ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఒకరి బండారం మరొకరు బైటపెట్టుకునే పనులు జోరందుకున్నాయి. ‘తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేనొకటి’ అంటూ పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. జనానికి ఏమిటి, ఎలా చేస్తామో చెప్పడం మాని ‘నువ్వు వెధవ’ అంటే ‘నువ్వు వెధవ’ అని తిట్టిపోసుకుంటున్నాయి. ‘రీ కౌంటింగ్ మంత్రి’ అని ఒకరు వెకిలి చేస్తే ‘ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రి’ అని మరొకరు గుట్టు విప్పుతున్నారు. మోడిపై గతంలో ఉమాభారతి చేసిన విమర్శల వీడియోను తాజాగా వెలికి తీయడం ద్వారా కాంగ్రెస్ బి.జె.పి లోని విభేదాలను రచ్చకీడ్చింది.
2006లో ఉమా భారతి బి.జె.పి నుండి బైటికి వచ్చి సొంత కుంపటి పెట్టుకుంది. ఆ సందర్భంగా ఆమె మోడిపై చేసిన తీవ్రస్ధాయి విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక వీడియో ద్వారా బైటికి తెచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి “నరేంద్ర మోడి వికాస పురుషుడు కాదు, వినాశ పురుషుడు” ఆమె సదరు వీడియోలో తిట్టిపోశారు. 2006లో భారతీయ జనశక్తి పార్టీ స్ధాపించిన ఉమా భారతి 2011లో మళ్ళీ బి.జె.పిలో చేరిపోయారు.
వినాశ పురుషుడు అని తిట్టిపోయడంతోనే ఉమా భారతి ఆగిపోలేదు. గుజరాత్ అభివృద్ధి నమూనా బండారాన్ని కూడా ఆమె బైటపెట్టారు. వాస్తవ అంకెలను మార్చి కృత్రిమ అంకెలతో గారడీ చేయడం ద్వారా గుజరాత్ అభివృద్ధి నమూనాను కృత్రిమంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారని ఆమె వెల్లడి చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా గణాంకాలను తారుమారు చేసి దారిద్ర రేఖకు దిగువున ఉన్న ప్రజల సంఖ్యను తక్కువ చేసి చూపారని తెలిపారు.
మోడి నియంతృత్వంతో వ్యవహరిస్తారని ఉమా భారతి మరో ఆరోపణ చేశారు. మోడి నియంతృత్వ వైఖరిపై వచ్చిన విమర్శలు సాధారణ స్ధాయివి కావు. చివరికి విశ్వహిందూ పరిషత్, కొందరు ఆర్.ఎస్.ఎస్ నాయకులు, భజరంగ్ దళ్ సంస్ధల నాయకులు సైతం మోడితో విభేదించి ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పని చేశారని పత్రికలు అనేకసార్లు చెప్పాయి. గుజరాత్ ప్రజలు అనుక్షణం భయంతో బతుకుతున్నారని ఉమా భారతి వీడియోలో విమర్శించారు.
“1973 నుండీ ఆయన నాకు తెలుసు… ఆయన వికాస పురుషుడెమీ కాదు. వినాశ పురుషుడు మాత్రమే. జి.డి.పి వృద్ధి, దారిద్ర రేఖకు దిగువున ఉన్నవారిని పైకి తేవడం తదితర అంశాల్లో ఆయన వాదనలన్నీ బూటకం… గుజరాత్ కు రాముడూ లేడు, రోట్టే లేదు. ఆ రాష్ట్రం వినాశ పురుషుడి నుండి విముక్తి కావాలి… మీడియా వల్లనే మోడి అంత పెద్దవాడుగా మారాడు. బెలూన్ ని బాగా ఉబ్బించారు” అని ఆమె విలేఖరులతో మాట్లాడుతూ వీడియోలో చెప్పారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి ఈ వీడియోను విలేఖరుల ముందు గురువారం ప్రదర్శించారు. బి.జె.పి లో ఉండగా ఆమె ఈ మాటలు చెప్పకపోయి ఉండవచ్చనీ కానీ ఎన్నికల సందర్భంగా ఆమె ఈ మాటలు చెప్పకపోవడం గుర్తించాలని కోరారు. ఎన్నికలంటూ ఏవీ లేని సమయంలో ఈ మాటలు చెప్పినందున వాటిల్లో నిజం ఉందని గ్రహించాలని కోరారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చెప్పే మాటలు అబద్ధాలతో నిండి ఉంటాయని సింఘ్వి ఆ విధంగా అంగీకరించారు.
బి.జె.పి లో తిరిగి చేరిన తర్వాత కూడా ఉమా భారతి పలుమార్లు బి.జె.పి అధినాయకత్వంతో విభేదించారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికలకు ముందే ఆమె మధ్య ప్రదేశ్ లోని భోపాల్ నుండి పోటీ చేయడానికి ఆసక్తి కనబరచారు. కానీ చివరి ఆమె ఉత్తర ప్రదేశ్ లో ఝాన్సీ అభ్యర్ధిగా ఆమె నిలబడాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పైన ఉమాభారతిని పోటీకి నిలపాలని బి.జె.పి నాయకత్వం ఆలోచన చేసిందనీ ఉమ అందుకు తిరస్కరించారని పత్రికలు నివేదించాయి.
కాంగ్రెస్ వీడియో వెల్లడిని ‘నిరాశా నిస్పృహలతో’ చేసిన పనిగా బి.జె.పి అభివర్ణించింది. రెండు, మూడేళ్ళ క్రితం చెప్పిన మాటల్ని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు అని ప్రశ్నించింది. ద్వాపర యుగంలో జన్మించిన రాముడి కోసం అంటూ 16వ దశాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదు ను 20వ శతాబ్దంలో కూల్చడం అసందర్భం కానప్పుడు కేవలం మూడేళ్ళ క్రితం చెప్పిన మాటలు ఎలా అసందర్భం అవుతాయో బి.జె.పి నేతలు చెప్పాలి.

సర్లెండి ! రాజకీయ దూషణ భూషణలు గాలివాటం, నోటిదూల. కె.సి.ఆర్. నిన్నటి దాకా సోనియమ్మను తెలంగాణా దేవతగా అభివర్ణించి ఈ రోజు బలిదేవతగా తీర్చిదిద్దాడు. తిరిగి రేపు పాలనా పగ్గాలు చేపట్టవలసిన తరుణంలో కాంగ్రెస్ దన్ను కోసం అమ్మగారి కొంగు పట్టుకుని పట్టపగ్గాలుండవు.
nuvu nasa purushudu vi