ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర మలుపుల దారిలో ప్రయాణించడం ఇంకా ఆగిపోలేదు. ఇ.యులో ఉక్రెయిన్ చేరికను వాయిదా వేసిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనలతో కూల్చివేయడం ద్వారా ఇ.యు, అమెరికాలో అక్కడ తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాయి. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి రష్యా అనుకూల ఆందోళనలు నిర్వహిస్తుండడంతో నూతన తాత్కాలిక ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతోంది. టెర్రరిస్టులపై దాడి పేరుతో క్రమాటోర్స్కి పైకి పంపిన ఉక్రెయిన్ సైన్యం తమ పనిమానేసి ఆందోళనకారులతో కలిసిపోవడంతో నూతన ప్రభుత్వం అంతర్జాతీయంగా అప్రతిష్టను మూటగట్టుకోవడం తాజా పరిణామం.
లుగాన్స్క్, దోనెట్స్క్, ఖార్కివ్, స్లోవియాన్స్క్ తదితర ప్రాంతాల్లో నిరంతర ఆందోళనలు చెలరేగుతున్నాయి. అనేక చోట్ల రష్యా అనుకూల ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. భవనాల చుట్టూ బ్యారీకేడ్లు నిర్మించి పశ్చిమ అనుకూల ఉక్రెయిన్ ప్రభుత్వ బలగాలను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మే నెలలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారి ఇళ్లను చుట్టుముట్టి కూడా వారు ఆందోళన చేస్తున్నారు. కొందరు పోటీదారులపై దాడులు సైతం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో టెర్రరిస్టులను అణచివేసే పేరుతో ఉక్రెయిన్ కేంద్ర ప్రభుత్వం మిలట్రీ చర్యలకు దిగుతున్నట్లు ప్రకటించింది. తిరుగుబాటు చేస్తున్న ప్రాంతాలపై “టెర్రరిస్టు వ్యతిరేక చర్య” (Anti-Terrorist Operation) తీసుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించింది. స్లోవియాన్స్క్, క్రమాటోర్స్క్ పట్టణాలపైకి వాయు, భూ తల సైనికులను ట్యాంకులను పంపింది. అయితే ఆందోళన చేస్తున్న ప్రజలు తమపై దాడికి వచ్చిన సైనికులకు నచ్చజెప్పి తమలో కలిసిపోవడానికి సైనిక బలగాలను అంగీకరించేలా చేయడంతో టెర్రరిస్టు వ్యతిరేక చర్య కాస్తా ‘ఫ్లాప్ షో’గా మారిపోయింది.
తిరుగుబాటు చేస్తున్న దోనెట్స్క్ ప్రాంతంలోని పట్టణం క్రమాటోర్స్క్ లోనికి బుధవారం వాయు సేనలు, భూతల సేనలు ప్రవేశించాయి. ఉక్రెయిన్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపై ఆందోళనకారులను అణచివేసి వారి ఆధీనంలోని ప్రభుత్వ భవనాలను తమ అదుపులోకి తెచ్చుకోవడం సైనికులకు నిర్దేశించిన లక్ష్యం. కానీ క్రమాటోర్స్క్ పట్టణాన్ని తమ అదుపులో ఉంచుకున్న పారామిలట్రీ ఆందోళనకారులు తమపై దాడికి వచ్చిన పారాట్రూపర్లతో చర్చలు జరిపారు. వారికి నచ్చజెప్పి తమవైపు తిప్పుకోవడంలో సఫలం అయ్యారు. అనంతరం సదరు ట్రూపర్లు తమ ఉక్రెయిన్ జెండా తొలగించి రష్యా జెండా ధరించి స్లోవియాన్స్క్ పట్నంలోని ఆందోళనకారుల తరపున కాపలాగా వెళ్లారు.
“వారు టెర్రరిస్టులు గానీ వేర్పాటువాదులు గానీ కాదనీ, కేవలం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్ధానికులేనని మాకు తెలిసింది. దానితో వారితో పోరాటం చేయరాదని మేము నిర్ణయించుకున్నాం” అని ఉక్రెయిన్ కేంద్ర ప్రభుత్వం తరపున దాడికి వచ్చిన బలగాల సభ్యుడు ఒకరు చెప్పారని రష్యా వార్తా సంస్ధ ఆర్.ఐ.ఏ నొవొస్తి తెలిపింది. స్లోవియాన్స్క్ లో ఉన్న ఉక్రెయిన్ సాయుధ వాహనాలు ఉక్రెయిన్ జెండా తొలగించి రష్యా జెండా ఎగురువేస్తున్న దృశ్యాలు టి.వీల్లో ప్రసారం కావడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం నిరుత్తరురాలయింది. 300 మంది పారాట్రూపర్లు తమ ఆయుధాలను దించి వెనక్కి వెళ్లిపోవడానికి అంగీకరించారని మరో 60 మంది ట్రూపర్లు ఆందోళనకారులతో కలిసిపోయారని నిరసన నేతలు చెప్పారు.
ఇబ్బందికరంగా మారిన ఈ పరిణామంతో ఉక్రెయిన్ ప్రభుత్వం ఖంగు తిన్నది. జరిగిన ఘటనలను వివిధ సాకులతో కప్పి పుచ్చడానికి శతధా ప్రయత్నించి విఫలం అయి చివరికి జరిగింది అంగీకరించింది. ‘టెర్రరిస్టుల” లోకి జొరబడడానికి తమ సైనికులు తెలివిగా వ్యవహరించడానికే ఆందోళనకారులతో కలిసిపోయారని ఉక్రెయిన్ ప్రభుత్వం మొదట ప్రకటించింది. అనంతరం ఆ వాహనాలు తమవి కావనీ, రష్యానుండి వచ్చాయని మాట మార్చారు. చివరికి తమ సాయుధ వాహనాలను రష్యా అనుకూల “వేర్పాటువాదులు” తమ ఆధీనంలోకి తీసుకున్నారని అంగీకరించక తప్పలేదు. అయితే రష్యా ఏజంట్లు దానికి సహాయం చేశారని ఆరోపించింది.
కాగా ఉక్రెయిన్ విషయంలో ఇండియా మరోసారి రష్యాకు మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్ ప్రభుత్వం మైనారిటీల హక్కులను పరిరక్షించాలని భారత విదేశీ కార్యదర్శి సుజాతా సింగ్ మాస్కోలో ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి రాయబార పరిష్కారం వెతకాలే తప్ప బలప్రయోగానికి దిగడం వల్ల ప్రయోజనం లేదని అన్నారామె. రైట్ సెక్టార్, స్లోబోడా లాంటి మితవాద శక్తుల భాగస్వామ్యంతో ఏర్పరిచిన కొత్త ప్రభుత్వం రష్యా భాష ఎక్కువగా మాట్లాడే రాష్ట్రాల్లో సైతం రష్యన్ భాషను అధికారిక భాషగా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనినే సుజాతా సింగ్ ‘మైనారిటీ హక్కుల ఉల్లంఘన’గా చెబుతున్నారు.
“ఉక్రెయిన్ పరిస్ధితి విషయంలో సంయమనం పాటించాలని మేము స్ధిరంగా చెబుతున్నాము. చర్చల ద్వారా రాయబార పరిష్కారాలు వెతకాలి… ఉక్రెయిన్ సమాజంలోని అన్ని రకాల సెక్షన్ల ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. జాతి, భాషా పరమైన మైనారిటీల ప్రయోజనాలను కాపాడాలి. లేకపోతే ఘర్షణలు కొనసాగుతాయి. అక్కడ ఎప్పటికీ ఘర్షణ కొనసాగే అవకాశం ఉంటుంది” అని సుజాతా సింగ్ పేర్కొన్నారు. మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్న సుజాతా సింగ్ మాస్కోలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.
ఒంటరిని చేసి ఆంక్షలు విధించే విధానాన్ని ఇండియా సహించబోదని, ఉక్రెయిన్ పొరుగు దేశాల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని కోరింది. “మెరుగైన చర్య ఏమి తీసుకోవాలో నిర్ణయించడానికి మీరు రష్యాతో మాట్లాడాల్సి ఉంది. పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం చర్చలు, సంప్రదింపుల ద్వారా రాయబార పరిష్కారానికి పూనుకోవడమే” అని సుజాతా సింగ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గురువారం ఉక్రెయిన్, రష్యా, ఇ.యు, అమెరికాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. సంక్షోభ పరిస్ధితులను చక్కబెట్టడానికి జెనీవాలో ఈ నాలుగు దేశాలు, కూటములు సమావేశం అయ్యాయి. సంక్షోభం మరింత ముదరకుండా ఉండడానికి ఒక ఒప్పందానికి రాగలవని ఆశిస్తున్నారు.