ఓపిక ఉండాలే గానీ ఎన్నికల చిత్రాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపైనా, అభ్యర్ధుల పైనా నానా కూతలూ కూసుకునే ఎన్నికల కాలంలో భరించలేని శబ్ద కాలుష్యం జనాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఒక్క శబ్ద కాలుష్యం ఏం ఖర్మ, పత్రికల నిండా సాహితీ కాలుష్యం కూడా దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది.
ఒకరి లోపాలు మరొకరు ఎత్తి చూపుకుంటూ గాలిని నింపే దూషణలతో పాటు అప్పుడప్పుడూ -మారుతున్న కాలాన్నీ, మారని అవసరాలను బట్టి- ప్రత్యర్ధులపై ప్రశంసల పూల బొకేలు కూడా విసురుకోవడం నేటి ఎన్నికల కాలపు ప్రత్యేకతగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సాధించిన అభివృద్ధిని బి.జె.పి జాతీయ ప్రధాన కార్యదర్శి వరుణ్ ప్రశంసించడం, మరోవైపు యు.పి.ఏ కూటమి భాగస్వామి పార్టీ ఎన్.సి.పి నేత, ఒకప్పటి కాంగ్రెస్ నేత అయిన శరద్ పవార్, వచ్చే ఎన్నికల్లో బి.జె.పి దే మొదటి స్ధానం అంటూ జోస్యం చెప్పిన తీరు… ఈ ప్రత్యేకతకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
నరేంద్ర మోడికి మతిపోయిందని విమర్శించిన శరద్ పవార్ మరుసటి రోజే బి.జె.పి కి ప్రధమ స్ధానం, కాంగ్రెస్ కి ద్వితీయ స్ధానం ఇవ్వడం బట్టి ఆయన ఎన్.డి.ఏ కూటమిలోకి జంప్ చేయవచ్చని భావించాల్సి వస్తోంది. ఇప్పటికే ఆయన ఎన్.డి.ఏ లో కలవడానికి బేరసారాలు నడిపారనీ, కానీ వీలుకాక మిన్నకుండిపోయారని కూడా కొందరు బి.జె.పి నేతలు వెల్లడించారు కూడాను.
ఎవరు చెప్పులూ, కుర్చీలూ విసిరినా, ఇంకెవరు పూల బొకేలు విసిరినా ఆ చర్యల వెనుక అంతరార్ధం తమ అవసరాలు ఎక్కడ నెరవేరతాయో నిర్ణయించుకునే రాజకీయ నాయకుల దిగజారుడే కనిపిస్తుంది తప్ప, వారి మారిన ప్రాధామ్యాలు మాత్రం కాదు. వారి ఆస్తులు, వ్యాపారాలు, పలుకుబడి ఇవన్నీ స్ధిరమైనవి. వాటిలో ఎన్నడూ మార్పులు ఉండవు. మారేది కేవలం తమ అవసరాలకు అనుగుణమైన పైపై తొడుగులు (పార్టీలు) మాత్రమే.
