చైనా వృద్ధి కిందికి, ఉద్దీపన ఊహలకు ఊపు


China PM Li Keqiang

China PM Li Keqiang

చైనా ఆర్ధిక వృద్ధి అనుకున్నంత స్ధాయిలో నమోదు కావడం లేదన్న అంచనాలు పెరుగుతుండగా ఆ దేశ ప్రభుత్వం మరోసారి ఆర్ధిక ఉద్దీపన అమలు చేయనుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2014 ఆర్ధిక సంవత్సరానికి గాను (చైనా ఆర్ధిక సంవత్సరం జనవరి 1 తేదీన మొదలై డిసెంబర్ 31తో ముగుస్తుంది) 7.5 శాతం జి.డి.పి వృద్ధి నమోదు చేయాలని చైనా ఆశిస్తోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు పడిపోతున్న పరిస్ధితుల్లో ఇది సాధించడం అనుమానంగా మారింది. ఫలితంగా మరో విడత ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీని చైనా ప్రభుత్వం అమలు చేయవచ్చని ఆర్ధిక విశ్లేషకులు, సంస్ధలు అంచనా వేస్తున్నాయి.

2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి చైనా 586 బిలియన్ డాలర్ల ఆర్ధిక ఉద్దీపన (economic stimulus) అమలు చేసింది. కంపెనీలకు, స్ధానిక సంస్ధలకు ఉదారంగా రుణాలు మంజూరు చేసి మౌలిక నిర్మాణాలలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టింది. వినియోగ సరుకులకు, ఇళ్ల నిర్మాణాలకు సైతం రుణాలు ఇచ్చి వినియోగం పెంచడం ద్వారా ఆర్ధిక వ్యవస్ధకు ఊపు కల్పించింది. అదే తరహాలో మరొక విడత ఆర్ధిక ఉద్దీపన చైనా అమలు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఆర్ధిక ఉద్దీపనపై సాగుతున్న ఊహాగానాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ బలహీనతలోనే కొనసాగుతోందన్న నిజాన్ని వెల్లడి చేస్తున్నాయి.

చైనా మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉత్పత్తి బలహీనంగా ఉందని కొన్ని సర్వేల ద్వారా వెల్లడి అయింది. 2014 మొదటి త్రైమాసిక సంవత్సరంలో జి.డి.పి వృద్ధి అనుకున్నంత మేరకు ఉండకపోవచ్చన్న అనుమానాలకు ఈ సర్వేలు దోహదం చేశాయి. మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో వలే మార్చి నెలలో కూడా బలహీనంగా ఉన్నాయనీ, ప్రైవేటు కంపెనీల ఉత్పత్తి వరుసగా మూడో నెలలోనూ తగ్గిపోయిందని సర్వేలు తెలిపాయి.

మాన్యుఫాక్చరింగ్ రంగం ఉత్పత్తిని కొలిచే అధికారిక ‘పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్’ (పి.ఎం.ఐ) ఫిబ్రవరి నెలలో 50.2 ఉండగా మార్చి నెలలో 50.3 పాయింట్లకు పెరిగింది. పి.ఎం.ఐ 50 కంటే ఎక్కువ ఉంటే మానుఫాక్చరింగ్ రంగం వృద్ధి నమోదు చేసిందని అర్ధం. 50 కంటే తక్కువ ఉంటే వృద్ధికి బదులు కుచించుకుపోయిందని అర్ధం. 50 పాయింట్లు నమోదయితే పెరుగుదల గానీ, తరుగుదల గానీ లేకుండా స్తంభించినట్లు అర్ధం.

చైనా పి.ఎం.ఐ మార్చి నెలకు గాని 0.1 పాయింట్లు పెరిగిందంటే ఫిబ్రవరి నెలతో పోలిస్తే మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి కాస్త పెరిగినట్లు అర్ధం. పెరిగినప్పటికీ మొత్తం మీద చూస్తే బలహీనతనే సూచిస్తోందని నిపుణుల విశ్లేషణ. ఫిబ్రవరిలో చైనా నూతన సంవత్సర సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో కొనుగోళ్ళు పెరగడం చైనాలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయినప్పటికీ కేవలం 0.1 పాయింట్లు మాత్రమే పెరుగుదల నమోదు కావడం అంటే వాస్తవంలో అది తరుగుదలే అని నిపుణుల అవగాహనగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

హెచ్.ఎస్.బి.సి కి చెందిన ‘మార్కిట్’ అనే సంస్ధ వివిధ దేశాల ప్రైవేటు మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను కొలుస్తుంది. దీని ప్రకారం చైనా పి.ఎం.ఐ (ప్రైవేటు మాన్యుఫాక్చరింగ్) 48 పాయింట్లకు తగ్గిపోయింది. అనగా చైనా ప్రైవేటు మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి మార్చి నెలలో కూడా కుచించుకుపోయిందని మార్కిట్ సూచిక ద్వారా తెలుస్తున్నది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా చైనా పి.ఎం.ఐ ఈ విధంగా 50 కంటే తక్కువ నమోదు అయింది.

ఈ నేపధ్యంలో చైనా ఆర్ధిక ఉద్దీపన పధకాన్ని అమలు చేయవచ్చని మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తిని వృద్ధి దిశలోకి మరల్చాలంటే ఆర్ధిక ఉద్దీపన తప్ప మరో మార్గం లేదని మార్కెట్ అభిప్రాయం. అయితే ఆర్ధిక ఉద్దీపన ఇస్తున్నాం అని చైనా చెబితే అది పరోక్షంగా తమ జి.డి.పి వృద్ధి కష్టాల్లో ఉన్నట్లు అంగీకరించినట్లు అవుతుంది. అందుకని స్టిములస్ అని పైకి చెప్పకుండా ఇతర పేర్లతో ఆర్ధిక ఉద్దీపన అమలు చేసేందుకు చైనా ప్రభుత్వం పూనుకోవచ్చని భావిస్తున్నారు.

చైనా ప్రధాని లీ కేకియాంగ్ ఈ మేరకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. మౌలిక నిర్మాణ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి తగిన విధానాలను ఇప్పటికే తాము తీసుకున్నామని, వాటిని అమలు చేయడమే మిగిలి ఉందనీ ఆయన గత వారం ప్రకటించారు. చైనా జి.డి.పి వృద్ధి నెమ్మదిస్తోందని ప్రభుత్వం కూడా భావిస్తోందనడానికి ప్రధాని చేసిన ప్రకటన ఒక సూచన అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఇప్పటికే ఉద్దీపనా వ్యయం ప్రారంభం అయిందని కూడా మరికొందరు భావిస్తున్నారు. “చైనా వృద్ధి రేటును స్ధిరీకరించడం ఇప్పుడు ప్రధమ కర్తవ్యం. విధాన చర్యలు ఇప్పటికే తయారు చేశాం. వాటిని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం” అని చైనా ప్రభుత్వ సలహాదారు వాంగ్ జూన్ చెప్పడానికి అర్ధం అదే అని విశ్లేషకుల అంచనా.

“వాళ్ళు నిశ్శబ్దంగా ఆ పని (స్టిములస్ అమలు) చేస్తున్నారు. స్టిములస్ అన్న పదాన్ని వాళ్ళు ఉపయోగించలేరు. అది నెగిటివ్ పదం అయిపోయింది కదా” అని బీజింగ్ లోని ఒక ఆర్ధిక సేవల సలహా సంస్ధ (ఎవర్ బ్రైట్ సెక్యూరిటీస్) అధిపతి గ్జు గావో అనడాన్ని బట్టి చైనా నేతల ఆందోళన అర్ధం చేసుకోవచ్చు. మొదటి త్రైమాసికంలో 7.3 శాతం మాత్రమే చైనా జి.డి.పి వృద్ధి చెందిందని వివిధ సంస్ధలు అంచనా వేశాయి. స్టిములస్ అమలు చేస్తే రెండో త్రైమాసికంలో 7.5 శాతానికి జి.డి.పి వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

అమెరికా, ఐరోపాలు నిరంతర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దానితో చైనా ఎగుమతులు బాగా పడిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఎగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలని చైనా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2008 నాటి సంక్షోభం నుండే వారు ఈ ఆలోచనలో ఉన్నారు. ఆ మేరకు కొన్ని చర్యలు తీసుకున్నారు. దేశీయ వినియోగం పెంచేందుకు తగిన విధాన చర్యలు తీసుకున్నామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. ఈ చర్యల వల్ల కూడా చైనా వృద్ధి నెమ్మదించింది. అయితే ఇది స్వల్పకాలికమేనని అనంతర కాలంలో వృద్ధి రేటు స్ధిరీకరణ సాధిస్తుందని చైనా నేతలు ఆశిస్తున్నారు.

చైనా పరిస్ధితే ఇలా ఉన్నపుడు భారత్ పరిస్ధితి ఇంతకంటే భిన్నంగా ఉండబోదు. 

వ్యాఖ్యానించండి