మోడీయిజం: లైనంటే లైనే, లేదా తొక్కేస్తా!


Modiism 2

‘రోజులు మారాయి’ సినిమాలో ఒక రిటైర్డ్ జవాన్ తరచుగా ఓ మాట అంటుంటాడు. “మాటంటే మాటే, సూటంటే సూటే. ఆ!” అని.

అలాగే బి.జె.పి నాయకులు తరచుగా చెప్పే మాట ‘మాది భిన్నమైన పార్టీ’ (different party). విమర్శకులు కూడా అంతే తరచుగా బి.జె.పిని ‘విభేదాల పార్టీ’ (party with differences) అని అభివర్ణిస్తారు.

బి.జె.పి జాతీయ దృశ్యం లోకి నరేంద్ర మోడి చొరబడ్డాక స్టాల్ వార్ట్స్ అనుకున్న నాయకులంతా అణిగి మణిగి ఉండాల్సిన పరిస్ధితి వచ్చిందని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ కార్టూన్ కూడా అదే సూచిస్తోంది.

‘Toe the line’ అనేది ఆంగ్లంలో ఒక వాడుక. ఇష్టం ఉన్నా లేకపోయినా నిర్దేశిత మార్గాన్ని పాటించడం, లేదా ఒక నిర్ణయాన్ని అనుసరించాల్సిన పరిస్ధితిని ఈ వాడుకలో చెబుతారు. బి.జె.పిలో హేమా హేమీలుగా పేరు గాంచిన నాయకులంతా ఇపుడు మోడి నిర్దేశించిన లైన్ లో నిలబడాల్సిన పరిస్ధితిలో పడిపోయారని, అలా నిలబడనివారి Toe ని తొక్కి మరీ మోడి నిలబెడుతున్నారని కార్టూన్ సూచిస్తోంది.

ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలియదు గానీ రెండో వ్యక్తి మాత్రం మురళీ మనోహర్ జోషి అని అర్ధం చేసుకోవచ్చు. ముందు తన వారణాసి సీటును వదులుకునేది లేదని స్పష్టం చేసిన జోషి ఆ తర్వాత ఎలాగో దారికొచ్చి పార్టీ మాట జవదాటను అని ప్రకటించాల్సి వచ్చింది.

ఇక రధయాత్ర ద్వారా బి.జె.పి బలాన్ని 2 సీట్ల నుండి 80 సీట్లకు పెంచిన ఎల్.కె.అద్వానీది కూడా అదే పరిస్ధితి. సిటింగ్ సీటు గాంధీ నగర్ నుండి భోపాల్ కు మారాలని ముచ్చటపడిన అద్వానీని గాంధీ నగర్ లోనే పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది.

ఇతర నాయకులకు తమకు ఇష్టం అయిన సీటు కేటాయించి తనకు మాత్రం అడిగింది ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ అద్వానీ మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారా అన్న అనుమానాలను రేకెత్తించారు. మళ్ళీ ఏమయ్యిందో గానీ ఆయనా దారికొచ్చి గాంధీ నగర్ కే ఓ.కె అనేశారు.

మోడీయిజం ప్రస్తుతం అలా చెల్లుబాటవుతోంది! కార్యకర్తలు మోడి వెంటే ఉన్నారని దానితో తామూ ఏమీ అనలేకపోతున్నామని సుష్మా లాంటి నేతలు సణుగుతున్నారని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఎన్నికలు ముగిశాకయినా వెల్లడి కాక మానదు.

7 thoughts on “మోడీయిజం: లైనంటే లైనే, లేదా తొక్కేస్తా!

  1. పింగ్‌బ్యాక్: మోడీయిజం: లైనంటే లైనే, లేదా తొక్కేస్తా! | ugiridharaprasad

  2. అవును. ఆయన జశ్వంత్ సింగే. బి.జె.పి ఆయనకి టికెట్ ఇవ్వలేదు. అద్వానీ శిష్యుడు కనకనే (మోడీ వల్ల) ఇవ్వలేదని, అద్వానీ అలిగింది కూడా అందుకేనని ఒక అభిప్రాయం. ఈ సంగతి రాయడం మరిచాను.

  3. బి.జె.పి. భీష్మాచార్యుడు(అద్వాని) నే అంపశయం మీద దిగజార్చిన విజయడు మోడి. రాజకీయాలు ఎప్పుడు ఒకే మూసలో వుంటే యాదవకులంలో ముసలం పుడుతుంది. ద్వాపర కర్త కూడా బోయ బాణానికి గురై అవతార పరిసమాప్తి చెందాడు. ముసలి ఛాందస్తాలలో రాజకీయలు మగ్గితే వర్తమానంలో పురోగతి తగ్గుతుంది.

వ్యాఖ్యానించండి