చివరి నిమిషంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బి.జె.పి ఏక కాలంలో వివిధ సర్కస్ ఫీట్లను ప్రజల ముందు ప్రదర్శించింది. హిందూత్వ కేడర్ ని సంతృప్తిపరచడానికి ఒకవైపు మతోన్మాద హామీలు గుప్పిస్తూ మరోవైపు హిందూత్వను ఆదరించని జనం కోసం అభివృద్ధి, ఉద్యోగాలు హామీలు ఇచ్చింది. హిందూత్వను వదులుకోలేని బలహీనత ఒకవైపు వెనక్కి లాగుతుండగా, బూటకపు అభివృద్ధి మంత్రంతో అయినా ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిన ఆగత్యం ఆ పార్టీకి కలిగింది. విదేశీ ప్రచార కంపెనీల సారధ్యంలో జాతీయతా సెంటిమెంట్లు రెచ్చగొట్టగల చాతుర్యం తమ సొంతమైనప్పుడు ఏ విద్య అయినా ప్రదర్శించవచ్చు.
జి.డి.పి వృద్ధి రేటును మేఘాలలో నడిపించడమే తమ ప్రధమ ప్రాధామ్యం అని బి.జె.పి మేనిఫెస్టో భారత జనానికి రాసిచ్చింది. సదరు జి.డి.పి 9 శాతం దాటినప్పుడు కూడా భారత జనానికి ఒక్క ఉద్యోగమూ లేకపోగా అయినకాడికి ప్రభుత్వ కంపెనీలను తెగనమ్మడం వల్ల ఉన్న ఉద్యోగాలు కూడా గల్లంతయ్యాయి. అలాంటిది వృద్ధి రేటును పునరుద్ధరించి తద్వారా ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టిస్తామన్న బి.జె.పి వాగ్దానం నెరవేరడం ఎలా సాధ్యమో ఆ పార్టీ నేతలు చెప్పాల్సి ఉంది.
ద్రవ్యోల్బణం కట్టడి చేస్తామని, పన్నుల సంస్కరణలు అమలులోకి తెస్తామని, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తామని బి.జె.పి మాట ఇచ్చింది. అదే నోటితో కాంగ్రెస్ పార్టీ పన్నుల ఉగ్రవాదం అమలు చేసిందని కూడా విమర్శించింది. ఈ పన్నుల ఉగ్రవాదం వల్ల పదేళ్ళు ఉద్యోగాలు లేని వృద్ధి జరిగిందని చెప్పింది. ఏమిటీ పన్నుల ఉగ్రవాదం (tax terrorism)?
ఆర్ధిక మంత్రిగా ఉండగా ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన GAAR (General Anti-Avoidance Rules) చట్టాన్ని ఉద్దేశిస్తూ బి.జె.పి మేనిఫెస్టో ఈ ‘పన్నుల ఉగ్రవాదం’ అన్న పదబంధాన్ని కనిపెట్టింది. పేరే చెబుతున్నట్లుగా పన్నుల ఎగవేతను అరికట్టడానికి ఉద్దేశించినదే గార్ చట్టం. విదేశీ, స్వదేశీ, ప్రైవేటు కంపెనీలు తమ అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి దేశ విదేశాల్లో పదుల కొద్దీ పేపర్ కంపెనీలు స్ధాపిస్తున్నాయి. తద్వారా భారత ప్రజల కొనుగోళ్ల నుండి లబ్ది పొందుతూనే అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను తదితర పన్నులను ఎగవేస్తున్నాయి. వోడాఫోన్ – హచిన్సన్ వ్యవహారం ఈ కోవలోనిదే.
దొంగ కంపెనీల నుండి దేశ ఆదాయాన్ని కాపాడుకోవడానికి చట్టం తెస్తే అది దేశానికి ఉపయోగం గానీ పన్నుల ఉగ్రవాదం ఎలా అవుతుంది? పన్నుల ఎగవేసే కంపెనీలకు అది ఉగ్రవాదంలా కనిపిస్తే కనిపించొచ్చు గానీ భారత ప్రజలకు అది మేలే కదా చేసేది? జనానికి మేలు చేసే చట్టాన్ని విమర్శించడం ద్వారా లేదా దేశ ఆదాయాన్ని కాపాడే చట్టాన్ని ఉగ్రవాదంగా చెప్పడం ద్వారా బి.జె.పి జనానికి చేయదలుచుకున్న మేలు ఏముంటుంది? ఆ పేరుతో విదేశీ కంపెనీల నిలువు దోపిడీకి గేట్లు తెరవడం కాకపోతే!
“యు.పి.ఏ ప్రభుత్వం అనుసరించిన టాక్స్ టెర్రరిజం వల్ల వ్యాపార వర్గాలలో ఆందోళన నెలకొనడంతో పాటు పెట్టుబడి వాతావరణం పైన కూడా ప్రతికూల ప్రభావం పడింది. దేశ పరువు కూడా దెబ్బ తిన్నది” అని బి.జె.పి మేనిఫెస్టో పేర్కొన్నది. అదీ అసలు విషయం. వ్యాపార వర్గాలు లేదా స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలను ఏ మాత్రం కష్టపెట్టకూడదు. వారు ఎన్ని పేపర్ కంపెనీలు పెట్టి ఎన్ని లక్షల కోట్ల పన్నులు ఎగవేసినా నోరు మూసుకుని సహకరించాలే తప్ప గార్ లాంటి చట్టాలు తెచ్చి పెట్టుబడి వాతావరణాన్ని చెరపకూడదు. పైగా దానివల్ల దేశ పరువు ప్రతిష్టలకు మాయని మచ్చ కలుగుతుంది. దేశంలోని జనం, వారి వనరులు ఏమైపోయినా విదేశాల్లో దేశం పేరు మారుమోగిపోవాల! విదేశాలంటే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే పశ్చిమ దేశాల కంపెనీల తరపున, ఐ.ఎం.ఎఫ్, ప్రపంచబ్యాంకుల తరపున ఇన్వెస్ట్ మెంట్ క్లైమేట్ గురించి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ గురించీ కాకి గోల చేసేది వారే.
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ధరల స్ధిరీకరణ నిధి (Price Stabilization Fund -PSF) ఏర్పాటు చేస్తామని బి.జె.పి మరో వాగ్దానం ఇచ్చింది. ఈ నిధి ద్వారా కోశాగార క్రమశిక్షణ (fiscal descipline) కూడా తెస్తామని చెప్పింది. పెరిగిపోతున్న మొండి బాకీలను అరికట్టడానికి బ్యాంకింగ్ రంగ సంస్కరణలు తెస్తామనీ చెప్పింది. పి.ఎస్.ఎఫ్ ద్వారా ఒకపక్క ఫిస్కల్ డీసెప్లిన్ పాటిస్తూ మరోపక్క ధరలను కూడా అరికట్టడం ఎలాగో వివరం లేదు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం అంటే ధరలు పెరగకుండా చూడడం. అంటే మార్కెట్ లో డబ్బు చలామణీ తగ్గించడం. డబ్బు చలామణీ తగ్గించే ప్రక్రియల్లో భాగంగానే ఆర్.బి.ఐ వడ్డీ రేటు పెంచుతుంది. సి.ఆర్.ఆర్, రివర్స్ రేపో తదితర ఉపకరణాల ద్వారా కూడా అది మార్కెట్ నుండి డబ్బును వెనక్కి తీసుకుంటుంది.
కానీ బి.జె.పి కోశాధికారి పీయూష్ గోయల్ గారే ఆర్.బి.ఐ చర్యలను తీవ్రంగా విమర్శించారు. వడ్డీ రేట్లు పెంచి సమస్యలను మరింత తీవ్రం చేశారనీ, పరిస్ధితిని దిగజార్చారని ఆయన ఆర్.బి.ఐ గవర్నర్ రాజన్ ని విమర్శించారు. వీటిల్లో ఏది నిజం? ద్రవ్యోల్బణం అరికట్టడం నిజమా? లేక వడ్డీ రేట్లపై బి.జె.పి నేతల విమర్శలు నిజమా? పొదుపు విధానాలకు ఉన్న మరో పేరే కోశాగార క్రమ శిక్షణ. రుణాలు, రాయితీలు, సబ్సిడీలు, సౌకర్యాలు తదితర రూపాల్లో ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉన్న సొమ్మంతా అభివృద్ధి పేరుతో కంపెనీలకు కట్టబెట్టడమే కోశాగార క్రమ శిక్షణ, లేదా పొదుపు విధానాలు. బి.జె.పి కూడా కోశాగార క్రమ శిక్షణ పాటిస్తానని వాగ్దానం ఇవ్వడం బట్టి జనానికి వచ్చేది ఉద్యోగాలు కాకపోగా ఇస్తున్నదానిలో కూడా కోతలు విధిస్తారని అర్ధం చేసుకోవచ్చు. ఎన్.డి.ఏ పాలనలో కూడా జరిగింది ఇదే.
వ్యవసాయ రంగానికి సంబంధించి ‘నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్’ పేరుతో దేశం అంతటికీ ఒకేఒక మార్కెట్ ను సృష్టిస్తానని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు కూడా పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ పేరుతో ఇప్పుడు ఉన్న అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. దేశానికంతటికి ఒకటే మార్కెట్ అంటే ఎలా సాధ్యం? రాష్ట్రాలు ఏమవ్వాలి? రాష్ట్రాల పరిధిలోని అధికారాలు లాక్కుంటారా? వివరాలు ఇస్తే తప్ప ఈ హామీల లోతు ఏమిటో తెలియదు.
బి.జె.పి ఇచ్చిన మరో ముఖ్య వాగ్దానం ఎఫ్.సి.ఐ కి సంబంధించినది. ఎఫ్.సి.ఐ కార్యకలాపాలను మరింత విస్తరించి సేకరణ, నిల్వ, పంపిణీలను కూడా ఎఫ్.సి.ఐ పరిధిలోనికి తెస్తామని, తద్వారా ఎఫ్.సి.ఐ సామర్ధ్యం పెంచుతామనీ తెలిపింది. అసలు సేకరించిన ధాన్యాలను నిల్వ చేయడానికే తగినన్ని గిడ్డంగులు లేవు. ఉన్నవాటితో కొత్త కార్యకలాపాలు ఎలా పెంచుతారో అది కూడా కోశాగార క్రమశిక్షణ పాటిస్తూ ఎలా చేస్తారో చూసి తీరాలి.
కంపెనీలకు ఆర్ధిక స్వేచ్చ ఇస్తామని ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్ధాపనకు ప్రోత్సాహాలు ఇచ్చి ఉద్యోగాల కల్పనా పెంచుతామని బి.జె.పి హామీ ఇచ్చింది. ఈ హామీ అమలులోకి వస్తే ఉపయోగమే. కానీ భారత పాలకులకు దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించిన చరిత్ర లేదు. బి.జె.పి పాలనలో కొత్తగా వస్తుందన్న నమ్మకమూ లేదు. నూతన ఆర్ధిక విధానాల పుణ్యమాని లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడి అనేకమంది నిరుద్యోగులయ్యారు. బి.జె.పి చెబుతున్న పెట్టుబడి అనుకూల వాతావరణం విదేశీ కంపెనీలకే తప్ప స్వదేశీ కంపెనీలకు కాదు. పెట్టుబడి వాతావరణం అంటేనే విదేశీ కంపెనీల కోసం అని అర్ధం. అలాంటిది ఒకవైపు పెట్టుబడి అనుకూల వాతావరణం అంటూ చిన్న, మధ్య పరిశ్రమలకు ప్రోత్సాహం ఎలా ఇస్తారో మరి?
పరిశ్రమల ప్రోత్సాహానికి తగిన అన్ని చర్యలూ తీసుకుంటామని బి.జె.పి హామీ ఇచ్చింది. వేగంగా అనుమతులు ఇప్పిస్తామని, రవాణా మౌలిక సౌకర్యాలు నిర్మిస్తామనీ, ఆటంకం లేని విద్యుత్ సరఫరా చేస్తామనీ, కార్మిక సంస్కరణలు అమలు చేస్తామనీ… తద్వారా పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామనీ హామీలు గుప్పించింది. అంటే ఇక కార్మిక వర్గానికి మరింత మూడిందన్నమాటే.
బి.జె.పి ఇచ్చిన ఒక వినూత్న వాగ్దానం 100 నగరాల నిర్మాణం. ఉన్న ఊళ్లను నగరాలుగా అభివృద్ధి చేస్తారో లేక ఊళ్లే లేని చోట కొత్త నగరాలు నిర్మిస్తారో చూడాలి. ఈ నగరాలు ఎలా ఉంటాయంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అలరారుతాయి. మౌలిక నిర్మాణాలకు కొదవ ఉండదు. ఈ నగరాల్లోకి అలా నడిచి వెళ్ళి ఇలా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రత్యేకీకరించబడిన ఏరియాలు ఈ నగరాల్లో మనల్ని ఊరిస్తాయి. ప్రజల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ‘జాతీయ బహుళ నైపుణ్య మిషన్’ అని ఒక దానిని ఏర్పరుస్తారుట.
ఇవన్నీ చెప్పాక బి.జె.పి మళ్ళీ పాత రాగాలను ఎత్తుకుంది. అయోధ్యలో రాముడికి గుడి నిర్మిస్తానంది. జమ్ము & కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసేస్తానంది. యూనిఫారం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) అని అమలులోకి తెస్తానంది. ఇవన్నీ చిక్కుముడులు అని కార్టూనిస్టు సూచిస్తున్నారు. వీటి ద్వారా లబ్ది పొందే ప్రజలు ఎవరో మనకి తెలియదు. ఈ చిక్కు ముడులతో జనంలోనే తంపులు పెట్టి లబ్ది పొందేదీ మాత్రం పాలకులే.
పలు ఆకర్షణీయ వాగ్దానలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న బి.జె.పి మేనిఫెస్టో, జనం చెవుల్లో కమలం పూలు పెట్టి వారి తోకలను మాత్రం ముడి పెట్టి తగువులు పెట్టేదిగా ఉందని కార్టూన్ సూచిస్తోంది.
