అణ్వస్త్రాలు: బి.జె.పిది నో-ఫస్ట్-యూజ్ సిద్ధాంతం కాదా?


pokhran II

రేపు సాధారణ ఎన్నికలు ప్రారంభం అవుతాయనగా బి.జె.పి ఈ రోజు తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి మోడి ప్రచారాస్త్రాలకు, మేనిఫెస్టో రచయితల అభిప్రాయాలకు వైరుధ్యం తలెత్తడం వల్లనే మేనిఫెస్టో విడుదల ఆలస్యం అయిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అభివృద్ధి, ఉద్యోగాలు అంటూ మోడి ప్రచారం చేస్తుండగా సంఘ్ పరివార్ పెట్టీ డిమాండ్లయిన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, రాముడి గుడి నిర్మాణం, యూనిఫాం సివిల్ కోడ్ లాంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచడంతో దాని విడుదల ఆలస్యం అయిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.

బి.జె.పి మేనిఫెస్టోకు సంబంధించి భారత పత్రికలు పెద్దగా పట్టించుకోని అంశం, అణ్వస్త్రాలు. భారత ప్రభుత్వం తనది ‘నో-ఫస్ట్-యూజ్’ డాక్ట్రిన్ అని చెప్పుకుంటుంది. ‘ఇతరులు ఎవరైనా మనపైన అణ్వస్త్రాలతో దాడికి దిగితే తప్ప మనంగా మొదటిసారి అణ్వస్త్రాలు ప్రయోగించబోము’ అన్నది ఈ సిద్ధాంతం అంతరార్ధం. బి.జె.పి కూటమి అధికారంలోకి వస్తే ‘నో-ఫస్ట్-యూజ్’ సిద్ధాంతానికి తిలోదకాలు ఇవ్వనున్నారని ఈ రోజు విడుదల అయిన బి.జె.పి మేనిఫెస్టో ద్వారా అర్ధం అవుతోంది.

భారత అణు సిద్ధాంతాన్ని పునః పరిశీలిస్తామని బి.జె.పి మేనిఫెస్టో ప్రకటించింది. ఏ దేశంతోనైనా యుద్ధం వస్తే తాముగా మొదట అణ్వస్త్రాలు ప్రయోగించకపోవడం అన్నది భారత అణు సిద్ధాంతం యొక్క కేంద్ర సారం. దీనిని పునః పరిశీలిస్తామని చెప్పడం అంటే ప్రత్యర్ధి చర్యలతో సంబంధం లేకుండానే అణ్వస్త్రాలను ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడమే అని భావించాల్సి వస్తోంది. కానీ బి.జె.పి మేనిఫెస్టోలో ‘పునః పరిశీలన’ (revise) అంటే అర్ధం ఏమిటో వివరం లేదని తెలుస్తోంది. అణ్వస్త్ర ప్రయోగాన్ని తెరమీదికి తేవడం ద్వారా మరోసారి భారత ప్రజల్లో కృత్రిమ భావోద్రేకాలను రెచ్చగొట్టే పనికి బి.జె.పి పూనుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

1974లో ఇండియా మొదటిసారి పోఖ్రాన్ వద్ద అణ్వస్త్రాలను పరీక్షించింది. ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ చర్యను మాజీ ప్రధాని వాజ్ పేయి బహుధా కీర్తించారు. ఇందిరా గాంధీని సాహసవంతురాలుగా, కాళికా దేవి (లేదా దుర్గా దేవి) గా ఆయన కీర్తించారు. మళ్ళీ 1998లో మరోసారి ఇండియా అణు బాంబులను అదే చోట పరీక్షించింది. రెండోసారి జరిగిన ఈ పరీక్షలు పోఖ్రాన్ –II గా ప్రసిద్ధికెక్కాయి. పోఖ్రాన్ II పరీక్షలు వాజ్ పేయి నేతృత్వంలోని బి.జె.పి అధికారంలో ఉండగా జరగడం గమనార్హం.

పోఖ్రాన్ II పరీక్షలు దేశానికి అవసరమైన పరిస్ధితుల్లో జరిగాయని కొందరు సమర్ధకులు తరచుగా చెప్పే మాట. కానీ 1998 లో ఇండియా భయపడాల్సిన పరిస్ధితులు గానీ, అణు పరీక్షల ద్వారా భయపెట్టవలసిన శత్రువులు గానీ చురుకుగా లేని మాట ఒక వాస్తవం. 1990లో సోవియట్ రష్యా కూలిపోయినందున అంతర్జాతీయంగా రక్షణపరంగా ఒక నమ్మకమైన మిత్రుడిని కోల్పోయినందున అణు పరీక్షలు జరపవలసి వచ్చిందని అణు పరీక్షల సమర్ధకులు వాదిస్తారు.

కానీ వాస్తవంలో సోవియట్ రష్యా వారసురాలు రష్యన్ ఫెడరేషన్ ఇండియాకు మరిన్ని రక్షణ పరికరాలు అమ్ముకోవలసిన పరిస్ధితిలోనే ఉంది. పైగా ఆఫ్ఘనిస్ధాన్ నుండి సోవియెట్ సేనల ఉపసంహరణ వలన పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో తన సైనిక పాటవాన్ని కేంద్రీకరించవలసిన పరిస్ధితిలో ఉంది. మరో శత్రువుగా భావించే చైనా, దేశీయంగా తీయానాన్మెన్ అనంతర సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయి ఉండగా విదేశీ పరంగా తైవాన్ ద్వీపం సంక్షోభం లోనూ, ఉత్తర కొరియాపై అమెరికా దాడి జరగవచ్చన్న ప్రమాదంలోనూ కూరుకుని ఉంది. కాబట్టి భారత పాలకులు ఎప్పుడూ చెప్పే విదేశీ శత్రువులు తమ తమ సమస్యల్లో ఉన్నారే తప్ప ఇండియాను బెదిరించే పరిస్ధితుల్లో లేరు.

పోఖ్రాన్ II పరీక్షలకు భారత పాలకులను పురికొల్పిన ఏకైక కారణం దేశంలోపల నెలకొన్న అంతర్గత రాజకీయ పరిస్ధితులు మాత్రమే. అప్పటి బి.జె.పి ప్రభుత్వానికి తాము పక్కా దేశ భక్తులుగానూ, అవసరం అయితే అణ్వస్త్ర పరీక్షలకు సైతం వెనుదీయని గొప్ప జాతీయవాదులుగానూ ప్రజలకు చాటుకోవలసిన పరిస్ధితిలో ఉంది. బి.జె.పి ప్రధాన అస్త్రం రామ జన్మ భూమి -బాబ్రీ మసీదు వివాదం అప్పటికే రాముడి విల్లు నుండి సంధించబడిన రామబాణం అయిపోయింది. (ప్రయోగించిన బాణాన్ని రాముడు తిరిగి ప్రయోగించడని పురాణాలు చెప్పే మాట.) హిందూత్వ బాణం ఒట్టిపోగా బి.జె.పి నేతలకు ఆపద్భాంధవునిలా కనిపించిన బాణం ‘అణు బాణం’. ఆ విధంగా అవసరం లేని పరిస్ధితుల్లో సైతం పోఖ్రాన్ II అణు పరీక్షలు జరిగాయి.

ఇప్పుడు మళ్ళీ బి.జె.పి అన్వస్త్రాల సెంటిమెంటును తిరిగి రెచ్చగొట్టడానికి సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. భారత అణు బాంబు పాకిస్ధాన్ ను ఏ మాత్రం బెదరగొట్టకపోగా ఆ దేశం కూడా అణు పరీక్షలు జరిపి గుట్టలు గుట్టలుగా అణ్వస్త్రాలు పోగేసుకోవడానికి దోహదపడింది. అంతర్జాతీయ పరిశీలకుల అంచనా ప్రకారం ఇప్పుడు సంఖ్యా పరంగా భారత్ వద్ద ఉన్న అణ్వస్త్రాల కంటే పాకిస్ధాన్ వద్ద అణ్వస్త్రాలే ఎక్కువ. చైనా ఎలాగూ అధికారిక అణ్వస్త్ర దేశం.

ఈ నేపధ్యంలోనే బి.జె.పి ‘నో-ఫస్ట్-యూజ్’ సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం ద్వారా ఉపఖండంలో మరోసారి ఆయుధ, అణ్వాయుధ పోటీకి తెరలేపుతోంది. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యం. దేశ ఆర్ధిక వనరులను మరింతగా రక్షణ బడ్జెట్ లోకి ప్రవహించేందుకు దారి తీసేందుకు తప్ప భారత ప్రజలకు ఎందుకూ ఉపయోగపడని వ్యూహం. ఆసియా-పివోట్ వ్యూహం ద్వారా అమెరికా ఇప్పటికే తన సామ్రాజ్యవాద యుద్ధ కేంద్రాన్ని మధ్య ప్రాచ్యం నుండి మధ్య ఆసియాకు, తూర్పు ఆసియాకు జరిపింది. ఇందులో ఇండియాను కూడా భాగస్వామిని చేసుకుని చైనాకు వ్యతిరేకంగా ఇండియాను నిలబెట్టడానికి అమెరికా తహతహలాడుతోంది. బి.జె.పి మేనిఫెస్టో, అణ్వస్త్ర సిద్ధాంతాన్ని శాంతియుత ప్రయోజనాలకు కాకుండా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ధోరణిలోకి మార్చడం అమెరికా ఆసియా-పివోట్ వ్యూహాన్ని సంతృప్తి పరచడానికి ఉద్దేశించింది అయినా ఆశ్చర్యం లేదు.

ఈ వ్యూహాన్ని విడనాడి బి.జె.పి పార్టీ తమ ప్రధాని అభ్యర్ధి చెబుతున్నట్లు ప్రజల అభివృద్ధి, ఉద్యోగాల పెంపు పైన కేంద్రీకరిస్తే అది ప్రజలకు మేలు చేయగలదు. అభివృద్ధి నినాదాన్ని కూడా మోడి గుజరాత్ లోవలే కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేదిగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే నిజమైన అభివృద్ధికి దోహదం చేసేదిగా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజల ఆశలు, ఆకాక్షలను బి.జె.పి ఔదలదాల్చడం అనుమానమే అయినా వాటిని వ్యక్తం చేయడంలో తప్పు లేదు.

2 thoughts on “అణ్వస్త్రాలు: బి.జె.పిది నో-ఫస్ట్-యూజ్ సిద్ధాంతం కాదా?

  1. నో-ఫస్ట్-యూజ్ డాక్ట్రిన్ సిద్ధాంతంలోనే లోపం ఉంది!మనపై ఎవరైన దాడికి దిగేవరకు మనమెందుకు చేతులు కట్టుకుకూర్చోవాలి?తద్వారా మనుకు జరిగే నష్టాన్ని మనం అహ్వానించాలా? వీలైతే మనాణ్వాయుధాలని నిర్వీర్యం చేస్తామని ప్రకటించే పార్టీ ఏదైనా ఉందా?

  2. అయ్యో! లోపం ఎందుకులేదూ… మీ వంటగదిలో కత్తి (అనగా మారణాయుధం) ఉండుండాలే! కాసేపు మీరు అజాతశత్రువుకాదని అనుకుందాం. మీకు మీపొరుగువారితో ఇంతకు ముందు కనీసం కొన్నిసార్లు గొడవలి జరిగాయనుకుందాం. అలా జరిగినప్పుడు ఎన్నిసార్లు మీరు కత్తి పుచ్చుకొని మీ వీధిలో వీరంగమాడారో చెప్పగలరా? కనీసం అలా చేసినవారినివాడుకభాషలో (ఇంగ్లీషు వాడండి ఫర్లేదు) ఏమంటారో కొంచెం చెప్పగలరా?

    సార్! మన పొరుగువాడిదగ్గరకూడా కత్తులుంటాయి. అవి వాడు ఉపయోగించడు అన్న నమ్మకమే మనల్ని, మన తగాదాల్ని కోర్టులవైపో, అధమంగా బాహాబాహీ పోరాటాలవైపో నడిపిస్తుంది. ప్రతి ఒక్కడూ కత్తిపట్టే ఫ్యాక్షనిస్టే అయితే చివరకు అందరి జీవితమూ దుర్భరమే అవుతుంది.

    దేశాలుకూడా ఇందుకు మినహాయింపుకాదు.

వ్యాఖ్యానించండి