పెళ్ళి ఫార్మాలిటీ మాత్రమే -మోడి సోదరుడు


Yashodaben

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వివాహ ప్రకటన రాజకీయ దుమారం వైపుకి ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నాయి. మోడి వివాహం చర్చ అయ్యే కొద్దీ రాహుల్ అవివాహం కూడా చర్చలోకి ఈడ్వబడొచ్చు. వివిధ పార్టీల అభ్యర్ధుల పాలనా సామర్ధ్యం, గుణగణాలు, ప్రజా పక్షపాతం లాంటి లక్షణాలు కాకుండా పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడమే ఎన్నికల ప్రచారంలో ప్రధాన ధోరణి అయ్యాక ఏమైనా జరగొచ్చు. కాగా మోడి వైవాహిక జీవితాన్ని సమర్ధిస్తూ ఆయన సోదరుడు పత్రికలకు ఎక్కడం తాజా పరిణామం.

తనకు ఆలు, బిడ్డలు లేరు కనుక తాను అవినీతికి పాల్పడే అవకాశం లేదని మోడి గతంలో ఓసారి చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుంటే సంపాదన యావ పెరుగుతుందని రాహుల్ కూడా తన (అ)వైవాహిక జీవనంపై తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. ఈ విధంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే భార్యా రాయిత్యాన్ని ఒకరు, వివాహ రాహిత్యాన్ని మరొకరు తమ ప్లస్ పాయింట్ గా చెప్పుకున్నారు. వీరిరువురూ ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతుండడం గొప్పగా చెప్పుకునే భారతీయ వైవాహిక వ్యవస్ధకు గౌరవమా, అగౌరవమా?

వదోదర పార్లమెంటు నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేస్తే తనకు వివాహం అయిందని మోడి తన అఫిడవిట్ లో పేర్కొన్నారన్న వార్త వెలువడిన వెంటనే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. “మోడి తన వైవాహిక స్ధాయిని అంగీకరించారు. మహిళల వెంట పడుతూ, తన భార్యకు దక్కవలసిన హక్కులను లేకుండా చేసిన వ్యక్తిని ఈ దేశ మహిళలు నమ్మవచ్చా? మోడీకి వ్యతిరేకంగా ఓటేయండి” అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రాసేశారు.

మోడి తన భార్యగా చెప్పిన యశోదా బెన్ ప్రస్తుతం 62 యేళ్ళ రిటైర్డ్ టీచర్. వారిది బాల్య వివాహం అనీ, ఆ వివాహం కేవలం మర్యాద కోసం (formality) జరిగినది మాత్రమే అని చెబుతూ మోడి సోదరుడు ప్రకటన జారీ చేయడంతో సరికొత్త అనుమానాలు రంగం మీదికి వచ్చాయి. మోడి వివాహం గురించి రచ్చ జరగకుండా నివారించడానికా అన్నట్లు మోడి సోదరుడు స్వయంగా ప్రకటన విడుదల చేశారు. ఆయన తన ప్రకటనను బి.జె.పి గుజరాత్ విభాగానికి ఇవ్వగా వారు దానిని పత్రికలకు విడుదల చేశారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

మోడి వివాహాన్ని ఒక సామాజిక మర్యాదగానే పరిగణించాలని మోడి అన్నయ్య సోమా భాయ్ ప్రకటించారని ది హిందూ, రాయిటర్స్ లు తెలిపాయి. “మా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. మాది పేద కుటుంబం. వారికి నరేంద్ర అందరి పిల్లల్లాంటివాడే. అలాంటి సందర్భంలో మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే యశోదా బెన్ తో అతని వివాహాన్ని నిర్వహించారు. కానీ ఆ తర్వాత ఆ వివాహం ఒక సామాజిక మర్యాదగానే మారిపోయింది. వివాహం కోసం వివాహం అన్నట్లుగా మారింది” అని సోమా భాయ్ తెలిపారు. గుజరాత్ లో మగవారి పేర్ల చివర భాయ్ అనీ, మహిళల పేర్ల చివర బెన్ అనీ చేర్చడం రివాజని తెలుస్తోంది.

(గుజరాత్ కాంగ్రెస్ లీగల్ సెల్ నేత, అడ్వకేట్ విజయ్ కనారా నిర్మించిన ఈ వీడియోను చూస్తే నరేంద్ర మోడి ‘సామాజిక మర్యాద’ పర్యావసానం పై ఒక అవగాహన రావచ్చు.)

***

“దేశానికి సేవ చేయడమే అతనికి తెలిసిన ఒకే ఒక్క మతం. అందుకే తను ఇల్లు, భౌతిక సౌఖ్యాలను వదులుకున్నారు. పెళ్లి అయిన వెంటనే ఇల్లు వదిలి వెళ్లిపోవడం వలన ఆయన వివాహాన్ని సామాజిక మర్యాదగానే పరిగణించాలి. ఇల్లు వదిలి వెళ్లిపోయాక ఆయన తన కుటుంబంతో ఎటువంటి సంబంధమూ పెట్టుకోలేదు. యశోదా బెన్ సైతం తన తండ్రి ఇంట్లో నివసిస్తూ విద్యారంగంలో పని చేస్తూ ఉండిపోయారు” అని సోమా భాయ్ తెలిపారు.

అయితే యశోదా బెన్ చెప్పిన వివరాలు సోమ భాయ్ తో విభేదిస్తున్నాయి. గత ఫిబ్రవరి నెలలో ఆమె ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వివాహం అయిన 3 సంవత్సరాల తర్వాత మోడి తనను విడిచి వెళ్లిపోయారని, ఆ మూడేళ్లలో కూడా తాము మూడు నెలలు మాత్రమే కలిసి ఉన్నామనీ ఆమె తెలిపారు. సోమా భాయ్ చెబుతున్నట్లుగా వివాహం అయిన వెంటనే మోడి ఇల్లు వదిలి వెళ్లిపోవడం పూర్తి వాస్తవం కాదని యశోదా బెన్ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తున్నది.

ఎప్పుడో 40-50 యేళ్ళ నాడు జరిగిన సంఘటన ఆధారంగా ఇప్పటి మోడిని అంచనా వేయడం సరికాదని సోమా భాయ్ తన ప్రకటనలో కోరారు. మోడి వివాహాన్ని కేవలం ఒక ఘటనగా మాత్రమే సోమా భాయ్ చూస్తున్నారు. కానీ సంఘ్ పరివార్ సంస్ధలు చెప్పే హిందూ సంస్కృతి, సంప్రదాయాలు వివాహాన్ని ఒక ఘటనగా పరిగణించవు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఒకసారి వివాహం అంటూ జరిగాక ఆ ఇద్దరు వ్యక్తులు సదరు వివాహ బంధానికి కట్టుబడి ఉండాలి. వివాహ బంధం నుండి తప్పుకున్నవారిని హిందూ సమాజం తేలికగా చూడడం అందరికి తెలిసిన విషయమే.

పైగా పశ్చిమ దేశాల వివాహ వ్యవస్ధలను మన వివాహ వ్యవస్ధతో పోలుస్తూ భారతీయ కుటుంబ విలువలను కీర్తించడం సంఘ్ పరివార్ సంస్ధలు తరచుగా చేస్తాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా పార్కుల్లో కనపడ్డ జంటలకు బలవంతపు వివాహం చేయడం సంఘ్ పరివార్ సంస్ధలకు ఇష్టమైన కార్యక్రమం. వివాహాన్ని కాపాడుకునే బాధ్యత ప్రధానంగా స్త్రీలపైనే మోపడం కూడా హిందూ వివాహ వ్యవస్ధ లక్షణం. ఈ నేపధ్యంలో మోడి వివాహాన్ని కేవలం ఒక సామాజిక మర్యాదగా పరిగణించాలని కోరడం భారతీయ వైవాహిక వ్యవస్ధను ఒక కోణంలో తేలిక చేసి మాట్లాడమే అవుతుంది.

మోడి వివాహం గురించి ఆయన కుటుంబ సభ్యుల కోరికను ఆమోదించినట్లయితే భారత దేశ స్త్రీ లోకం పెద్ద సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. నిజంగా దేశ సేవకు బయలుదేరినవారు భార్యా, బిడ్డలను వారి ఖర్మానికి వదిలేసినా తప్పు కాబోదన్న అర్ధం రావచ్చు. లేదా తమ స్వార్ధపూరిత అవసరాల కోసం ఆలు, బిడ్డలను వారి ఖర్మానికి వదిలేసి ఆనక తాను దేశసేవ కోసమే అలా చేశానని చెప్పే రాజకీయ నేతలు పుట్టగొడుగుల్లా పుట్టుకుని రావచ్చు.

భారత మహిళలూ, తస్మాత్ జాగ్రత్త!

One thought on “పెళ్ళి ఫార్మాలిటీ మాత్రమే -మోడి సోదరుడు

వ్యాఖ్యానించండి