జనం భారీగా వస్తేనే అన్నా వస్తారు -కార్టూన్


Anna support

అవును. జనం పెద్ద సంఖ్యలో వస్తేనే అన్నా హజారే సభలకు వస్తారట. లేకపోతే రారట. ఈ సంగతి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సభ ద్వారా తెలిసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అన్నా హజారేలు ఇరువురూ హాజరు కావలసిన సభకు అన్నా రాలేదు. కారణం ఏమిటా అని చూస్తే సభకు పెద్దగా జనం రాకపోవడం వల్లనే అన్నా రాలేదని ఆయన ప్రతినిధులు వివరించారని పత్రికలు తెలిపాయి.

మార్చి 12 తేదీన ఢిల్లీలో ఒక ఎన్నికల ర్యాలీ జరిగింది. సభకు అన్నా హజారే కూడా రావలసి ఉంది. ఈ సభకు మమతా బెనర్జీ హాజరయినప్పటికీ అన్నా రాలేదు. తనకు ఆరోగ్యం సరిగా లేనందున రాలేకపోతున్నానని వర్తమానం పంపారు. అయితే అసలు కారణం అది కాదని ది హిందూ, తదితర పత్రికల ద్వారా తెలిసింది. జనం పలుచగా వచ్చారని, మరింత మందిని కూడగట్టి ఉన్నట్లయితే అన్నా వచ్చేవారని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పినట్లు పత్రికలు తెలిపాయి.

కానీ మమతా బెనర్జీ తన ప్రసంగంలో అన్నాను పరోక్షంగా దెప్పి పొడిచారు. ర్యాలీ అసలు తాము తలపెట్టింది కాదని ఆమె చెప్పడం విశేషం. తాము తలపెట్టిన ర్యాలీ అయితే జనం బాగా వచ్చి ఉండేవారని ఆమె పరోక్షంగా చెప్పారన్నమాట. మొత్తం మీద మమతా బెనర్జీకి అన్నా ప్రకటించిన మద్దతు ఈ స్ధితికి వచ్చింది. బెంగాల్ బయట మమతా బెనర్జీ పార్టీకి అభ్యర్ధులను కూడా వెతికి పెడతానని హామీ ఇచ్చిన అన్నా ఇప్పుడా పని చేస్తారా లేదా అన్నది చూడాలి.

మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు ఇవ్వాలంటే తాను 17 షరతులు విధించానని అన్నా ఫిబ్రవరిలో చెప్పారు. ఈ షరతుల్లో ప్రతి ఒక్క షరతుకూ ఒక్కొక్క అఫిడవిట్ చొప్పున 17 ఆవిడవిట్ ల ద్వారా ఆమోదం తెలిపినట్లయితే తాను ఏ.కె పార్టీ కోసం సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసి పెడతానని అన్నా ప్రకటించారు. ఎఎపి మాత్రం దానికి ఇంతవరకు స్పందించలేదు.

అన్నా హజారే ఇంకా గత కాలపు ఊహల్లో విహరిస్తున్నారని కార్టూన్ సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. భారీగా జనం హాజరయితే, చప్పట్లు, నినాదాలు మారుమోగుతుండగా, అందరి చేతుల్లో జాతీయ జెండాలు రెపరెపలాడుతుండగా ప్రసంగం చేస్తే ఆ అనుభవమే వేరు. అవినీతి ఉద్యమంలో అరవింద్ తదితరులు జనాన్ని తెస్తే సదరు సభల్లో ‘తన వల్లనే’ ఆ జనం వచ్చారన్నట్లుగా ఆదేశపూరిత ప్రసంగాలు చేసిన అన్నా మళ్ళీ అలాంటి సభల్లో తప్ప ప్రసంగం కూడదని ఒట్టు పెట్టుకున్నారేమో. కానీ ఈసారి అరవింద్ ఆయనతో లేరు. ఆయన రాకుండా 17 షరతులు కూడా విడిస్తిరాయే.

కె. విశ్వనాధ్ సినిమాల్లో ఇలాంటి క్యారక్టర్లు కనిపిస్తుంటాయి. వివిధ చాదస్తాలతో, సూత్రాలతో అందరినీ దూరం చేసుకుని చివరికి తన స్ధాయి పడిపోయిన సంగతి గుర్తించి అందరితో కలిసిపోయే కేరక్టర్లు అవి. కార్టూన్ లో మూతి బిగించి 17 షరతుల ముళ్ళ చాపపై ‘నా పంతం నాదే’ అన్నట్లు కూర్చుని ఉన్న అన్నాను చూస్తే ఆ కేరక్టర్లు గుర్తుకు రాక మానరు.

3 thoughts on “జనం భారీగా వస్తేనే అన్నా వస్తారు -కార్టూన్

  1. అవును శేఖర్ గారు. ఇటువంటి కేరెక్టర్లు సినిమాల్లో కోకొల్లలుగా ఉంటాయి.
    ఓ సినిమాలో పెదరాయుడు సినిమాకు పేరడీగా ఓ కేరెక్టర్ గా ఉంటుంది. అందులో పెదరాయుడు లాగే తీర్పులు ఇచ్చి… అందరినీ ఊరినుంచి వెలివేస్తాడు. చివరకు వెలివేసిన వాళ్లందరిదీ ఊరైతే పెదరాయుడు ఒక్కడే గ్రామంలో ఒంటరిగా మిగిలిపోతాడు.
    నాటకాల్లోనో…., సినిమాల్లోనో…, ఒకే పాత్రకు ఆసాంతం ప్రాధాన్యముంటుంది. కానీ రాజకీయ రంగంలో చిరకాలం ఒకే పాత్ర ఆధిపత్యం కొనసాగించలేదు. తమకు అవకాశం వీలు ఉన్నంత కాలం పోరాడాలి. కొంతకాలానికి పరిస్థితులు మారతాయి. అప్పటి వరకూ హీరోలుగా ఉన్న వాళ్లు ఒక్కసారిగా జీరోలుగా మారిపోతారు. ఆ పరిస్థితి రాకముందే తమ విలువను కాపాడుకునేందుకు వారే స్వయంగా రంగస్థలం నుంచి వైదొలగాలి. లేదూ…ఇంకా అలాగే ఉంటామని కూర్చుంటే…, చివరకు పట్టించుకునే వాళ్లుండరు. ఈ పరిస్థితి హజారే గారికే కాదు. మహామహా నేతలకే తప్పలేదు.

    ఇక హజారే విషయానికొస్తే……. పోనీ లెండి పెద్దమనిషి వదిలేద్దాం. మొత్తానికి దేశంలో పర్యావరణం మీద, అవినీతి మీద జనానికి ఎంతో కొంత స్పృహ తెచ్చారు. ఆ విషయంలో హజారేను అభినందించాల్సిందే. ఆయన అందించిన స్ఫూర్తితో ….మిగిలిన పోరాటం ముందుకు కొనసాగించాలి.

వ్యాఖ్యానించండి