
Supporters of the detained pro-Russian protesters gather in front of the court building in Kharkiv, April 9, 2014. REUTERS/Stringer
ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఇరు పక్షాలు చర్చలకు మాత్రం తలుపులు తెరిచే ఉంచారు. ఉక్రెయిన్ లో తమ తమ ప్రయోజనాలను ఘర్షణలు లేకుండా సంరక్షించుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇ.యు, ఉక్రెయిన్, రష్యాలు సమావేశం అవుతున్నాయి. ఇందులో ఉక్రెయిన్ పాత్ర నామమాత్రం.
ఉక్రెయిన్ పాలనను ప్రస్తుతం అదుపులో ఉంచుకున్నది ఇ.యు, అమెరికాలే కనుక ఆ మేరకు పశ్చిమ సామ్రాజ్యవాదులకు సానుకూలత ఏర్పడి ఉంది. అయితే ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో రష్యా భాష మాట్లాడే ప్రజలు శాంతియుతంగా లేరు. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను ఆక్రమించుకున్న రష్యా అనుకూల ఆందోళనకారులు తమకు ఉక్రెయిన్ కేంద్ర ప్రభుత్వం నుండి మరింత స్వతంత్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ కోరిక నెరవేరకపోతే రిఫరెండం జరిపి ఉక్రెయిన్ నుండి విడిపోవడానికి కూడా సిద్ధమే అని వారు ప్రకటించారు. ఈ విధంగా ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ ప్రాంతాల ప్రజల ఆందోళనల కారణంగా రష్యాకు కూడా సానుకూల పరిస్ధితి ఏర్పడి ఉంది. ఈ రెండు సానుకూలతల పునాదిగా ఇ.యు, అమెరికా లు ఒకవైపు, రష్యా మరొకవైపు కూర్చొని జెనీవాలో చర్చలు జరపడానికి రంగం సిద్ధం అయింది.
ఉక్రెయిన్ సంక్షోభం ముగియడానికి జెనీవా సమావేశాన్ని ఉద్దేశించామని ఇ.యు ప్రతినిధులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే సమావేశానికి నిర్దేశించిన ఎజెండాపై తమకు మరిన్ని వివరాలు ఇవ్వాలని రష్యా కోరుతోంది. అనగా ఎజెండాపై వివరాలు ఇవ్వకుండానే రష్యాను సమావేశానికి పిలిచారని అర్ధం అవుతోంది. ఈ విధంగా ఏకపక్షంగా ఏర్పాటు చేసిన సమావేశం వల్ల ఫలితం ఉంటుందా అన్నది అనుమానమే.
రష్యా ఒక పక్క తమకు మరిన్ని వివరాలు అడుగుతున్నప్పటికీ మరో పక్క సమావేశం కోసం ముందుకు సాగిపోతున్నామని ఇ.యు ప్రతినిధులు చెబుతున్నారు. “(రష్యాపై) మరిన్ని ఆంక్షలు విధించడానికి మేము సిద్ధం. అయినప్పటికీ చర్చలకు తలుపులు తెరిచి ఉంచడం కూడా అవసరం” అని ఇ.యు ప్రతినిధులు చెప్పారని రాయిటర్స్ తెలిపింది.
జెనీవాలో జరిగే చర్చలు ఉక్రెయిన్ లోని వివిధ పక్షాల మధ్య చర్చలు జరపడంపైనే కేంద్రీకరించాలి తప్ప చర్చల్లో పాల్గొనే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కాదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్, అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీకి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈ అంశంలో ఇ.యు + అమెరికా మరియు రష్యాల మధ్య ఏ మేరకు ఏకీభావం ఉన్నదీ తెలియలేదు.
రష్యా మాత్రం ఉక్రెయిన్ సంక్షోభాన్ని నాటో సభ్య దేశాల మధ్య తమ ప్రభావాన్ని కాపాడుకోవడానికి వినియోగిస్తున్నారని ఈ రోజు ఆరోపించింది. ఉక్రెయిన్ విషయంలో అసలు ఉనికిలో లేని శత్రువు ఉనికిలో ఉన్నట్లు భ్రమింపజేస్తూ నాటో ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రష్యా ఆరోపించింది.
ఉక్రెయిన్ లో వివిధ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి లాంటి మరిన్ని అధికారాలు ఇవ్వాలని రష్యా కోరుతోంది. అలా జరగనట్లయితే ఉక్రెయిన్ లో ఆందోళనలను అదుపు చేయడం కష్టం అవుతుందని వాదిస్తోంది. ఇది నిజం కూడా. మితవాద శక్తులు, నయా నాజీ సంస్ధలు ఉక్రెయిన్ లో ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న వారిలో ఉన్నాయి. అధికారం చేజిక్కించుకున్న వెంటనే రష్యన్ భాషను అధికార భాషగా రద్దు చేస్తూ వీరు డిక్రీ జారీ చేశారు. దీనితో తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాల్లోని రష్యన్ భాష మాట్లాడేవారిలో ఆందోళన మొదలయింది. మితవాద శక్తులు, నాజీ పార్టీలు తమను తన్ని తగలేస్తారని వారు భయపడుతున్నారు. ఫలితంగా లుగాన్ స్కీ, ఖార్కివ్, దోనెత్స్క్ లలో ఆందోళనలు తీవ్రం అయ్యాయి.
ఈ పరిస్ధితిని సొమ్ము చేసుకుని క్రిమియా తరహాలో ఆ ప్రాంతాలను కూడా కలిపేసుకోవాలని రష్యా చూస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ పుతిన్ ప్రకటనలు గానీ, ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గానీ ఇప్పటివరకైతే ఆ వైపుగా లేవు. పైగా చర్చల ద్వారానే సమస్య పరిష్కారం జరగాలనీ, అది కూడా ఉక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల ప్రజల డిమాండ్ లను పరిగణలోకి తీసుకోవాలని పుతిన్ స్ధిరంగా డిమాండ్ చేస్తున్నారు. అమెరికా, ఇ.యుల వైఖరి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆందోళన చేస్తున్న ప్రజల అభిప్రాయాలను వదిలేసి రష్యా తో చర్చిస్తామని చెబుతున్నాయి. ఉక్రెయిన్ పాలకులు సైతం ఇదే ధోరణిలో ఉన్నాయి.
పదవీచ్యుతుడయిన యనుకోవిచ్ సైతం రష్యాకు పక్కా అనుకూలుడెమీ కాదు. ఆయన ఉక్రెయిన్ లోని ఒక ధనిక వర్గ గ్రూపుకు ప్రతినిధి మాత్రమే. ఇ.యు లో కలవడం వలన ఈ వర్గాల ప్రయోజనాలకు భంగం కలగదన్న హామీ ఇ.యు, అమెరికా ల నుండి లభించలేదు. పైగా వారి ఆర్ధిక వనరులను పశ్చిమ దేశాలు తమ వశం చేసుకునే ప్రమాదాన్ని వారు గమనించారు. దీనిని ఏ మాత్రం పరిగణించని ఇ.యు, అమెరికాలు కేవలం తమ స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం, రష్యాను ఏకాకిని చేయడం కోసం ఉక్రెయిన్ లో పావులు కదుపుతున్నాయి.
ఇ.యు, అమెరికాలు ఈ ధోరణిలో ఉన్నంతవరకూ వారు చేసే ప్రతిపాదనలేవీ రష్యాకు అంగీకార యోగంగా కనిపించవు. కాబట్టి ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం లభించే ఆస్కారం కూడా తక్కువగా కనిపిస్తోంది. ఇ.యు, అమెరికాలు మారిన ప్రపంచ పరిస్ధితులను గుర్తించి అందుకు అనుగుణంగా వెనక్కి తగ్గడమే ఉక్రెయిన్ సంక్షోభానికి కనీస పరిష్కారం. లేదంటే మరిన్ని కఠిన ఘర్షణలను, సంక్షోభాలను ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కోక తప్పదు.