మధ్య ప్రదేశ్ బి.జె.పి నేత, ఎల్.కె.అద్వానీ శిష్యుడు, ఎన్.డి.ఏ ప్రభుత్వంలో విదేశీ మంత్రి అయిన జశ్వంత్ సింగ్ కి టికెట్ దక్కలేదు. తన సొంత నియోజకవర్గం అయిన బార్మర్ లో పోటీ చేస్తానని సంవత్సరన్నర క్రితమే అద్వానీకి జశ్వంత్ మొర పెట్టుకున్నారట. కానీ ఆయన మొర కాస్తా రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్లే అయింది. గాంధీ నగర్ నుండి భోపాల్ కి బదిలీ అవుతానన్న అద్వానీ మొరని ఆలకించేవారే బి.జె.పి లో లేరు. ఇక ఆయన శిష్య పరమాణువు మొర ఎవరు వింటారు?
ఫలితంగా జశ్వంత్ సింగ్ రెబెల్ అభ్యర్ధి అవతారం ఎత్తారు. బార్మర్ నుండి ఇండిపెండెంట్ అబ్యర్ధిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ నూ, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేనూ శాపనార్ధాలు పెట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం ఒక విషయం అయితే, కాంగ్రెస్ నుండి దూకిన వ్యక్తికి ఆ టికెట్ ఇచ్చేయడంతో జశ్వంత్ దుఃఖోద్వేగం రెట్టింపై టి.వి తెరలు దాటి ప్రవహిస్తోంది.
“మిమ్మల్ని (బార్మర్ నియోజక వర్గ ప్రజలు) గాయపరిచిన వారు ఎవరు? నన్ను బి.జె.పి అధ్యక్షుడు (రాజ్ నాధ్ సింగ్) రెండో సారి కొడితే, కుట్రకు నేతృత్వం వహించింది వసుంధర రాజే. అత్యంత బాధతో, పశ్చాత్తాపంతో నేను చెప్పేదేమిటంటే వీరిద్దరు నాకు ద్రోహం లాంటిది చేశారు, నన్ను మోసగించారు. కేవలం జశ్వంత్ సింగ్ కి వ్యతిరేకంగా మాత్రమే జరిగిన మోసం కాదది. బి.జె.పి విధానాలనూ, సిద్ధాంతాలనూ కూడా వారు మోసం చేశారు” అని జశ్వంత్ సింగ్ వాపోయారు.
ఇంతకీ ఆయన రద్దయ్యే పార్లమెంటులో డార్జిలింగ్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తప్ప బార్మర్ కి కాదు. బార్మర్ వదిలి డార్జిలింగ్ లో పోటీ చేసిన జశ్వంత్ సింగ్ అప్పుడు బార్మర్ ప్రజల్ని మోసం చేసినట్లా కాదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా తన మనసులో కోరికను బార్మర్ ప్రజలకి అంటగట్టడం అసందర్భ ప్రేలాపనా? లేక దుఃఖోద్వేగ పలవరింపా?
2009లో జశ్వంత్ సింగ్ ను బి.జె.పి నుండి బహిష్కరించినప్పుడు కూడా బి.జె.పి అధ్యక్షుడుగా రాజ్ నాధ్ సింగే ఉన్నారు. తన ఆటో బయోగ్రఫీలో మహమ్మద్ ఆలీ జిన్నాను గొప్ప సెక్యులరిస్టు నేతగా పొగడడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ సంగతిని జశ్వంత్ మళ్ళీ గుర్తు చేసుకున్నారు.
2009లో కూడా తనను రాజ్ నాధ్ ఒక ప్యూన్ ను కూడా బహిష్కరించని రీతిలో బహిష్కరించారని, కానీ పార్టీలో మళ్ళీ చేరాక ఆ ఉద్వేగంలో ఆనాటి దుఃఖం లెక్కకు రాలేదని చెప్పుకున్నారు. “పార్టీ ఎన్నికల కమిటీ ప్రారంభ సమావేశాల అనంతరం బార్మర్ విషయమై ఏ ప్రకటనా చేయలేదు. నేను రాజ్ నాధ్ సింగ్ కి ఫోన్ చేశాను. ఆ తర్వాత రోజే నాకు ఆయన ఫోన్ చేసి టికెట్ ఇవ్వడం లేదని చెప్పారు… మరి ఎవరికి ఇచ్చారు? బి.జె.పి వర్కర్ కి కాదు ఇచ్చింది. ఇటీవల వరకూ బి.జె.పిని తిట్టిపోస్తూ కాంగ్రెస్ నుండి పార్టీలోకి దూకిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఇది నన్ను చాలా తీవ్రంగా గాయపరిచింది” అంటూ జశ్వంత్ కన్నీరు కార్చినంత పని చేశారు.
ఇప్పుడు జశ్వంత్ దృష్టిలో అసలు బి.జె.పి, నకిలీ బి.జె.పి అని రెండు పార్టీలు ఉన్నాయి. ఇవి రెండూ బి.జె.పి లోపలనే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పార్టీలో తీవ్ర పోటీ నడుస్తోంది. ప్రస్తుతానికి నకిలీ బి.జె.పి యే గెలిచింది. అందుకే జశ్వంత్ కి టికెట్ దక్కలేదు. సిద్ధాంతాలను నమ్ముకుని, పార్టీ విధానాలను నరనరానా జీర్ణించుకున్న పెద్ద తలకాయలకు ఇప్పుడు బి.జె.పి లో గౌరవం లేదు. ఇప్పుడు జశ్వంత్ సింగ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నది తన కోసం కాదు. బార్మర్ ప్రజల కోసం, వారి గౌరవం కోసం మాత్రమే. అలాగే విధానాలు, సిద్ధాంతాల గౌరవం కోసం కూడాను.
ఇలాంటి వలపోతలను భారత ప్రజలు ఎన్ని చూడలేదు?

జస్వంత్ ఒంటరైనప్పుడు ఇక తుంటరి అదే రెండవ పార్టీకి అవకాశమెక్కడవుంది? మోడీ ప్రభంజనంతో పాటు ఇప్పుడు స్వభంజనం కూడా ఎదురైంది. మోడి ఒక తాటిపైన నడిపించే ప్రయత్నానికి హర్షించాలో లేక జస్వంత్లంటి వృద్ధనాయకుల వర్షించే దుఖ్ఖాశృవులకు చింతించాలో తెలియని బరువైన స్థితి. కాలమే ఓదార్చాలి.