరకూ జనం అనుభవంలోకి రాలేదు. వారి అనుభవం కేవలం ఓట్ల ద్వారా కొద్ది మంది ఆస్తులు పెంచుకోవడం మాత్రమే. అలాంటి ఎన్నికలు ఉంటే ఎంత? ఊడితే ఎంత?

అద్వానీ గారు , అదే స్ఫూర్తి తో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, గెలిచాక , వాటిని తీర్చ(లే)ని వారికి ఏ గతి పట్టాలో కూడా తెలియ చేయాలి ! ఆయన గారు ఆ సంగతి ఎప్పుడూ చెప్పరు , కారణం : వారందరిదీ ‘ ఒకే కుటుంబం ‘ !
హేమిటీ….? ఒకసారి ఓటు వేయకపోతే…మళ్లీ సారి ఓటు వేయకుండా నిషేధించాలా…? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఒక సారి రానివాఢు మళ్లీ పళ్లికిలించుకుంటూ…రెండో సారి వస్తాడా…?మళ్లీ నిషేధించడం ఎందుకు…?