
U.S. Defense Secretary Leon Panetta (R) shakes hands with U.S. ambassador to India Nancy Powell upon his arrival in New Delhi June 5, 2012.
భారత దేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా చేశారు. ఆమె రాయబారిగా నియమితులై రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ఈ లోపే రాజీనామా చేయడానికి దేవయాని ఖోబ్రగదే వ్యవహారమే కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలవడం ద్వారా ఏడేళ్ళ బాయ్ కాట్ కి లాంఛనంగా తెరదించిన నాన్సీ పావెల్ రాజీనామా కొంత కాలంగా అమెరికా విదేశాంగ శాఖ చర్చల్లో నలుగుతున్నదే అని తెలుస్తోంది.
రాజీనామా అనంతరం నాన్సీ పావెల్ రిటైర్ అయ్యే యోచనలో ఉన్నారని రాయిటర్స్ తెలిపింది. ఆమె రాజీనామాకు కారణం ఏమిటో అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. 37 సం.ల విదేశీ సేవల నుండి తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు మాత్రమే భారత్ లోని అమెరికా ఎంబసీ ప్రకటన పేర్కొంది. అమెరికా విదేశీ రాయబారిగా దక్షిణ ఆసియాలోనే ప్రధానంగా పని చేసిన నాన్సీ పావెల్ భారత్ లో రాయబారిగా 2012లో నియమితులయ్యారు.
గత నెలలో నాన్సీ పావెల్ నరేంద్ర మోడిని కలవడం ద్వారా అమెరికా అనుసరిస్తూ వచ్చిన పదేళ్ళ బాయ్ కాట్ కు తెర దించారు. ఐరోపా దేశాలు అప్పటికే నరేంద్ర మోడితో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకోగా అమెరికా వెనుకబడి పోయిందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో మోడితో నాన్సీ సమావేశం కావడం ద్వారా ఇతర ప్రధాన పశ్చిమ రాజ్యాలతో పాటుగా అమెరికా కూడా మోడితో సంబంధాలు పెట్టుకున్నట్లయింది.
అమెరికాలో భారత కాన్సల్ ఉప అధికారి దేవయానిని అమెరికా మార్షల్ పోలీసులు అరెస్టు చేసి, బట్టలు విప్పించి తనిఖీ చేసి, కరుడు గట్టిన నేరస్ధులతో పాటుగా ఒక రోజంతా లాకప్ లో పెట్టిన ఘటన నాన్సీ పావెల్ ఆధ్వర్యంలోనే జరిగినట్లు సమాచారం. దేవయాని అరెస్టుకు సంబంధించిన నీలి నీడలు నాన్సీ పావెల్ కెరీర్ పై పడ్డాయని, దానితో ఆమె రాజీనామా అనివార్యం అయిందని కొన్ని పత్రికలు తెలిపాయి.
దేవయాని అరెస్టు దరిమిలా భారత్-అమెరికా సంబంధాలు అడుగంటాయని, నాన్సీ రాజీనామాతో వాటిని గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అరెస్టు అనంతరం భారత ప్రభుత్వం అనేక ప్రతీకార చర్యలు తీసుకుంది. అమెరికా రాయబార కార్యాలయం కోసం రోడ్డుపై కేటాయించిన పార్కింగ్ స్ధలాన్ని రద్దు చేసి సాధారణ ప్రయాణీకులకు ప్రవేశం కల్పించారు. ఎంబసీ ఎదురుగా ఉంచిన రక్షణ బ్యారికేడ్లను తొలగించారు. అమెరికా ఉద్యోగుల జీత భత్యాలపై విచారణ నిర్వహించారు. అమెరికన్లు అనేకమంది భారత చట్టాలను ఉల్లంఘిస్తున్న సంగతి వెలికి తీశారు.
ఈ చర్యల దరిమిలా దేవయాని విడుదలకు అమెరికా దిగిరాక తప్పలేదు. భారత్ కోరినట్లు దేవయానికి ఐరాస సలహాదారు పదవి కట్టబెట్టి పూర్తి స్ధాయి రాయబార రక్షణ కల్పించారు. ఫలితంగా ఆమె భారత్ తిరిగి రావడానికి మార్గం సుగమం అయింది.
ఇది కాకుండా అమెరికా-ఇండియాల మధ్య గత రెండేళ్లుగా వ్యాపార సంబంధాలు కూడా క్షీణిస్తూ వచ్చాయని రాయిటర్స్ తెలిపింది. దీనికి కారణం ఇండియా అయితే కాదు. అణు ఒప్పందం అనంతరం భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు ప్రమాద పరిహార బిల్లు’ దానికి ప్రధాన కారణం. ఈ చట్టం తమకు వర్తించరాదని అమెరికా డిమాండ్ చేస్తుండగా ఇండియాకు ఆ డిమాండ్ ని ఎలా అమలు చేయాలో అర్ధం కాని పరిస్ధితిలో పడిపోయింది.
నాన్సీ పావెల్ స్ధానంలో వచ్చే కొత్త రాయబారి ఇక్కడి ఎన్నికల అనంతరమే నియమితులవుతారని తెలుస్తోంది. తదుపరి రాయబారి ఇరు దేశాల సంబంధాలను ఎలా మెరుగుపరుస్తారో, మెరుగుపడితే దానికి కొత్త రాయబారి కారణం అవుతారా లేక కొత్త ప్రభుత్వం కారణం అవుతుందా అన్నవి పరిశీలనాంశాలు.
రాయబారి రాజినామాలో నరేంద్రమోడి రాయబారం పాత్ర వుందనా ? అసంభందిత వ్యాఖ్యానమనుకుంటాను.
అదేం లేదు. పైగా మోడీతో అమెరికా బంధం పెంచేందుకే నాన్సీ ప్రయత్నం చేశారని రాశాను. నాన్సీ వేసిన పునాది తదుపరి రాయబారికి ఉపయోగపడుతుంది. అప్పటికి మోడి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అమెరికా అంచనా వేస్తోందని నాన్సీ రాజీనామా చెబుతోంది.