వాషింగ్టన్ రాష్ట్రంలోని ఓసో పట్నం వాసులకు మార్చి 22 ఓ మహా దుర్దినం అయింది. అప్పటికి మూడు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కొండ చరియ కూలిపోవడంతో దానికింద పడి ఆ పట్నం దాదాపు అదృశ్యం అయిపోయింది. ఇప్పటివరకూ 17 మంది మరణించారని ప్రకటించగా 90 మంది జాడ తెలియలేదు. వీరంతా చనిపోయారన్న నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చేశాయి. వారి బంధువులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు.
స్ధానికులు ఈ కొండను ‘స్లైడ్ హిల్’ అని పిలుస్తారట. పేరుకు తగ్గట్లుగానే అందులో భారీ మొత్తం వర్షంలో నానిపోయి ఒక్కసారిగా పట్నం మీదికి విరుచుకుపడింది. 100 కు పైగా ఇళ్ళు మట్టి చరియ కింద కప్పబడిపోయాయి. అసలక్కడ ఒక పట్నం ఉండేదన్న ఆనవాళ్లే ఇప్పుడు కనిపించడం లేదు.
స్టీలగౌమిష్ అనే పేరుగల నదీ లోయలో ఓసో పట్నం నెలకొని ఉంది. దీని పక్కనే ఒక రాష్ట్ర రహదారి కూడా పోతుంది. ఇప్పుడా రహదారి మూసుకుపోయింది. ఇళ్ళు, రోడ్లు, విద్యుత్ స్తంబాలు… ఇలా ఒక నివాసం అక్కడ ఉండేదన్న సూచనలు దాదాపు అదృశ్యం కావడంతో కనిపించనివారు బతికి ఉంటారన్న ఆశలు అడుగంటాయి.
మహా భారీ మట్టి పెళ్ల కూలిపోవడం వలన శిధిలాలు వెలికి తీయడం కూడా కష్టం అయింది. శారీరకంగా తవ్వి తీయడం తప్ప మరో మార్గమే ఇక్కడ లేకుండా పోయిందని గార్డియన్ పత్రిక తెలిపింది. దానికి కారణం అక్కడికి ఏ వాహనమూ వెళ్ళే పరిస్ధితి లేదు. ప్రమాదం జరిగిన వెంటనే కేవలం హెలికాప్టర్ ద్వారా మాత్రమే చూడగలిగారు తప్ప అక్కడికి ఎవరూ వెళ్లలేకపోయారు.
ఈ పరిస్ధితి భారత దేశంలో ఉత్తరా ఖండ్ వరదల పరిస్ధితిని గుర్తుకు తెస్తోంది. మరణాలు, విస్తృతి రీత్యా ఉత్తరా ఖండ్ లో జరిగింది ఇంకా పెద్ద ఘోరం. కానీ అక్కడికి మిలట్రీ వాహనాలు ఎలాగో దారి చేసుకుని వెళ్లగలిగాయి. ఓసో లో ప్రస్తుతానికి ఆ పరిస్ధితి లేదని కింది ఫోటోల ద్వారా తెలుస్తున్నది.
తవ్వకం పనులకు గాను యంత్రాలు రావడానికి మార్గం లేకపోవడంతో రక్షణ చర్యలు అత్యంత నెమ్మదిగా జరుగుతున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం గత శనివారం జరిగిన ఈ దారుణం వల్ల మృత దేహాలను ఇప్పుడప్పుడే వెలికి తీసే పరిస్ధితి లేదనీ, వెలికి తీసిన మృత దేహాలను గుర్తు పట్టే పరిస్ధితి అసలే లేదని అధికారులు చెబుతున్నారు.
పరిస్ధితి ఎంత ఘోరం అంటే అదృశ్యం అయినవారి బంధువుల డి.ఎన్.ఏ, డెంటల్ రికార్డ్ లను స్ధానిక ప్రభుత్వం ఇప్పటినుండే సేకరిస్తోంది. పుట్టు మచ్చలు, వెంట్రుకల రంగు, కనుగుడ్డు రంగు వివరాలు సేకరిస్తున్నారు. తద్వారా అప్పుడొకటి, ఇప్పుడొకటిగా వెలువడుతున్న మృత దేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటిదాకా ప్రకటించిన 17 మంది మృతులు కాకుండా మరో 8 మృత దేహాలను సహాయ, రక్షణ సిబ్బంది వెలికి తీశారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. దీనిని అధికారులు ధృవీకరించలేదు. లెక్క తేలని 90 మంది స్నేహితులకు, బంధువులకు ఫోన్లు తదితరాల ద్వారా సంప్రదించి వాళ్ళు అక్కడికి వెళ్లలేదని అధికారులు ధ్రువపరుచుకున్నారు. కాబట్టి వారు మరణించి ఉంటారని అంతా భావిస్తున్నారు. మృత దేహాల వెలికితీత వారాలు, నెలలు కూడా పట్టవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
Photos: Boston’s big picture & The Atlantic



















