ఇండియాకు వ్యతిరేకంగా ఇటలీ తొక్కని గడప లేదు. ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటలీ మెరైన్ల కేసులో ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కు మొర పెట్టుకున్న ఇటలీ తాజాగా ఐక్యరాజ్యసమితి గడప తొక్కింది. భారత దేశం బందిఖానా నుండి తమ మెరైన్లను మీరయినా విడిపించాలని ఐరాసను కోరింది.
“మెరైన్లను ఇటలీలో విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ లోగా వారికి (భారత దేశం నుండి) విముక్తి కావాలి” అని ఇటలీ హోమ్ మంత్రి ఏంజలీనో అల్ఫానో అన్నారని అన్సా వార్తా సంస్ధ తెలిపింది. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ ను కలవడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
తమ మెరైన్లను విడిపించడం కోసం ఇటలీ అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా గత నెలలో యూరోపియన్ యూనియన్ చేత ప్రకటన ఇప్పించింది. మెరైన్లకు కఠిన శిక్షలు విధిస్తే ప్రతి చర్యలు తీసుకుంటామని ఇ.యు హెచ్చరించింది. అయితే ఇండియా మాత్రం బెదిరినట్లు ఏమీ కనిపించలేదు.
తమ మెరైన్లను కోర్టులో విచారించే హక్కు, పరిధి తమకు మాత్రమే ఉన్నాయని ఇటలీ ప్రభుత్వం వాదిస్తోంది. అంతర్జాతీయ జలాల్లో సంఘటన జరిగింది కనుక జాలర్ల హత్య కేసును తాము విచారిస్తామని వాదిస్తోంది. ఇండియా ఈ వాదనను తిరస్కరిస్తోంది. చనిపోయింది భారతీయ జాలర్లేనని, భారత వాణిజ్య జలాల పరిధిలో సంఘటన జరిగిందని కనుక సముద్ర జలాల చట్టం ప్రకారం విచారించే హక్కు, పరిధి భారత్ కు ఉన్నాయని వాదిస్తోంది.
సంఘటన జరిగిన వెంటనే భారత నావికా బలగాలు, కేరళ పోలీసులు వేగంగా స్పందించి ఇటలీ నావికులను అరెస్టు చేయడంతో ఇటలీకి మరో మార్గం లేకపోయింది. బాధిత కుటుంబాలకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి బైటపడడానికి ఇటలీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే సుప్రీం కోర్టు జోక్యంతో అది సాధ్యం కాలేదు.
ఇటలీ నావికులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని గత సంవత్సరం జనవరిలో ఆదేశించింది. సంవత్సరం పూర్తయినా ఆ ఆదేశాలు అమలు కాలేదు. యాంటీ-పైరసీ చట్టాని ప్రయోగించడంతో మరణ శిక్ష విధిస్తారేమోనని ఇటలీ యాగీ చేసింది. అయితే మరణ శిక్ష విధించబోమని ఇండియా హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత కాసింత చల్లబడింది. కానీ విచారణ ముందుకు సాగకుండా, మెరైన్లకు విముక్తి లేకుండా నెలలు గడుస్తుండడంతో ఇటలీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. భారత ప్రభుత్వం మాత్రం ఇటలీ అసహనాన్ని పట్టించుకున్నట్లు లేదు.
గత నెలలో ఇటలీ మెరైన్ల విషయంలో ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్పందించి ఒక ప్రకటన జారీ చేశారు. అయితే ఆ ప్రకటన ఎవరి పక్షమూ తీసుకోలేదు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మాత్రమే తెలిపింది. ఇటలీ, ఇండియాల మధ్య సుదీర్ఘకాలం సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల స్నేహితులైన ఇరు సభ్య దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
యూరోపియన్ యూనియన్ కూడా ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరించడం తప్ప ఇతమిద్ధంగా కార్యాచరణకు దిగలేదు. దీనితో ఇటలీ చేసిన అంతర్జాతీయ ప్రయత్నాలు ఇప్పటివరకూ సఫలం కాలేదు.
రాయబారి వెనక్కి
ఇదిలా ఉండగా మెరైన్ల కేసును ఈ రోజు (మార్చి 18) సుప్రీం కోర్టు మరో వారం పాటు వాయిదా వేసింది. దీనితో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం ప్రకటించింది. ఇండియాలోని తమ రాయబారి చర్చల నిమిత్తం వెంటనే వెనక్కి రావాలని కోరింది. ఈ మేరకు ఇటలీ రాయబారి డేనియల్ మన్సిని ఇటలీ పయనమైనట్లు తెలుస్తోంది.
సుప్రీం కోర్టు నిర్ణయంతో పరిస్ధితిని సమర్ధవంతంగా నిర్వహించే సామర్ధ్యం ఇండియాకు లేదని స్పష్టం అవుతోందని ఇటలీ ప్రభుత్వం వ్యాఖ్యానించిందని ది హిందు తెలిపింది. విచారణలో అపరిమిత జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేసింది.
తమ రాయబారిని వెనక్కి పిలవడంతోనే ఇటలీ ఆగిపోలేదు. ఇటలీలోని భారత రాయబారి బసంత్ గుప్తాను పిలిపించుకుని సుప్రీం కోర్టు నిర్ణయం పట్ల తమ అసంతృప్తిని తెలియజేసింది. ఈ మేరకు ఇటలీ విదేశాంగ శాఖ పత్రికలకు సమాచారం ఇచ్చింది. ఇటలీ చర్యలపై వ్యాఖ్యానించడానికి భారత విదేశాంగ శాఖ నిరాకరించిందని పత్రిక తెలిపింది.

ఇటలిలోని మన రాయబారిని వెనక్కి పంపినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాయబారుల తీరుతెన్నులు మనకి తెలిసినవె. చర్యకు ప్రతి చర్యలు తీసుకునే ఏకైక విదేశీ వివక్షత విధానం. న్యూటన్స్ మూడవ సిద్ధాంత ప్రాతిపదికను పరిగణలోకి వస్తుంది.