మోడి వస్తే ఆర్.బి.ఐ గవర్నర్ కి పదవీ గండమా?


Raghuram Rajan

నరేంద్ర మోడి ప్రధాని అయితే (బి.జె.పి కూటమి అధికారంలోకి వస్తే) ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ కి పదవీ గండం తప్పకపోవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ నిన్న ఒక కధనం ప్రచురించింది. పదవి నుండి తప్పుకోమని అడగకపోతే కనీసం రఘురాం రాజన్ పై కంపెనీల కోసం తీవ్ర స్ధాయిలో రాజకీయ ఒత్తిడులయినా ఉంటాయని ఆ పత్రిక వివరించింది. ఆ మేరకు వివిధ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ సంస్ధలు ఆశిస్తున్నాయనీ, కొన్నయితే ఏర్పాట్లే చేసుకుంటున్నాయని రాయిటర్స్ వివరించింది. రాయిటర్స్ కధనం నరేంద్ర మోడి అభివృద్ధి మాటున ఎవరి పక్షపాతం వహిస్తారో వివరిస్తుండగా కార్పొరేట్ కంపెనీల గురించి కూడా సమాచారం ఇస్తోంది.

రాయిటర్స్ అందించిన కధనాన్ని లైవ్ మింట్ పత్రిక యధాతధంగా అందించింది. ఈ లైవ్ మింట్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (అమెరికా) పత్రికకు నుబంధం లేదా సోదర పత్రిక. ఈ లెక్కన వాల్ స్ట్రీట్ కంపెనీలు కూడా నరేంద్ర మోడి రాక కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నాయని అనుమానం వస్తే మన తప్పు ఉండదు. అమెరికా కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చ ప్రభుత్వం ఇండియాలో అధికారంలోకి వస్తే అది భారత ప్రజల వ్యతిరేక ప్రభుత్వమే అవుతుందని వేరే చెప్పనవసరం లేదు.

కానీ బి.జె.పి ప్రచారంలో అత్యధికంగా వినిపిస్తున్న మంత్రం ‘అభివృద్ధి, ఉద్యోగాలు.’ బి.జె.పి అధికారంలోకి వస్తే అభివృద్ధి వెల్లివిరుస్తుందని, ఉద్యోగాలు బొట బొటా రాలిపడతాయని అందుకే బి.జె.పి ప్రచారం నుండి దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీ ఇమామ్ బుఖారీతో సమావేశం అయ్యారని, కాంగ్రెస్ పార్టీ మతోన్మాద రాజకీయాలు చేస్తోందనీ, ఒక బి.జె.పి అగ్రనేత విమర్శించారు కూడాను. కాంగ్రెస్ పై చర్య తీసుకోవాలని బి.జె.పి ఫిర్యాదు కూడా చేసింది. ఆ మురసటి రోజే (ఈ రోజు అనగా ఏప్రిల్ 5) ఉత్తర ప్రదేశ్ లో బి.జె.పి ప్రచార సారధిగా నియమించబడిన అహ్మద్ షా, ముజఫర్ నగర్ లో జరిగిన అవమానానికి జనం ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపు ఇచ్చాడు. రెండు ప్రధాన పాలక పార్టీల సెక్యులరిజం, కుహనా సెక్యులరిజం ఇలా తగలడ్డాయి. `

‘ఉద్యోగాలే అన్నిటికన్నా ముందు’ అన్న మోడి ప్రచారం వల్ల ఆయనకి జనం నుండి పెద్ద ఎత్తున మద్దతు రావడం ఖాయం అని బి.జె.పి వ్యూహకర్తలు భావిస్తున్నారని రాయిటర్స్ తెలిపింది. ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు సాధించడం ద్వారా శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పరిస్తే ఆర్.బి.ఐ గవర్నర్ గా కూడా తమ మనిషినే నియమించుకునే ఆలోచనలో బి.జె.పి ఉన్నదని పత్రిక తెలిపింది. అనగా రఘురాం రాజన్ తమకు అనుకూల వ్యక్తి కాదని బి.జె.పి భావిస్తోందన్న అర్ధం ఇక్కడ స్ఫురిస్తోంది.

ఐ.ఎం.ఎఫ్ లో మాజీ ఉద్యోగి అయిన రఘురాం రాజన్ వలన బి.జె.పి కి వచ్చిన ఇబ్బంది ఏమిటి? భారత దేశంలో ప్రధానమైన మంత్రి పదవుల్లో గానీ, ఆర్.బి.ఐ గవర్నర్, ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ లాంటి పదవుల్లో గానీ నియమితులయ్యేవారు సాధారణంగా ఇక్కడి ప్రభుత్వాల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నియమించబడేవారు కాదు. అంతర్జాతీయ ద్రవ్య సంస్ధలు, పశ్చిమ కార్పొరేట్ కంపెనీలు, వాల్ స్ట్రీట్ & ద సిటీ ల్లోని కంపెనీల ఆదేశాలకు అనుగుణంగానే వారు నియమితులవుతారని వికీ లీక్స్ ద్వారా వెల్లడి అయిన ‘డిప్లొమేటిక్స్ కేబుల్స్’ రుజువు చేశాయి. కాబట్టి రాజన్ వల్ల బి.జె.పి ప్రభుత్వానికి కొత్తగా వచ్చే ఇబ్బంది ఏమిటి?

బహుశా రాజన్, కాంగ్రెస్ పార్టీ నియమించిన అధికారి కావడమే బి.జె.పి ఇబ్బందా? కాదని బి.జె.పి ట్రెజరర్ పీయూష్ గోయల్ గతంలో చేసిన విమర్శలు తెలియజేస్తున్నాయి. ద్రవ్యోల్బణం అరికట్టడానికి రాజన్ మూడుసార్లు వడ్డీ రేట్లు పెంచడం గోయల్ కి ఇష్టం లేకపోయింది. ఒక పక్క భారత వృద్ధి రేటు దశాబ్ద కాలంలోనే అతి తక్కువ స్ధాయికి పడిపోతుంటే ద్రవ్యోల్బణం అంటూ వడ్డీ రేటు పెంచుకుంటూ పోవడం ఏమిటని గోయల్ విమర్శ. ద్రవ్యోల్బణం పెరిగి జనానికి సరుకులు అందుబాటులో లేకుండా పోయినంత మాత్రాన వడ్డీ రేట్లు పెంచేసి ధనిక కార్పొరేట్ వర్గాలకు పెట్టుబడులకు కావలసిన రుణాలు అందుబాటులో లేకుండా చేస్తారా అన్నది పీయూష్ గోయల్ విమర్శ! “వడ్డీ రేట్లు పెంచడం ద్వారా గవర్నర్ రాజన్ సమస్యలను మరింత తీవ్రం చేస్తున్నారు. పరిస్ధితిని మరింత దిగజార్చుతున్నారు” అని గోయల్ ‘ఎకనమిక్ టైమ్స్’ తో మాట్లాడుతూ విమర్శించారు.

ఆర్.బి.ఐ బాధ్యతలు చేపట్టాక రాజన్ మూడు దఫాలుగా 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటు పెంచారు. అనగా 0.75 శాతం మేర వడ్డీ రేటు పెంచి 8 శాతానికి చేర్చారు. అంతకుమునుపు దువ్వూరి సుబ్బారెడ్డి వడ్డీ రేట్లు పెంచినప్పుడు కినుక వహించిన ఆర్ధిక మంత్రి చిదంబరం రాజన్ పెంచుతున్నపుడు ఎందుకో బహిరంగ విమర్శలు చేయలేదు. బహుశా విమర్శించీ ఉపయోగం లేదనుకున్నారేమో!

ఢిల్లీలోని ఆర్ధిక విశ్లేషణ సంస్ధ ‘అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్’  కి చెందిన విశ్లేషకుడు సతీష్ మిశ్రా బి.జె.పి & నరేంద్ర మోడి vis-a-vis రఘురాం రాజన్ విషయమై ఇలా క్లుప్తీకరించారు “నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం గవర్నర్ రాజన్ ని తొలగించినా నాకు ఆశ్చర్యం లేదు. (ఎందుకంటే) మోడి ఎలాంటి వ్యతిరేకతనూ సహించరు.” (రాయిటర్స్ వయా లైవ్ మింట్)

రాజన్ చికాగో లోని ‘బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ లో ప్రొఫెసర్ గా పని చేసిన వ్యక్తి. వాషింగ్టన్ లోని ఐ.ఎం.ఎఫ్ కార్యాలయంలో పని చేయడానికి ఇదే ఆయనకున్న క్వాలిఫికేషన్. రెండేళ్లు ఐ.ఎం.ఎఫ్ లో పని చేసిన రాజన్ జి20 సమావేశాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాబట్టి ఆయన పశ్చిమ రాజ్యాలకు, ఐ.ఎం.ఎఫ్ నిర్దేశించే ఆర్ధిక సూత్రాలకు అనుగుణంగా వ్యవహరిస్తారనడంలో సందేహం అనవసరం. అయినప్పటికీ ఆర్.బి.ఐ గవర్నర్ కి పెద్దగా స్వతంత్రత ఏమీ ఉండదు. పైగా ఆర్.బి.ఐ చట్టం ప్రకారం గవర్నర్ ని తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఆర్.బి.ఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, డైరెక్టర్లను ఎవరినైనా కేంద్రం తొలగించవచ్చు. కానీ ఆర్.బి.ఐ 80 యేళ్ల చరిత్రలో గవర్నర్ ని మధ్యలో తొలగించిన ఉదాహరణ లేదు. ఇప్పటి గ్లోబలీకరణ యుగంలో ఆర్.బి.ఐ విషయంలో తీసుకునే నిర్ణయాలు విదేశీ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ల పైన తీవ్ర ప్రభావం చూపుతాయి గనుక గవర్నర్ ని మధ్యలో తొలగించడం ఇంకా ప్రమాదం.

బి.జె.పి అధికారంలోకి రావచ్చన్న అంచనాతోనే రాజన్ ద్రవ్యోల్బణం విషయమై తాను వ్యక్తం చేస్తున్న ఆందోళనను తగ్గించుకున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది తగ్గిపోతున్న ద్రవ్యోల్బణం వల్లనే తప్ప బి.జె.పి కోసం కాదని చెప్పేవారూ ఉన్నారు. మొత్తం మీద మోడి అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్.బి.ఐ విధానాలను మార్చే ప్రక్రియ ఎంతో కొంత నడుస్తోందని కొందరు ఢంకా బజాయిస్తున్నారు.

ఆర్ధిక మంత్రి గానీ, హోమ్ మంత్రి గానీ కాగలరని భావిస్తున్న అరుణ్ జైట్లీ మాత్రం రాజన్ కి వచ్చిన భయం ఏమీ లేదని భరోసా ఇస్తున్నారు. ఆ మధ్య ఒక టి.వి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఎవరన్నా తమ బాధ్యతని మంచిగా చేస్తుంటే వారు తప్పనిసరిగా కొనసాగుతారు. కానీ అందులో కూడా ఆయన ‘మంచిగా చేస్తుంటే’ అన్న షరతు విధించారు. మంచిగా అంటే తాము అనుకున్న విధంగా అని అనువదించుకుంటే గనక అలా లేకపోతే తప్పిస్తామన్న సూచన ఉన్నట్లే.

మరో సంగతి కూడా చెప్పుకోవాలి. మాన్యుఫాక్చరర్లు, వ్యాపారులు రూపాయి విలువ విషయంలో రాజన్ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారని రాయిటర్స్ తెలిపింది. రూపాయి విలువ పడిపోయినందుకే వారి అసంతృప్తి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. రూపాయి విలువ ఇటీవలి కాలంలో కాస్త కోలుకుంది. ఇటీవలిదాకా డాలర్ ఒక్కింటికి 62 రూపాయల పై చిలుకు పలికిన రూపాయి విలువ ప్రస్తుతం డాలర్ కి 60 రూపాయలకు చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 15 శాతం వరకు రూపాయి కోలుకుంది. ఇది వ్యాపారులకు, సరుకు ఉత్పత్తి కంపెనీలకు నచ్చలేదు. రూపాయి విలువ అవసరం అయినదానికంటే ఎక్కువ పెరగడానికి గవర్నర్ అనుమతించారని వారి ఫిర్యాదు. రూపాయి విలువ పెరిగేకొద్దీ జనానికి లాభం. ఎందుకంటే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ ఎగుమతిదారులకు, వ్యాపారులకు నష్టం. ఎందుకంటే వారి సరుకుల ధరలు పెరిగి ఎగుమతుల మార్కెట్ లో పోటీఇవ్వగల సామర్ధ్యాన్ని కోల్పోతాయి. వ్యాపారులకేమో లాభ శాతం తగ్గిపోతుంది. వ్యాపారులు, కంపెనీలు బి.జె.పి ని ఇష్టపడతారని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.

ఇండియాలో ప్రభావం అతి పెద్ద వ్యాపార లాబీయింగ్ సంస్ధ ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ (సి.ఐ.ఐ) వడ్డీ రేటు కనీసం 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) తగ్గించాలని ఇప్పటికే డిమాండ్ చేసింది. దేశీయ సరుకు తయారీ కంపెనీలకు సానుకూల మార్పిడి రేటు అందుబాటులో ఉంచాలని (అనగా రూపాయి విలువ తగ్గించాలని) కూడా సి.ఐ.ఐ డిమాండ్ చేసింది. కాబట్టి బి.జె.పి అధికారంలోకి వస్తే రూపాయి విలువ తగ్గిపోవచ్చని భావించాల్సివస్తోంది.

రాజన్ మాత్రం ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం వివిధ కూటములకు అంత తేలిక కాదన్న అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తున్నది. విదేశీ మదుపుదారులు కొత్త ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉంటుందన్న బుల్లిష్ అభిప్రాయంతో ఉన్నారని కానీ అది అంత తేలిక కాదని రాజన్ హెచ్చరించారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంలోనే ఆయన సూచనలు చేశారు. “ఎన్నికల అనంతరం కొద్దిపాటి అలజడికి మనం సిద్ధంగా ఉండాలి” అని పరపతి విధాన పత్రం పేర్కొంది.

విదేశీ మదుపుదారుల ఉత్సాహం వల్లనే ఇటీవల రోజుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకూ వారు 10 బిలియన్ డాలర్ల మేర భారత స్టాక్ లలో మదుపు చేశారట. ఫలితంగా సెన్సెక్స్ గత రికార్డులను అధిగమించి తన జీవిత కాలంలోనే అత్యధిక స్ధాయికి చేరుకుంది. దీనిని ఉద్దేశిస్తూనే ఆర్.బి.ఐ గవర్నర్ రాజన్ పై విధంగా హెచ్చరించారు. ఆరంభంలో అలజడి ఉన్నా అనంతరం సర్దుకోవచ్చని కూడా ఆయన తెలిపారు.

రాజన్ ని తొలగించినా కూడా మార్కెట్లలో తొక్కిడి తప్పదు. ఆర్.బి.ఐ గవర్నర్ ని అర్ధాంతరంగా తొలగించిన వార్త అంత గొప్పదేమీ కాదు. ఆయన ఎంత మాట వినని వ్యక్తి అయినా ద్రవ్య విధాన నిర్ణేత. కనుక కొత్త ప్రభుత్వం అంత తొందరగా చర్యలు తీసుకోకపోవచ్చు కూడా. కానీ వారి మాస్టర్లు పట్టుబడితే మాత్రం ఏమైనా జరగొచ్చు. 

9 thoughts on “మోడి వస్తే ఆర్.బి.ఐ గవర్నర్ కి పదవీ గండమా?

 1. //రాజన్ ని తొలగించినా కూడా మార్కెట్లలో తొక్కిడి తప్పదు. ఆర్.బి.ఐ గవర్నర్ ని అర్ధాంతరంగా తొలగించిన వార్త అంత గొప్పదేమీ కాదు. ఆయన ఎంత మాట వినని వ్యక్తి అయినా ద్రవ్య విధాన నిర్ణేత. కనుక కొత్త ప్రభుత్వం అంత తొందరగా చర్యలు తీసుకోకపోవచ్చు కూడా. కానీ వారి మాస్టర్లు పట్టుబడితే మాత్రం ఏమైనా జరగొచ్చు. //
  అంటె మీరు కూడా నరేంద్ర మోది ప్రభుత్వం అదికారం లోకి వస్తుందని నిర్ణయానికి వచ్చారా?

 2. నేను రాసింది అలాగే ఉంది గానీ, నేనింకా ఆ నిర్ణయానికి రాలేదు. కానీ బి.జె.పి/ఎన్.డి.ఎ ని గెలిపించడానికి కాంగ్రెస్ నేతలు కూడా కష్టపడుతున్న సంగతి జాగ్రత్తగా చూస్తే అర్ధం అవుతుంది. చవాన్, పవార్ ల ప్రకటనలు చూడండి.

  మోడి పైన విదేశీ కంపెనీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. అవి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. పశ్చిమ పత్రికలూ కృషి చేస్తున్నాయి. రాజన్ పైన రాయిటర్స్ కధనం అందులో భాగమే. మోడి వస్తే ఉద్యోగాలు వస్తాయని అది చెప్పడం అందుకే.

  అమెరికా, ఐరోపాల్లో జనానికి ఉద్యోగాలు ఇచ్చే దిక్కు లేదు గానీ ఇండియాలో ఉద్యోగాల గురించి రాయిటర్స్ బాధపడుతోంది.

 3. ఎవరు గెలుస్తారు అన్న విషయం వచ్చింది కాబట్టి. సరదాగా ఒక ప్రశ్న. ఎవరు గెలిస్తే ఎలా ఉంటుందనుకుంటున్నారు? నా ఉద్దేశ్యం ఇది :

  ఒకవేళ కాంగ్రెస్ ఐతే : ఇదే అవినీతిపాలన కొనసాగుతుంది. ఒక అసమర్ధుడైన, అవగాహనలేని ప్రధానిని మనం భరించాల్సి ఉంటుంది. Except for the scams, envi would be uneventful. పొరుగుదేశల విషయంలో మితిమీరిన మెతకదనంతో వ్యవహరించి, రక్షణరంగాన్ని నిర్వీర్యం చేసుకుంటాం.

  ఒకవేళ బీజెపీ గెలిస్తే : మనదేశం ఒక జర్మనీ అవుతుంది. సోకాల్డు అభివృధ్ధి జరగవచ్చు కానీ (అభ్యుదయ భావాలున్న హిందువులతోసహా) చాలామందికి భారత్ నివాసయోగ్యం కాకుండా పోతుంది. చివరికి మనదేశం జర్మనీనుంచి ఒక అఫ్ఘనిస్థాన్‌లా తయారైనా పెద్దగా ఆశ్చర్యపోవలసిందేమీ ఉండదు. పొరుగుదేశాలతో గొడవలకే జాతీయాదాయంలో ఎక్కువభాగం ఖర్చుచెయ్యాల్సి వస్తుంది.

  నాకైతే బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రమాదకారుల్లాగే అనిపిస్తున్నాయి.

 4. విశేషజ్ఞ గారు,
  ఇద్దరు ప్రమాద కారుల్లో ఎవరు ఎక్కువం ప్రమాద కారి అనేది ఇక్క డ సమస్య.
  సంఘ్‌ పరివార్‌ కు గుజరాత్‌ ఒక ప్రయోగ శాలగా ఉపయోగ పడింది. ఆ ప్రయోగాన్ని ఇండియ మొత్తంగ అమలు జరపాలనేది వారి హ్యుహం. ఇప్పటికే పాసిష్ట్‌ మూకలు బెదిరింపులకు ఇంటెర్నెట్ను వాడుకుంటున్నాయి. అవి పూర్తిగా ధికారంలోకి వస్తె జరిగేదేమిటొ ఊహించలేము.

 5. ” అహ్మద్ షా” కాదు – అతను అమిత్ షా,
  ఇంకా పాత గవర్నర్ దువ్వూరి సుబ్బా రెడ్డి కాదు- దువ్వూరి సుబ్బారావుగారు
  just not information అంతే

 6. Tirupalu గారు :
  ఏది ‘ఎక్కువ’ ప్రమాదకరం అన్నది subjective question ఐపోతుంది.

  అసలు బీజేపీ వాళ్ళువాళ్ళు సాధించిచూపుతామనే చెప్పే అభివృధ్ధికీ, సాంప్రదాయ పరిరక్షణకీ ఎలా పొంతన కుదురుతుందో నాకు అర్ధం కావడంలెదు. మతానికి పెద్దపీట అన్నప్పుడు అభివృద్ష్ధికి తిలోదకాలివ్వాలి. లేదు అభివృధ్ధి, అభ్యుదవవాదమూ అన్నప్పుడు మతానికి ప్రాధ్యాన్యత తగ్గాలి. ఇదంతా ఏదో గందరగోళం వ్యవహారంలా అనిపిస్తుంది.

 7. విశేషజ్ఞ గారు,
  వాళ్లు చెప్పే అభివృద్దిని గురించి ఇక్కడ విశేఖర్‌ గారు రాసిన ఈ వ్యాసమే ఒక హౌట్‌ లైన్‌ ను ఇస్తుంది మరో సారి చదవండి (ఈ బ్లాగ్‌ లోనే). తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు జాతియవాధం ముదిరితే జాతియ దురంకార వాదం అవుతుంది. అభివృద్ది అనేది పడమటిదేశాల మల్టినేషనల్‌ కంపెనీల అభివృద్ది. దానికి కావలిసిన ఉపరితల భావ జాలం మతవాదంలో ని కుల వ్యవస్త ,మూడనమ్మకాల్లో దాగివుంది. అది బాగా ఉపయోగ పడుతుంది. దాన్ని రెచ్చగొట్టటమే వీరి పని. ఒకదానికొకటి పోగుపడి చివరికి వారనుకున్నది సాదిస్తారు. అంతెందుకు మీరు మూల గారికి ఇచ్చిన కామెంట్‌ లోనే- విస్తరించినట్లైతే- ఉంది.

 8. //ఏది ‘ఎక్కువ’ ప్రమాదకరం అన్నది subjective question ఐపోతుంది.//
  నిజమే! ఉధ్యమాల్ళొ ఉన్న వాళ్లు, రాజకీయ పార్టీల వాళ్లు అలా అనుకో క పోవొచ్చు. మరి సాధరణ ప్రజలకు అలానే అనిస్తుంది. మరీ ఈ విషయం నొక్కి చెప్పలేం. వారి మీదకూ డా ఈ ప్రభావం ఉండవచ్చు. అలా వదిలేస్తే. దీని సంబందించిన చర్చ గురించిన ఓ పుస్తక రివ్య్‌ ని లింక్‌ లో చూడండి.
  http://magazine.saarangabooks.com/2014/04/09/%E0%B0%A8%E0%B1%87%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%82-%E0%B0%B5%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%88-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8/#comment-7341

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s