మాన్యుఫాక్చరింగ్: బి.జె.పి యేతర రాష్ట్రాలదే పై చేయి


BJP development

బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తరచుగా అభివృద్ధి మంత్రం జపిస్తుంటారు. స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు ఇష్టానుసారం జనం సొమ్ము కట్టబెట్టడమే అభివృద్ధి మంత్రంలోని అంతస్సారం. పోనీ అందులోనైనా గుజరాత్ ముందు పడిందా అంటే అదీ లేదు. కాంగ్రెస్, బి.జె.పి రెండు పార్టీలూ లేని తమిళనాడు మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి, ఉద్యోగాల సృష్టి లలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారి గణాంకాలు తెలియజేస్తున్నాయి.

బి.జె.పి తన ఎన్నికల ప్రచారంలో మాన్యుఫాక్చరింగ్, ఉద్యోగాల కల్పననే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎన్నుకుంది. అభివృద్ధికి రారాజు మా ప్రధాని అభ్యర్ధి అని టముకు వేస్తోంది. తీరా చూస్తే ఈ రంగాల్లో గుజరాత్ నాలుగో స్ధానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తర్వాత నాలుగో స్ధానంలో గుజరాత్ ఉన్నది తప్ప మొదటి స్ధానంలో కాదు.

అలాగని అన్నా పార్టీ, కాంగ్రెస్, ఎన్.సి.పి లకి ఆ క్రెడిట్ ఇవ్వాలన్న రూలూ లేదు. ఆయా పార్టీల వలన (because of such parties) కాకుండా ఆ పార్టీల పాలన ఉన్నప్పటికీ (despite such parties) ఆ మాత్రం ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన జరిగిందని మనం భావించాల్సిన విషయం.

2011-12 నాటి వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం ఏ.ఐ.డి.ఎం.కె పాలిత తమిళనాడు మిగతా అన్ని రాష్ట్రాల కంటే అధిక సంఖ్యలో పరిశ్రమలు కలిగి ఉంది. భారత దేశంలో మొత్తం 2.17 లక్షల పరిశ్రమలు ఉంటే వాటిలో 17 శాతం తమిళనాడులో ఉన్నాయి. ఫ్యాక్టరీ ఉద్యోగాల పరంగా చూసినా తమిళనాడుదే అగ్రస్ధానం. తమిళనాడు తర్వాత స్ధానం కాంగ్రెస్-ఎన్.సి.పి ఏలుబడిలోని మహారాష్ట్ర. మొత్తం ఫ్యాక్టరీల్లో 13 శాతం మహా రాష్ట్రలో ఉండగా కాంగ్రెస్ పాలిత ఆంధ్ర ప్రదేశ్ లో 12.7 శాతం ఫ్యాక్టరీలు ఉన్నాయి.

ASI 2011-12బి.జె.పి పాలిత/నరేంద్ర మోడి పాలిత గుజరాత్ ఈ మూడింటి తర్వాత నాలుగవ స్ధానంలో ఉంది. దేశంలోని మొత్తం ఫ్యాక్టరీల్లో 10.2 శాతం ఫాక్యరీలు మాత్రమే గుజరాత్ లో ఉన్నాయి. ఈ వివరాలను సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వారు ఇంకా ప్రచురించాల్సి ఉంది. ది హిందూ పత్రిక ఈ వివరాలను సంపాదించి ప్రచురించింది.

ఫ్యాక్టరీ ఉద్యోగాల సంఖ్యలో కూడా ఇదే వరుస కొనసాగింది. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా తమిళనాడు ఉద్యోగాలు ఇవ్వగా ఆ తర్వాత స్ధానం మహా రాష్ట్రది. మూడో స్ధానం ఆంధ్ర ప్రదేశ్ ది కాగా నాలుగో స్ధానం గుజరాత్ రాష్ట్రానిది.

ఆర్ధిక అభివృద్ధిని ప్రధాన ఎన్నికల అస్త్రంగా బి.జె.పి మలుచుకున్న నేపధ్యంలో పరిశ్రమల వార్షిక సర్వే (Anual Survey of Industries) ఫలితాలు నిస్సందేహంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి నెమ్మదించిన విషయాన్ని తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా లేవనెత్తుతామని బి.జె.పి చెబుతోంది. (ఫ్యాక్టరీ) ఉద్యోగాల కల్పనలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రదర్శన బాగా లేదన్న సంగతి తాము ప్రచారం చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. వాస్తవాలేమో ఇలా ఉన్నాయి.

సోమవారం ఈ టి.వి కి ఇంటర్వ్యూ ఇస్తూ బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి రానున్న ఎన్నికలను ‘ఎలక్షన్ ఆఫ్ హోప్’ అన్నికలుగా అభివర్ణించారు. “ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక ఉత్పత్తి తమ ప్రధమ ప్రాధాన్యంగా” ప్రచారం చేస్తామని మోడి చెప్పారు. “ఉద్యోగాల కల్పన లేని ఆర్ధిక వృద్ధి అతి పెద్ద సమస్యగా మనల్ని తేరిపార జూస్తోంది” అని మోడి ఈ టి.వి ఇంటర్వ్యూలో చెప్పారు.

పార్టీ ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ ఇలా అన్నారు “ఎన్నికల ప్రచారం ఆర్ధిక అంశాల పైకి మరలడం పట్ల మాకు సంతోషంగా ఉంది. మా ప్రధాని అభ్యర్ధి ఆర్ధిక అంశాలను లేవనెత్తుతున్నారు. కానీ కాంగ్రెస్ నుండి దీనికి బదులు లేదు” అని ఆయన ఆరోపించారు కూడా. రవి శంకర్ ప్రసాద్ గారు తెలుసుకోవలసింది ఏమిటంటే బి.జె.పి కూడా సమాధానం చెప్పుకోగల పరిస్ధితిలో లేదని.

3 thoughts on “మాన్యుఫాక్చరింగ్: బి.జె.పి యేతర రాష్ట్రాలదే పై చేయి

వ్యాఖ్యానించండి