ఎన్నికల మేనిఫెస్టో: ఒక పనికిరాని డాక్యుమెంట్


Manifesto

మేనిఫెస్టో: గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ పరిపూర్తి చేస్తాం.

జనం: ఇదిగో ఈ ఒక్క పేజీని మీ మేనిఫెస్టో చెయ్యండి చాలు!

***

రాజకీయ పార్టీలు ప్రస్తుతం మేనిఫెస్టోల జాతరలో మునిగి తేలుతున్నాయి. పదేళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మళ్ళీ అవే వాగ్దానాలతో మేనిఫెస్టో విడుదల చేయగా బి.జె.పి దాన్ని అబద్ధాలు, మోసపూరితం అంటూ కొట్టిపారేస్తోంది. అక్కడికి బి.జె.పి మేనిఫెస్టో పక్కా నిజాయితీతో తయారు చేసినట్టు!

ది హిందు పత్రిక ప్రకారం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఊహించని రీతిలో కుడిపక్కకి జరిగింది. అనగా కార్మికులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు లాంటి మాటలు వదిలిపెట్టి మధ్య తరగతి, వ్యాపార వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయింది. మోడి పాపులారిటీ మాయలో కాంగ్రెస్ పార్టీ కూడా పడిపోయిందని ఈ అంశం సూచిస్తోంది.

ఓసారి 2004 ఎన్నికలను గుర్తు తెచ్చుకుంటే ‘ఇండియా షైనింగ్’ ప్రచారం ద్వారా బి.జె.పి బొక్కబోర్లా పడిన సంగతి స్ఫురణకు రాక మానదు. ‘దేశం వెలిగిపోతోంది’ అన్న నినాదం మధ్య తరగతి, వ్యాపార వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇచ్చిన నినాదమే. కానీ దేశంలో వాస్తవ పరిస్ధితి అందుకు విరుద్ధంగా ఉండడంతో ఎన్.డి.ఏ ఓటమి ఎదుర్కోక తప్పలేదు.

ఇప్పుడు కాంగ్రెస్ అలా అనడం లేదు గానీ మేనిఫెస్టోలో రాసిన కబుర్లు మాత్రం అలానే ఉన్నాయి. ఆహార భద్రత, జాతీయ ఉపాధి హామీ పధకం, రైతులకు సబ్సిడీ లాంటి జనాకర్శక నినాదాలకు కాంగ్రెస్ నీళ్ళు వదులుకుంది. కేవలం అవసరమైన వారికి మాత్రమే సబ్సిడీ ఇస్తారట. శ్రేష్టమైన సేవలను ప్రజలకు అందిస్తూ ‘యూజర్ ఛార్జీలు’ వసూలు చేస్తారట. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి అధిక ఛార్జీలు వసూలు చేస్తారట.

మోడి తరపున ప్రచారంలో ఉన్న ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ జనంలోకి బాగా వెళ్లిపోయిందని కాంగ్రెస్ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. దానితో ‘లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్’ నుండి కుడి పక్కకి జరిగి ‘రైట్ ఆఫ్ ద సెంటర్’ కి కాంగ్రెస్ చేరిందని వారి మేనిఫెస్టో ద్వారా అర్ధం అవుతోంది. అందుకే బి.జె.పి తన స్ధానాన్ని కాంగ్రెస్ వశం చేసుకుంటుందేమో అన్న అంచనాతో ఆ పార్టీ మేనిఫెస్టోను మోసంగా అభివర్ణిస్తుండవచ్చు.

భావపరంగా కుడిపక్కకి జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ వాగ్దానాల విషయంలో మాత్రం కాంగ్రెస్ ఎప్పటిలా అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. సం.కి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న మునుపటి వాగ్దానం ఎటు పోయిందో తెలియదు గానీ కొత్తగా 10 కోట్లు ఉద్యోగాలు సృష్టిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అంటే సం.కి 2 కోట్ల ఉద్యోగాలన్నమాట!

కులాధార రిజర్వేషన్లు కదిలించకుండా ఆర్ధిక బలహీన వర్గాలకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం, ఆరోగ్య హక్కు, నివాస హక్కు, పెన్షన్ హక్కు, సామాజిక భద్రతా హక్కు లాంటివి గ్యారంటీ చేస్తామనడం… తదితర వాగ్దానాలన్నీ గతంలోనూ వివిధ రూపాల్లో ఇచ్చిన వాగ్దానాలే. ఆ వాగ్దానాలకు గతి లేదు గానీ కొత్తగా ఇంకో స్వర్గాన్ని తెస్తామనడం జన వంచన తప్ప మరొకటి కాదు.

అటు మధ్య తరగతి, వ్యాపార వర్గాలకు వల విసరడం ద్వారా, ఇటు సంక్షేమ కార్యక్రమాలకు వాగ్దానం ఇవ్వడం ద్వారానూ కింది వర్గాలనూ పై వర్గాలనూ ఏకంగా ఒకేసారి ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార హక్కు ల ద్వారా గత ఏలుబడిలో కాంగ్రెస్ సాధించింది ఏమిటో చెప్పగలిగితే తాజా వాగ్దానాల వల్ల ఒరిగేది ఏమిటో అర్ధం అవుతుంది.

కానీ ఇవి ఎలా సాధిస్తారో మాత్రం చెప్పలేదు. ఆ మాటకొస్తే ఏ పార్టీ చెబుతుంది గనుక?!

పదేళ్ళు అధికారం వెలగబెట్టిన పార్టీ చేసిన పనుల పైన కాకుండా మళ్ళీ వాగ్దానాల పైనే ఆధారపడడాన్నిబట్టే ఆ పార్టీ మేనిఫెస్టో డొల్లతనం స్పష్టం అవుతోంది.

One thought on “ఎన్నికల మేనిఫెస్టో: ఒక పనికిరాని డాక్యుమెంట్

వ్యాఖ్యానించండి