సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల ఫలితాలను వారం రోజుల క్రితం ప్రకటించారు. ప్రస్తుతానికి మూడు విభాగాల ఫలితాలను విభాగాల వారీగా ప్రకటించారు. మూడు కేటగిరీలకు (ఓపెన్, యూత్, నేషనల్) గానూ ప్రపంచం నలుమూలల నుండి ఎంట్రీలు వచ్చాయి. మూడు విభాగాలకు కలిపి మొత్తం 70,000 ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.
మొత్తం మీద (ఓవరాల్) విజయులు ఎవరో ఏప్రిల్ 30 తేదీన మాత్రమే ప్రకటిస్తారు. ఈ లోపు వివిధ విభాగాలలో గెలుపొందిన వారి వివరాలు ప్రకటించారు. అనేక వైవిధ్య భరితమైన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు పోటీకి వచ్చినట్లు ఈ కింది ఫోటోలను చూస్తే అర్ధం అవుతుంది.
ఆయా దేశాల్లోని జన జీవనంతో పాటు జంతు జీవనాన్ని కూడా ఫోటోలు దృశ్యీకరించాయి. అనేక ఫోటోలు ఆయా ప్రాంతాల్లోని సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని మన ముందు నిలుపుతున్నాయి. చిత్రం ఏమిటంటే అనేక ఫోటోల విషయంలో ఫోటోగ్రాఫర్ల స్వస్ధలానికీ తాము ఫోటోలు తీసిన ప్రదేశాలకూ ఏ మాత్రం సంబంధం లేకపోవడం.
ఉదాహరణకి కీన్యాలో ప్రతి సంవత్సరం జులై నెలలో భారీ సంఖ్యలో అనువైన చోట్లకు వలసపోయే అడవి దున్నల ఫోటోకి నేషనల్ కేటగిరీలో అవార్డు రాగా ఫోటో గ్రాఫర్ మాత్రం హాంగ్ కాంగ్ కి చెందిన వ్యక్తి. ఈ ఫోటోకి నేషనల్ కేటగిరీలో మొదటి బహుమతి రావడం విశేషం. అదే కేటగిరీలో మూడో బహుమతి పొందిన మహా కుంభమేళా ఫోటో తీసింది ఒక జర్మనీ వ్యక్తి. చైనాలోని గువాంగ్ జీ రాష్ట్రంలో లీ నదిలో పొద్దు గుంకే వేళలో ప్రయాణిస్తున్న జాలరిని ఫోటో తీయగా దానికి నేషనల్ కేటగిరీలోనే మరో బహుమతి వచ్చింది. ఆ ఫోటో తీసింది ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత మహిళా ఫోటోగ్రాఫర్ నెవిల్లే జోన్స్! ఇలాంటి చిత్రాలు ఈ చిత్రాల్లో ఇంకా ఉన్నాయి.
ఈ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లు అందరూ ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించినవారు. పేరు ప్రఖ్యాతుల వల్ల బహుమతులు వచ్చాయా లేక ఫోటోల్లో పనితనం వల్లే బహుమతులు వచ్చాయా అన్నది బహుశా నిపుణులకు తప్ప తెలియదేమో.
ఈ ఫొటోల్లో కొన్ని దృశ్యాలు ఇలా ఉన్నాయి:
మకావు ద్వీపంలో ఫైర్ డ్రాగన్ పండుగ; పెరు రాజధాని లీమాలో ఒక శ్మశానంలో బెలూన్ లు అమ్ముతున్నట్లున్న వ్యక్తి; గువాంగ్ జి (చైనా) లో గుర్రాల ఫైటింగ్; చైనాలోని ఫీనిక్స్ పట్టణంలో వర్షంలో కాలువ దాటుతున్న మనుషులు; ఉక్రెయిన్ లో బామ్మ, గుర్రం అనుబంధం; కొలోన్ నగరంలో కళాత్మక మెట్ల నిర్మాణం; రేసిజం బ్యాలే నృత్యంలో శిక్షణ పొందుతున్న బాలికలు; ఢాకాలో రైలు పట్టాలే నివాసంగా బతికే మురికివాడలో తమ్ముడిని సాకుతున్న అక్క; ఇనుప ఖనిజం రవాణా చేసే అత్యంత పొడవైన గూడ్స్ రైలు సహారా ఎక్స్ ప్రెస్ పైన రెగ్యులర్ గా ప్రయాణించే మారిటానియా కార్మికులు;
బుఖారెస్ట్ ట్రామ్ స్టేషన్ లో ట్రామ్ కోసం వర్షంలో ఎదురు చూస్తున్న మహిళ; అర్జెంటీనాలో 30 యేళ్ళ క్రితం ఒక డ్యామ్ కూలిపోయినప్పటి వరదలకు కొట్టుకు పోయి మళ్ళీ నిర్మాణానికి నోచుకోని ఒక గ్రామం; వనౌటు దేశపు సా తెగకు చెందిన ముప్పావు నగ్న దేహాల పిల్లలు; నెదర్లాండ్ చలికాలంలో బంగారు వెలుతురు సాయం సమయాన ఓ రోడ్డుపై స్కేటర్లు మిగిల్చిన మంచు చారికలు; 90 శాతం ప్రభుత్వ ఇళ్లలోనే నివసించే సింగపూర్ లోని 1960ల నాటి అపార్ట్ మెంట్ లు; రైలు ప్రయాణంలో అద్భుత దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ కి అందించిన చైనా బాలిక; మలేషియాలోని ఓ కుగ్రామంలో స్ప్లిట్ సెకండ్ తేడాలో బంధించబడిన తమాషా దృశ్యం….
చూడగలిగితే కంటి నిండా చూడొచ్చు!
Photos: The Atlantic



















ఇలాంటి ఫొటోలు చూసినప్పుడు కెమేరా తీసుకొని బయటకు పరుగెత్తాలి అని అనిపిస్తుంది. నేను అమెచ్యూర్ ఫొటొగ్రఫర్ ని కూడా. దయచేసి నా ఫ్లికర్ అకౌంట్ ని చూడమని మనవి.