ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణ దాడికి అమెరికా చెప్పిన కారణాల్లో ఒకటి ఓపియం సాగుని అరికట్టడం. అమెరికా తన ఆక్రమణను పూర్తిగా డిసెంబర్ తో ముగిస్తానని చెబుతోంది. అప్పటికి ఓపియం సాగుని అరికట్టకపోయినా కనీసం కొంత భాగం అరికట్టినా ఏదో ప్రయత్నం చేశారని సంతృప్తి పడొచ్చు. కానీ 13 సం.ల అమెరికా ఆక్రమణలో ఆఫ్ఘనిస్ధాన్ లో ఓపియం సాగు అరికట్టడం అటుంచి 40 రెట్లు పెరిగితే ఏమిటని అర్ధం చేసుకోవాలి. అమెరికా ఓపియం సాగుని అరికట్టడానికి ప్రయత్నించిందనా లేక తానే దగ్గరుండి ప్రోత్సహించిందనా?
నిజానికి తాలిబాన్ కాలంలోనే ఆఫ్ఘనిస్ధాన్ లో ఓపియం సాగు తగ్గించడానికి అంతర్జాతీయంగా ఒక నిర్దిష్ట కార్యక్రమం అమలయింది. కానీ అమెరికా/నాటో దురాక్రమణ తర్వాత ఓపియం సాగు ఒక పువ్వు, నలభై కాయలై వర్ధిల్లిందంటే అతిశయోక్తి కాదు. అమెరికా/నాటో దాడి చేసి దురాక్రమించిన 2001 నుండి 2013 వరకు ఓపియం సాగు 40 రెట్లు పెరిగిందని రష్యా టుడే పత్రిక తెలిపింది. ఆఫ్ఘన్ ఓపియం నుండి తయారయిన వివిధ మత్తుపదార్ధాలకు బానిసలై ప్రపంచవ్యాపితంగా మిలియన్ల మంది వరకు చనిపోయారని ఒక అంచనా. లక్షకు పైగా సైన్యాన్ని నియోగించి అమెరికా సాధించింది టెర్రరిజాన్ని నిర్మూలించడం కాదు; ఓపియం సాగు 40 రెట్లు పెంచడం?!
గత సంవత్సరం (2013) ఆఫ్ఘనిస్తాన్ రికార్డు స్ధాయిలో ఓపియం పంట ఉత్పత్తి చేసిందని రికార్డులు చెబుతున్నాయి. అంతర్జాతీయ మత్తుపదార్ధాల నియంత్రణ బోర్డు (International Narcotics Control Board) ఇటీవల వెలువరించిన వార్షిక నివేదిక ప్రకారం ఆఫ్ఘన్ పాపీ పొలాలు ఇప్పుడు 2,09,000 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంది. గత యేడుతో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువని నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు తెలిపింది.
బోర్డు నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లో సగానికి పైగా రాష్ట్రాలు ఓపియం పాపీలను సాగు చేస్తున్నాయి. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఓపియం, హెరాయిన్ లలో 80 శాతం ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉత్పత్తి అవుతోందని నివేదిక తెలిపింది.
ఆఫ్ఘన్ హెరాయిన్ సాగు ఇతర దేశాలతో పాటు ఆఫ్ఘన్ ప్రజలను కూడా నాశనం చేస్తోంది. పాపీలను సాగు చేయడంతో పాటు అనేకమంది ఆఫ్ఘన్లు కూడా హెరాయిన్ కు బానిసలుగా మారుతున్నారు. ఐరాస లెక్కల ప్రకారం ప్రతి 30 మంది ఆఫ్ఘన్ లలో ఒకరు డ్రగ్స్ కి బానిస. అనగా ఆఫ్ఘనిస్ధాన్ అతిపెద్ద డ్రగ్స్ ఉత్పత్తిదారే కాదు, అతి పెద్ద డ్రగ్స్ వినియోగదారు దేశాల్లో కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
ఓపియం సాగు ఆఫ్ఘనిస్ధాన్ ఆర్ధిక వ్యవస్ధకు వెన్నెముకగా మారిపోయింది. ఇదంతా ఆఫ్ఘన్ ఓపియం ని అరికడతానని డంబాలు పలికి దురాక్రమణలో ఉంచుకున్న అమెరికా ఏలుబడిలోనే జరిగింది. డ్రగ్స్ పై యుద్ధం పేరుతో అమెరికా వివిధ దేశాలపై సాగించే కుట్రలు, కుయుక్తులు, దురాక్రమణలు వాస్తవానికి తన స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికేనని చెప్పడానికి ఆఫ్ఘనిస్ధాన్ ఒక చక్కని ఉదాహరణ.
టెర్రరిజంపై ప్రపంచ యుద్ధంతో పాటు ఆఫ్ఘన్ డ్రగ్స్ పై యుద్ధం కూడా ప్రకటించిన అమెరికా ఆ లక్ష్యం కోసం జరిగే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం సహకరించదు. ఆఫ్ఘన్ డ్రగ్స్ బాధిత దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఆ కారణం వలన ఆఫ్ఘన్ డ్రగ్స్ వ్యతిరేక ప్రయత్నాలలో రష్యా కూడా అమెరికాకు భాగస్వామిగా వ్యవహరించడానికి ముందుకు వచ్చింది. ఆ మేరకు ఉమ్మడి ప్రయత్నాలు చేయడానికి ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. కానీ ఇటీవల ఉక్రెయిన్ సంక్షోభం సాకుగా చూపుతూ డ్రగ్స్ పై యుద్ధానికి కూడా అమెరికా నీళ్ళు వదిలేసింది. ఆఫ్ఘన్ డ్రగ్స్ నివారణకు రష్యా నియమించిన అధికారి పైన కూడా అమెరికా ప్రయాణ, వీసా, ఆర్ధిక ఆంక్షలు విధించి తన ‘డ్రగ్స్ పై యుద్ధం’ ఎంత సొంపైనదో చాటి చెప్పుకుంది.
ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ (ఐ.ఎస్.ఎ.ఎఫ్) దే అన్నీ విషయాల్లోనూ పై చేయి. గత 13 సం.లుగా ఐ.ఎస్.ఎ.ఎఫ్ పెత్తనమే అక్కడ నడిచింది. అందువలన ఆఫ్ఘన్ కొండల్లో ఉత్పత్తి అవుతున్న హెరాయిన్ ని అరికట్టాలని రష్యా పదే పదే మొరపెట్టుకుందని, కానీ అమెరికా నుండి సహకారం అందలేదని రష్యా టుడే తెలిపింది. ఆఫ్ఘన్ లో డ్రగ్స్ ఉత్పత్తి నిరోధానికి అమెరికా ఏమీ చేయడం లేదని సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆరోపించినప్పటికీ అమెరికా నుండి తగిన స్పందన లేదని తెలుస్తోంది. అమెరికా మాత్రం తాను ఆఫ్ఘన్ డ్రగ్స్ నిరోధానికి 7 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టానని చెప్పినా దాని ఫలితం మాత్రం వీసమెత్తు కూడా లేకపోవడం విశేషం.
మొత్తం మీద ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపుతూ అమెరికా, ఇతర నాటో దేశాలు ఆఫ్ఘనిస్ధాన్ లో డ్రగ్స్ నిరోధానికి జరిగిన కాసిన్ని ప్రయత్నాలను కూడా అటకెక్కించాయి. రష్యాతో ఉమ్మడి ప్రయత్నాలను నిలిపేస్తున్నట్లు నాటో, అమెరికా లు ప్రకటించాయి.