
A pro-Russian activist sits inside a tent in front of Lenin’s statue in Alupka (Crimea) March 12, 2014.
ఉక్రెయిన్ విషయంలో రష్యాపై ఆంక్షలు విధిస్తామన్న అమెరికా, ఐరోపా బెదిరింపులను చైనా వారించింది. నాలుగు నెలలుగా నలుగుతున్న ఉక్రెయిన్ సంక్షోభంపై ఇంతవరకు చైనా నోరు మెదిపింది లేదు. బ్రిక్స్ కూటమిలో సహ సభ్య దేశమైన రష్యాకు మద్దతు ఇవ్వడానికి చైనా ముందుకు రాలేదు. ఐరాస భద్రతా సమితిలో కూడా శాంతి ప్రవచనాలు పలకడం వరకే పరిమితం అయింది. పైగా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అనుల్లంఘనీయం అంటూ రష్యాను సుతి మెత్తగా మందలించబోయింది.
అలాంటిది రష్యాపై ఆంక్షలు విధిస్తామని చేస్తున్న బెదిరింపులు ఆచరణలోకి వస్తే పరిస్ధితి అదుపు తప్పవచ్చని చైనా మొదటిసారి హెచ్చరించింది. రష్యాపై ఆంక్షలు విధిస్తే అవి అంతటితో ఆగిపోవని, ప్రతీకార ఆంక్షలు అమలులోకి వస్తాయని, ఆ విధంగా పరిస్ధితి ఎవరి అదుపులో లేకుండా పోవచ్చని హెచ్చరించింది.
జర్మనీలో చైనా రాయబారి చైనా తరపున మొట్టమొదటి సారిగా ఉక్రెయిన్-క్రిమియా సంక్షోభంపై స్పందించాడు. హింసాత్మక ఆందోళనల ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత ఉక్రెయిన్ లో ఏర్పడిన పశ్చిమ అనుకూల ప్రభుత్వాన్ని గుర్తించడానికి క్రిమియా ప్రభుత్వం నిరాకరించింది. రష్యన్లు ఎక్కువగా నివసించే క్రిమియా పార్లమెంటు ఉక్రెయిన్ నుండి విడిపోయి, రష్యాలో కలవడానికి తీర్మానాన్ని సైతం ఆమోదించింది. ఈ తీర్మానానికి ప్రజామోదం పొందడానికి మార్చి 16 తేదీన క్రిమియా ప్రభుత్వం తలపెట్టిన రిఫరెండంను గుర్తించడానికి ఇప్పుడు పశ్చిమ దేశాలు తిరస్కరిస్తున్నాయి.
ఉక్రెయిన్ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి చట్ట విరుద్ధ పద్ధతుల్లో పశ్చిమ దేశాలు నెలకొల్పిన ప్రభుత్వాన్ని గుర్తించడానికి రష్యా నిరాకరిస్తుండగా, క్రిమియాలో ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణనే పశ్చిమ దేశాలు గుర్తించ నిరాకరిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో క్రిమియాలో రిఫరెండం నిర్వహించకుండా నిలిపేయాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా క్రిమియా ప్రజలు తమ ప్రాంత భవిష్యత్తును నిర్వహించుకునే హక్కు కలిగి ఉన్నారని కాబట్టి వారి నిర్ణయంతో తమకు సంబంధం లేదని రష్యా స్పష్టం చేస్తోంది. క్రిమియాలో రిఫరెండం నిలిపివేయని పక్షంలో రష్యాపై పలు రాయబార, వీసా, ఆర్ధిక ఆంక్షలు విధిస్తామని ఐరోపా, అమెరికా చేస్తున్న బెదిరింపులు పరిస్ధితిని మరింత క్షీణింప జేస్తాయని చైనా వారిస్తోంది.
“ఆంక్షలు విధించడం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఆంక్షలు తిరిగి ప్రతీకార ఆంక్షలు విధించడానికే ప్రేరేపిస్తాయి. అదే జరిగితే మున్నెన్నడూ మనం చూడనట్టి వర్తులాకార పరిణామాలు సంభవించడం తధ్యం. ఇలాంటి పరిస్ధితిని మేము కోరుకోవడం లేదు” అని జర్మనీలో చైనా రాయబారి షి మింగ్ దే అన్నారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. షి మింగ్ తో తాము బుధవారం ఇంటర్వ్యూ తీసుకున్నామని, సదరు ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారని రాయిటర్స్ తెలిపింది.
ఉక్రెయిన్-క్రిమియా సమస్యకు సంబంధించి ‘కాంటాక్ట్ గ్రూపు’ ఏర్పాటు చేద్దామని అమెరికా, ఇ.యు లు ప్రతిపాదిస్తున్నాయి. దీనిని రష్యా తిరస్కరిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభంలోకి తమను లాగవద్దని రష్యా కోరుతోంది. దానికి బదులుగా, ఉక్రెయిన్ లో సంక్షోభాన్ని రెచ్చగొట్టింది అమెరికాయే కాబట్టి అమెరికాతో చర్చించడానికి తాము సిద్ధం అని రష్యా చెబుతోంది. అమెరికా, ఇ.యు లేమో ఉక్రెయిన్ నూతన ప్రభుత్వంతో రష్యా చర్చించాలని కోరుతున్నాయి. కానీ నూతన ప్రభుత్వాన్ని రష్యా గుర్తించడం లేదు. రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకుని ఉక్రెయిన్ నూతన ప్రభుత్వానికి అంతర్జాతీయ చట్టబద్ధత తెచ్చుకోవడానికి అమెరికా, ఇ.యు లు ప్రయత్నిస్తున్నాయి.
ఉక్రెయిన్-క్రిమియా వ్యవహారానికి ఇప్పటివరకు దూరంగా ఉన్న చైనా మొదటిసారి గొంతు విప్పడంతో రష్యా వాదనకు లేశమాత్రమైనా అంతర్జాతీయ మద్దతు లభించినట్లయింది. రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్ధాయిలో పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారానికి లంకించుకున్న పశ్చిమ కార్పొరేట్ మీడియా సంక్షోభంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన వివరణను ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తూ అమెరికా, ఇ.యు ల హెచ్చరికలను మోస్తున్నాయి.
ఇరు పక్షాలు ఓపిక వహించాలని చైనా రాయబారి కోరడం వెనుక ఆ దేశం యొక్క ‘అంటీముట్టనితనం’ వెల్లడి అయింది. అంతర్జాతీయ వివాదాల్లో చైనాది 1980 ల నుండీ ఇదే ధోరణి. మావో హయాంలో పశ్చిమ దేశాల ఆధిపత్య, దురహంకార ధోరణులకు వ్యతిరేకంగానూ, మూడో ప్రపంచ దేశాల న్యాయమైన డిమాండ్ లకు మద్దతుగానూ ప్రతి సందర్భంలోనూ గొంతు విప్పిన చైనా, డెంగ్ నేతృత్వంలోని రివిజనిస్టు ముఠా పెట్టుబడిదారీ పంధా చేపట్టినాక ఎన్నడూ అంతర్జాతీయ వ్యవహారాల్లో తగిన విధంగా చొరవ ప్రదర్శించలేదు. తన వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేసే ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చింది. ఉక్రెయిన్-క్రిమియా విషయంలో కూడా ఇదే ధోరణిని చైనా కొనసాగిస్తోంది.
>వర్తులాకార పరిణామాలు
చక్రీయపరిణామాలు అంటే మరింత సబబుగా ఉండేదేమో
శ్యామల రావు గారు. వర్తులాకార పరిణమాలు అంటేనే సబబు. చక్రీయ పరిణామాలు అంటే జరిగినవే మళ్లీ మళ్లీ జరగడం
అని కదా. కానీ చరిత్రలో మళ్లీ జరిగినవే మళ్లీ జరగవు కదా. కానీ చరిత్రను పోలిన సంఘటనలే జరుగుతాయన్నమాట. అటువంటి వాటిని వర్తులాకారం ( స్పైరల్ ) అనటమే బాగుంటుంది కదా.
చందుతులసి గారు,
మీ వ్యాఖ్య సైద్దాంతికంగా ఉంది.
స్పైరల్ అన్న పదానికే నేను వర్తులాకారం అని వాడాను. తిరుపాలు గారు చెప్పినట్లు చందుతులసి గారు ఇచ్చిన వివరణ సరిగ్గా సరిపోయింది.