భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్
పార్ట్ – 7
(భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా. అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది 7 వ భాగం. మొదటి 6 భాగాల కోసం ఈ భాగం చివర ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు. -విశేఖర్)
*********
నెపోలియన్ III యొక్క (జపాన్ కి కేటాయించబడిన) మంత్రి తోకుగావా బకుఫుతో ఫ్రెంచి అలయన్స్ కోసం ప్రయత్నించగా బ్రిటిష్ మంత్రి హాన్ లకు మద్దతుగా నిలబడ్డారు. కానీ అమెరికా అంతర్యుద్ధంలో మునిగి ఉండగా ఫ్రెంచి వారు ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం వల్ల ఎటూ కదల్లేని పరిస్ధితిలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్లేమో చైనాలో తైపింగ్ తిరుగుబాటు (1860-65) ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నేపధ్యంలో జపాన్ వలసగా మారే ప్రమాదం నుండి తప్పించుకోగలిగింది. తద్వారా తమ స్వంత జాతీయ పెట్టుబడిదారీ అభివృద్ధికి సానుకూల పరిస్ధితిని పొందింది.
జపాన్ లో మొత్తం వినియోగ వ్యయంలో ఆహార వాటా (ఏంగెల్ గుణకము) మీజీ కాలం ప్రారంభంలో 60 శాతం ఉంటే అది ప్రస్తుతం 30 శాతానికి పడిపోయింది. మొత్తం ఆహార వినియోగంలో దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి ఆహార పదార్ధాల వాటా మీజీ ప్రారంభంలో 70 శాతం ఉంటే అది ఇప్పుడు 20 శాతానికి తగ్గిపోయింది. (అనగా అవసరానికి మించిన మిగులు ఉత్పత్తి బాగా పెరిగి మార్కెటీకరణకు అవకాశం ఏర్పడింది. –అను)
ఈ దశలో మార్కెటీకరించదగిన మిగులును సేకరించడం కోసం ల్యాండ్ టాక్స్ రివిజన్ (1873-76) లాంటి చట్టాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ చట్టం ద్వారా భూమి పన్నును ధాన్యం ఉత్పత్తిలో 25 శాతం మేరకు నిర్ణయించారు. అదికూడా డబ్బు రూపేణా మాత్రమే చెల్లించాలని నిబంధన విధించారు. దీని ద్వారా భూమి యజమానులు పాత దోపిడీ నుండి తప్పించబడ్డారు. అంతేకాకుండా భూస్వాముల చేతుల్లో భూమి కేంద్రీకరణ కావడానికి ఇది దారి తీసింది. అదే సమయంలో చిన్న రైతులు పన్నులు చెల్లించలేకా, భూస్వాముల నుండి తీసుకున్న అప్పులు చెల్లించలేకా భూములు కోల్పోయారు. తొకుగావా మరియు మీజీ కాలంలో భూస్వాములు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించారు. ప్రారంభంలో పశ్చిమ సాంకేతికత ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. 1880 అనంతర కాలంలో కొత్త వ్యూహాన్ని చేపట్టారు. అత్యుత్తమ విత్తనాలను గుర్తించడం, రైతులు అనుసరించే అత్యుత్తమ సాగు పద్ధతులను అన్వేషించి గుర్తించడం లాంటి చర్యలు అనుసరించారు. వ్యవసాయ కళాశాలల్లోనూ వాటికి పొడిగింపుగా ఏర్పాటు చేసిన వ్యవస్ధల్లోనూ అనుభవజ్ఞులైన, వయసు మళ్లిన రైతులను (వారిని రొనో అంటారు) శిక్షకులు (instructors) గా ప్రభుత్వం నియమించింది. ఇలాంటివే అనేక పద్ధతులను అక్కడ అవలంబించారు.
ఇది జపాన్ వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. అయినప్పటికీ 20వ శతాబ్దంలోని మొదటి 50 సంవత్సరాల కాలంలో వివిధ దశల్లో ఆహార సమస్య, దారిద్ర్య సమస్యలను జపాన్ ఎదుర్కొంది, ముఖ్యంగా యుద్ధ కాలంలో.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మిత్ర రాజ్యాల (అక్ష రాజ్యాలు జర్మనీ, ఇటలీ, జపాన్ లకు వ్యతిరేకంగా జట్టు కట్టిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ మొ.) ఆదేశాలతో జపాన్ వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు అమలు చేసింది. అవి:
-
1946 తర్వాత హాజరు లేని భూస్వాముల భూములను బలవంతంగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అధికారాలు కట్టబెట్టుకుంది. అలాగే దేశంలో నివాసం ఉన్న భూస్వాములైతే 1 హెక్టార్ కంటే ఎక్కువగా (హొక్కైడో లో 4 హెక్టార్లు) ఉన్న భూములను ప్రభుత్వం బలవంతపు కొనుగోలు ద్వారా స్వాధీనం చేసుకునే అధికారం దఖలుపరుచుకుంది.
-
చట్టం చేసిన 2 సం.ల లోపల భూములను (అనుభవిస్తున్న) కౌలు సాగుదారులకు అమ్మేయాలి.
-
భూముల బదలాయింపు కోసం ప్రతి గ్రామం లోనూ వ్యవసాయ భూ కమిషన్ ను ఏర్పాటు చేశారు. భూస్వాముల నుండి ముగ్గురు ప్రతినిధులు, సొంత భూములు ఉన్న రైతుల నుండి ఇద్దరు ప్రతినిధులు, కౌలు రైతుల నుండి 5 గురు ప్రతినిధులు ఉండేలా ఈ కమిషన్ లను నియమించారు.
-
భూస్వాములకు చెల్లించిన ధర ఇలా నిర్ణయించారు. (i) మాగాణి ధాన్యం భూములైతే వార్షిక కౌలుకు 40 రెట్లు (ii) మెట్ట ధాన్యం భూములైతే వార్షిక కౌలుకు 48 రెట్లు
-
నాలుగు సంవత్సరాల కాలంలో (1947-50) ప్రభుత్వం 1.7 మిలియన్ల హెక్టార్ల వ్యవసాయ భూములను భూస్వాముల నుండి కొనుగోలు చేసి ప్రభుత్వ భూములను కూడా కలుపుకుని 1.9 మిలియన్ల హెక్టార్లను కౌలు రైతులకు బదిలీ చేసింది. జపాన్ లో భూ సంస్కరణలకు ముందు 80 శాతం భూములు కౌలు రైతుల కిందే ఉన్నాయని దీని ద్వారా స్పష్టం అయింది.
-
ఈ సంస్కరణల ద్వారా కౌలు రైతుల హక్కులు శక్తివంతం అయ్యాయి. కౌలు మొత్తం నియంత్రణ లోకి వచ్చింది. 1952 నాటి భూముల చట్టం ద్వారా భూ యాజమాన్యంపై 3 హెక్టార్ల (హొక్కైడో లో 12 హెక్టార్లు) మేరకు పరిమితి విధించారు. తద్వారా భూస్వామ్య విధానం పునరుద్ధరించబడకుండా జాగ్రత్త తీసుకున్నారు. అయితే సగటున 1 హెక్టార్ వరకు భూములు కలిగిన చిన్న తరహా కుటుంబ సాగులో ఎలాంటి మార్పులు చేయలేదు. పెట్టుబడి ఏర్పాటులో గానీ, వ్యవసాయ ఉత్పాదకత వృద్ధిలో గానీ వారి చేర్పు పెద్దగా గుర్తించదగింది కాదు.
-
NOKYO (జపనీస్ లో కేంద్ర వ్యవసాయ సహకార సంస్ధల యూనియన్) లాంటి సంస్ధలను ఏర్పాటు చేశారు. సకల వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకాలు (inputs), రుణాలు మరియు భీమా వ్యాపారాలను అవి మార్కెట్ చేశాయి. ప్రతి గ్రామానికీ, పట్టణానికి ఒక ప్రాంతీయ సహకార విభాగం చొప్పున ఏర్పాటు చేసి నిర్వహించాయి. వారి సహకార సంస్ధలు ఆహార ఉత్పత్తుల పంపిణీకి గుత్తస్వామ్యం వహించాయి. ఈ రోజు 70 శాతం ఆహారం మరియు ఎరువుల పంపిణీ ఈ సహకార సంస్ధల ద్వారానే జరుగుతోంది. అతి తక్కువ సంస్ధాగత వడ్డీలకు రుణాలను సమకూర్చడం ద్వారా వారి గుత్తస్వామ్యం మరింత శక్తివంతం కావించబడింది. భూముల సొంతదారులు వ్యవసాయంలోని తమ మిగులును తిరిగి వ్యవసాయంలోనే పెట్టుబడులు పెట్టగలిగారు.
వ్యవసాయ రంగ వృద్ధి వేగంగా సాగినప్పటికీ పారిశ్రామిక రంగ వృద్ధిని అది అందుకోలేకపోయింది. ఎందుచేతనంటే జపాన్, వ్యవసాయ సరుకుల సరఫరా కోసం అమెరికా మరియు ఇతర ఎగుమతి దేశాల నుండి ఒత్తిడి ఎదుర్కొంది. దానితో పాటు దేశీయ డిమాండ్ కూడా తోడయింది. ఆదాయ స్ధాయిల్లోనూ, జీవన ప్రమాణాల్లోనూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా ప్రముఖంగా వ్యక్తం అయింది. ఈ తేడాను పూడ్చడానికీ, వ్యవసాయ శ్రామికులు బైటికి తరలివెళ్లకుండా ఉండడానికీ 1961లో వ్యవసాయ మౌలిక చట్టాన్ని తెచ్చారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే బాధ్యతను ప్రభుత్వమే నెత్తిన వేసుకుంది. 1960-68 కాలంలో పెరిగిన పారిశ్రామిక వేతనాలతో సరితూగడానికి (వ్యవసాయ) ఉత్పత్తి ధరలను రెట్టింపు చేశారు. ఉత్పత్తిదారుల ధరలు మరియు దిగుమతి ధరల మధ్య తేడా 50 శాతం లోపలే ఎక్కువ ఉండగా దానిని 120 శాతం ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. సహకార సంస్ధల (NOKYO) చేతిలో భారీ స్ధాయిలో రాజకీయ ఒత్తిడి తేగల సామర్ధ్యం ఉంటుంది. ఎంతగానంటే వ్యవసాయ సహకార సంస్ధల కోసం చివరికి రాజకీయ ప్రతిష్టను వదులుకోవడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధపడతాయి.
సమూల భూ సంస్కరణలు తేవడంలో మీజీ పాలకులు విఫలం కావడం సంక్షోభానికి దారితీసింది. 1936లో అర్ధ భూ సంస్కరణలు అమలు చేశారు. 1950లలో 60 లక్షల హెక్టార్లు భూస్వాముల యాజమాన్యంలో ఉండగా ప్రభుత్వం 50 లక్షల హెక్టార్లు మాత్రమే ఉన్నాయని ప్రకటించింది. అప్పటికి ఇంకా రాజకీయ ప్రాబల్యం కలిగిన భూస్వామ్య వర్గాలను రక్షించడానికే ప్రభుత్వం ఇలా చేసింది. భూ సంస్కరణలు సొంత భూ యాజమాన్యం కలిగిన రైతు వర్గం వృద్ధికి మార్గం వేశాయి. వారిలో 40.6 శాతం మందికి 0.5 హెక్టార్ల భూమి మాత్రమే ఉన్నది. 31.9 శాతం మంది రైతులు 0.5 నుండి 0.99 హెక్టార్ల వరకు భూమి కలిగి ఉన్నారు. 1 హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న రైతులు కేవలం సాగు ద్వారానే జీవనం గడపలేరు. ఆ కారణం వలన పరిశ్రమలకు వారే చవక శ్రమ శక్తిని కూడా అందించారు. జపాన్ లో అటవీ భూములు సాగులోకి వచ్చిన భూమి కంటే 5 రెట్లు ఎక్కువ. భూ సంస్కరణలలో భూస్వాముల అటవీ భూములను కలపలేదు. అదే సమయంలో భూస్వాములు ఇతర ఆర్ధిక ఆదాయ వనరులు కూడా కలిగి ఉండడంతో, బలహీనపడినప్పటికీ గ్రామీణ జపాన్ లో ఇప్పటికీ వారు ఆధిపత్య ప్రభావాన్ని కలిగి ఉన్నారు. యుద్ధానంతర జపాన్ లో భూ సంస్కరణలు తక్షణ విప్లవకర చైతన్యాన్ని బలహీనపరిచాయి. అనంతర కాలంలో ఆహార రాజకీయాలు, అమెరికాతో మిలట్రీ ఒప్పందం, వ్యవసాయ విధానాల్లో మార్పులు, NOKYO లో అంతకంతకూ వ్యవసాయేతర సభ్యుల జోక్యం పెరిగిపోవడం… ఇవన్నీ జపాన్ వ్యవసాయ రంగంలో మరొక దశ మార్పులు తెచ్చాయి.
ఇదీ జపాన్ వ్యవసాయ రంగం పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధగా ఎలా మార్పు చెందింది అన్న విషయం గురించిన సంక్షిప్త వివరణ.
