ప్రశ్న: భారత్ విదేశాలపై దాడి ఎందుకు చేయలేదు?


Vedic_India

కె.బ్రహ్మయ్య:

1) ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ESPECIALLY FOR MUSLIMS INVADERS.

2) గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు? IS THERE NOT ENOUGH STRENTH FOR INDIA?

సమాధానం:

ప్రాచీన క్షాత్ర పరంపర అంటే ‘మనవాళ్ళంతా యుద్ధాల్లో ఆరితేరినవారు’ అని మీ ఉద్దేశ్యం అయి ఉండాలి. క్షత్రియ రాజులుగా యుద్ధ విద్యల్లో ఆరితేరినవారై ఉండికూడా భారతీయ సమాజాన్ని ఏలిన పాలకులు విదేశీ జాతుల చేతుల్లో ఓడిపోవడం ఏమిటి అన్నది మీ ఆశ్చర్యం. 

క్షత్రియులు అని రాజులకు లేదా రాజ్యాల్ని ఏలిన పాలకులకు హిందూ మతం పెట్టుకున్న పేరు. విదేశాల్లో రాజులకు ఆ పేరు లేనంత మాత్రాన వారు రాజులు లేదా రాజ్యాల్ని ఏలిన పాలకులు కాదని అర్ధం కాదు కదా! అనగా క్షత్రియులు అని మనకు మనం ఎవరని చెప్పుకునామో అలాంటి కేరక్టర్లు దాదాపు అన్ని సమాజాల్లోనూ ఉన్నారు. కాకపోతే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి అయిన భాషలు, సంస్కృతి, ఇతర ఆచార వ్యవహారాలు అన్నీ వేరు వేరు కాబట్టి ఎవరి భాషకు తగిన పేరు వారు పెట్టుకున్నారు.

ఉదాహరణకి బ్రిటన్ లో కింగ్ లేదా క్వీన్ అన్నారు. ఇప్పటికీ ఆ దేశాన్ని యునైటెడ్ ‘కింగ్ డమ్’ అని పిలుస్తున్నారు.  జపాన్ లో వివిధ కాలాలను బట్టి తెన్నో అనీ, మీజీ అనీ పిలిచారు. కానీ మన క్షత్రియుల తరహాలో పోరాడేవారిని ‘సమురాయ్’ అన్నారు. రష్యా రాజుల్ని జార్ అంటారని మనకి తెలిసిన విషయమే. ఇలాగే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఫ్యూడల్ రాజుల పాలన కొనసాగింది. ఈ పేర్లలో కొన్ని వంశ నామాలు కాగా మరికొన్ని అలాంటి తరగతికి పెట్టిన పేర్లుగా ఉన్నాయి.

ప్రజల కోణం నుండి మనం చూడవలసింది ఏమిటి అన్నదే ముఖ్యం. అలా చూసినపుడు దాదాపు ప్రతి సమాజం వివిధ దశలను దాటుతూ వచ్చిందని గమనించవచ్చు. సోషియాలజీలో ఈ దశలను ఆదిమ కమ్యూనిస్టు సమాజం, బానిస సమాజం, ఫ్యూడల్ (భూస్వామ్య) సమాజం, పెట్టుబడిదారీ సమాజం, సామ్యవాద సమాజం అని పిలుస్తున్నారు. చరిత్రలో ఆయా దేశాలు ఎదుర్కొన్న పరిస్ధితులను బట్టి అక్కడి సమాజాలు కూడా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని దేశాల్లోని సమాజాలు సమాన దశల్లో లేవు.

ఉదాహరణకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా తదితర పశ్చిమ దేశాల్లో మిగతా ప్రాంతాల కంటే ముందు విప్లవాలు సంభవించాయి. అవి విజయవంతం కూడా అయ్యాయి. అందువలన ఇతర ప్రాంతాల కంటే మొదట పశ్చిమ దేశాల్లో వ్యవస్ధలు అభివృద్ధి చెందాయి. భారత దేశ చరిత్రను గమనిస్తే ఇక్కడ అలాంటి విప్లవాలు విజయవంతం కాలేదు. కనీసం బూర్జువా ప్రజాస్వామ్య విప్లవం కూడా సరిగ్గా జరగలేదు. అందువలన భారతీయ సమాజం ఇంకా వెనకబడే ఉంది. వెనకబడి ఉన్న సమాజాలను జయించడం ఆధునిక సమాజాలకు చాలా తేలిక. అందుకే బ్రిటన్, ఫ్రాన్స్, డచ్, పోర్చుగల్ తదితర దేశాలు వ్యాపారం పేరుతో వచ్చి సునాయాసంగా ఇక్కడ ఆక్రమణలు చేయగలిగారు.

సమాజం ఒక దశ నుండి తదుపరి ఉన్నత దశకు అభివృద్ధి చెందాలంటే ఆ సమాజంలో వివిధ వర్గాల మధ్య చర్య ప్రతిచర్యలు తప్పనిసరి. అనగా అణచివేతకు గురవుతున్న వర్గాలు అణచివేతకు పాల్పడుతున్న వర్గాలపైన ఏదో విధంగా తిరుగుబాటు చేసి ఆ అణచివేతకు నిర్ణయాత్మకమైన ముగింపు ఇవ్వాలి. అలాంటి నిర్ణయాత్మకమైన ముగింపును విప్లవం అంటారు. బానిస సమాజం దాని తదుపరి ఉన్నత సమాజం అయిన భూస్వామ్య సమాజ దశకి అభివృద్ధి చెందడం అనేది బానిస విప్లవాల వల్లనే జరిగింది. అలాగే ఫ్యూడల్ సమాజాల నుండి తదుపరి ఉన్నత దశ అయిన పెట్టుబడిదారీ సమాజానికి అభివృద్ధి చెందడం అనేది ‘ప్రజాస్వామిక విప్లవం’ ద్వారా జరిగింది. ఈ విప్లవాన్ని పెట్టుబడిదారీ విప్లవం అని కూడా అంటారు.

పెట్టుబడిదారీ సమాజం దాని తదుపరి అభివృద్ధి దశ అయిన సోషలిస్టు సమాజంగా అభివృద్ధి చెందడానికి ‘సోషలిస్టు విప్లవం’ జరగాలి. అయితే ఈ సోషలిస్టు విప్లవం సంపూర్ణ పెట్టుబడిదారీ దేశాలలోనే సాధ్యం. ఇండియా సంపూర్ణ పెట్టుబడిదారీ సమాజం  కాదు. ఇక్కడ ప్రజాస్వామిక విప్లవం జరగకుండా బ్రిటిష్ వల పాలకులు అడ్డుకున్నారు. దానితో ఫ్యూడల్ (భూస్వామ్య) సమాజం ఇంకా వివిధ రూపాల్లో కొనసాగుతోంది. అదే సమయంలో వలస పాలన తెచ్చిన వివిధ వసతులు, మార్పుల వలన మనది పెట్టుబడిదారీ సమాజం అన్న భ్రమను కూడా కలిగిస్తాయి. వాస్తవంలో మనం ఇంకా ఫ్యూడల్ దశ నుండి బయటపడలేదు. అందుకే ఒకప్పటి రాజులు, భూస్వాములే కంపెనీలు నిర్వహిస్తూ పార్లమెంటులో కనిపిస్తున్నారు. ఇలాంటి దేశాల్లో జరిగే విప్లవాన్ని చైనాలో 1949 నాటికి పూర్తయిన ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ తరహాలో ఉంటుంది.

మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం.

ఐరోపా దేశాల వ్యాపారస్ధులు వచ్చే సమయానికి మన భారత దేశం అంతా ఒకరి పాలనలో లేదు. అసలు భారత దేశం అన్నదే లేదు. భారత ఉపఖండం అని పిలిచే ప్రత్యేక ప్రాంతం మాత్రమే ఉంది. ఇది వివిధ రాజుల పాలనా ప్రాంతాలుగా చీలిపోయి ఉంది. కాబట్టి భారత దేశాన్ని ఒక దేశంగా పరిగణించదగిన పరిణామాలు బ్రిటిష్ వాళ్ళ వల్ల జరిగాయి. ముందే చెప్పినట్లు అప్పటికే ఐరోపా దేశాలలో ఆయా విప్లవాలు జరుగుతూ ఉన్నాయి. సమాజంలోని వివిధ వర్గాల మధ్య చురుకైన ఇంటరాక్షన్ జరుగుతోంది. సామాజిక విప్లవాలు జరగడం ఒక ఎత్తయితే ఐరోపాలో సంభవించిన పారిశ్రామిక విప్లవం మరొక ఎత్తు.

పెద్ద పెద్ద పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి తగిన శాస్త్ర ఆవిష్కరణలు ఐరోపాలో జరిగాయి. ఈ ఆవిష్కరణల సహాయంతో సరుకుల రవాణా సౌకర్యాలలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. దానితో ఉత్పత్తి శక్తులు మరింతగా అభివృద్ధి చెందాయి. ఈ ఉత్పత్తి శక్తులు ఇంకా అభివృద్ధి చెందడానికి అక్కడ పాత సమాజాలు ఆటంకం అయ్యాయి. ఈ ఆటంకాన్ని విప్లవాల ద్వారా అక్కడి సమాజాలు తొలగించుకున్నాయి. అనగా సమాజ అభివృద్ధిని ఆటంక పరుస్తున్న శక్తులను సాయుధంగా కూలదోసి సరికొత్త ప్రభుత్వాలను ఏర్పరచుకున్నాయి. ఈ పరిణామాలు ప్రజల ఆలోచనల్లో, సామాజిక భావనల్లో కూడా మార్పు తెచ్చాయి.

కానీ భారత దేశం కుల సమాజంగా ఇంకా ఇంకా తీసుకుంటోంది. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందకుండా, శాస్త్రబద్ధ ఆవిష్కరణలు జరగకుండా కుల, మతాలకు సంబంధించిన వెనుకబాటు భావనలు ఆటంకం కలిగించాయి. ఈ ఆటంకాలను తొలగించడానికి ప్రజలు కంకణబద్ధులై విప్లవాలకు తెగించేలోపు బ్రిటిష్ వాడు దేశాన్ని ఆక్రమించేశాడు. అనగా ఐరోపాలో జరిగినట్లుగా భారత దేశంలో కూడా విప్లవాల ద్వారా పాత వెనుకబడిన సమాజాలను మార్చుకోవడానికి ప్రజలు సిద్ధపడకుండా బ్రిటిష్ వాడు అణచివేశాడు. అదే సమయంలో ఇక్కడి భూస్వామ్య వ్యవస్ధను కాపాడి తనకు సేవలు చేసేదిగా, తన అవసరాలు తీర్చేదిగా మార్చుకున్నాడు.

అనగా భారత సమాజంలో పై భాగంలో ఉన్న క్షత్రియులు, పూజారులు లాంటి తరగతుల వారు బ్రిటిష్ వాడిని తన్ని తరిమేయడానికి ప్రజల్ని కూడదీయడానికి బదులు వాడి వ్యాపార అవసరాలు తీర్చడానికి, వాడు నేర్పిన విద్యతో వారికి సేవలు చేయడానికి సిద్ధపడ్డారు. ఆ విధంగా ఐరోపా దేశాలకు వెళ్ళి ఇంగ్లీషు చదువులు చదివి సివిల్ అధికారులుగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత స్ధానాలు నిర్వహించారు. ఎంత ఉన్నత అధికారి అయినా వాళ్ళు చివరికి బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేసినవారే.

కానీ దేశంలో అణచివేతకు గురవుతున్న సాధారణ ప్రజానీకం ఊరుకోలేదు. ముఖ్యంగా రైతులు, వివిధ చేతివృత్తుల వారు తమ ఉత్పత్తులకు మార్కెట్ లేక ఉపాధి కోల్పోవడంతో తిరుగుబాట్లు లేవదీశారు. కొందరు రాజులు కూడా ఈ తిరుగుబాట్లలో పాల్గొన్నారు. 1857 తిరుగుబాటు ఇలాంటిదే. ఈ పరిస్ధితుల్లో బ్రిటిష్ పాలకులు భారత ప్రజల అసంతృప్తిని, తిరుగుబాటును దారికి తెచ్చుకోవడానికి తామే ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. అదే కాంగ్రెస్. భారత ఉన్నత వంశీకుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కాంగ్రెస్ ని ఒక వేదికగా వారు మలిచారు. కాంగ్రెస్ ఏర్పడడంతోనే స్వతంత్రం డిమాండ్ చేయలేదు. హోమ్ రూల్ ఉద్యమం అనీ ఇంకా ఏదో అనీ పరిమిత పాలనాధికారాలను మాత్రమే కోరారు. 1930లో మాత్రమే సంపూర్ణ స్వాతంత్ర్యం అన్న నినాదాన్ని కాంగ్రెస్ ఇచ్చింది.

ఇక్కడి విషయం ఏమిటంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజల్లో నానాటికీ ఉధృతంగా వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను ఒక దారిలో పెట్టే సేఫ్టీ వాల్వ్ గా మాత్రమే కాంగ్రెస్ పని చేసింది తప్ప నిజంగా సంపూర్ణ ఆర్ధిక, రాజకీయ స్వాతంత్రం వారు కోరలేదు. అందుకే 1947 నాటి సంఘటనను కేవలం అధికార మార్పిడిగా కొందరు చెబుతారు.

కాబట్టి మన దేశం పరాయి పాలకుల పాలబడడానికి ప్రధాన కారణం మీరు చెప్పిన క్షాత్ర పరంపర కలిగిన వర్గాలే తప్ప ప్రజలు కాదు. వారు పరాయి పాలనను ప్రజల సహాయంతో ఎదుర్కోవడానికి బదులు తమలో తాము కొట్టుకుని వెన్నుపోట్లు పొడుచుకుని పాలనను తెల్లవాడికి అప్పజెప్పారు. తెల్లవాడి మీద ప్రజలు తిరగబడినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే బ్రిటిష్ వాడికి అండగా నిలిచి ప్రజల ఆగ్రహాన్ని సేఫ్ గా తమ కింద ఆర్గనైజ్ చేసి తెల్లవాడు గౌరవంగా పక్కకు వెళ్ళే వీలు కల్పించారు.

మీరు ‘ముఖ్యంగా ముస్లిం దాడులు’ అన్నారు. కానీ ముస్లిం పాలకులు వారివెంట వచ్చినవారు ఈ దేశంలో కలిసిపోయారే గానీ ఇక్కడి మార్కెట్లను ఆక్రమించుకునే భారీ డిజైన్ తో వారు రాలేదు. అనగా వారు కూడా భారత దేశంలో భాగం అయ్యారు. ఒకరు ఇద్దరు విధ్వంసాలకు పాల్పడినప్పటికీ వారి ప్రధాన లక్ష్యం తాము టార్గెట్ చేసుకున్న ప్రదేశంలోని సంపదలే తప్ప మతం కాదు. అసలు భారత దేశ చరిత్రను హిందు, ముస్లిం, బ్రిటిష్ కాలాలుగా సంకుచిత దృష్టితో విభజించడమే వ్యాపార ప్రయోజనం కోసం బ్రిటిష్ పాలకులు చేసినపని. ప్రజల్లో మత విద్వేషాలు నాటే తప్పుడు చరిత్రను ప్రబోధించడం ద్వారా బ్రిటిష్ పాలకులు తమ దోపిడీని సజావుగా సాగించగలిగారు.

మీ రెండో ప్రశ్నకు వస్తే భారత దేశంలో ప్రజలకుగానీ పాలకులకు గానీ ఇతర దేశాలకు వలస వెళ్ళే అవసరం రాలేదు. దానికి కారణం ఇక్కడి వాతావరణ పరిస్ధితులు, పుష్కలమైన భూ, జల వనరులు. అందుకే ఇక్కడికి బైటి దేశాల నుండి ఎక్కువగా వలసలు జరిగాయి. భారత దేశంలోని అత్యధిక ప్రజానీకం వలస వచ్చినవారే తప్ప స్ధానికులు కాదు. కేవలం అడవుల్లో నివసించే గిరిజన జాతులు మాత్రమే స్ధానిక ప్రజలు. మిగిలినవారంతా మధ్య ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల నుంచి వలస వచ్చినవారే. అందుకే భారత దేశంలోని ప్రజల్లో భౌతిక సారూప్యతలో అనేక వైవిధ్యాలు కనబడతాయి.

భారత దేశానికి వచ్చినవారిలో ఒక్క ఐరోపా దేశాల వారు మాత్రమే దురుద్దేశంతో వచ్చారు. ఇక్కడి సంపదలను కొల్లగొట్టడానికీ, తమ సరుకుల కోసం మార్కెట్లను తమ వశం చేసుకోవడానికి దాడికి వచ్చారు. వివిధ రూపాల్లో ఇప్పటికీ అది కొనసాగుతోంది.

గతం గొప్పతనం గానీ, మతం గొప్పతనం గానీ ప్రజలకు సంబంధం లేనిది. గతంలో బాగా బతికిన వర్గాలే నేడు గతం గొప్పతనాన్ని గుర్తు చేసి లేని ఔన్నత్యాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సంస్కృతులను, ఆచార వ్యవహారాలను, చరిత్రలను ఎక్కువ, తక్కువ గొప్పతనాలుగా వర్గీకరించడం తగని పని. అదొక వృధా ప్రయాస. ఎందుకంటే ఆయా సంస్కృతులన్నీ ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రజల నుండి ఆవిర్భవించినవే. దేని ప్రత్యేకత దానిదే. దేని గొప్పతనం దానిదే. ఆయా సంస్కృతుల లోని ఉన్నత విలువలను కాపాడుకోవడమే నేటి అవసరం. పరాయి సంస్కృతుల ఉనికిని ఉన్నది ఉన్నట్లు గుర్తించడం మనం చేయవలసిన పని. వీలయితే వారి నుండి మంచి ఉంటే నేర్చుకోవాలి. చెడు ఉంటే తిరస్కరించాలి. గొప్పల జోలికి పోవడం వల్ల ఏ ప్రయోజనమూ నెరవేరదు.

13 thoughts on “ప్రశ్న: భారత్ విదేశాలపై దాడి ఎందుకు చేయలేదు?

 1. అంతర్గత రాజకీయ దాడులతో సతమతమయ్యే దేశం విదేశాలపై దాడులుచెయ్యడంలోని అంతరార్ధం ” అనర్ధం”, “ఆర్ధికభారం”. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది తప్ప ప్రయోజనం లేని ఘనకార్యం.

 2. Hi Vishekar, Can you please explain me that your opinion how INC was a safety valve for British? Historians having different opinion for establishing it as safety valve later not, if it is so why it is asked complete independence?

 3. well explained, simply Indian rulers didn’t have unity among them.. the circumstances in Europe in 17th century encouraged at least forced them to search place for their raw material, product market and labour force needs. moreover at the time india is famous for its spices and cotton which attracted the europeans the most. though muslim rules invaded india and conqured they cannot be treated as foreigners they became indians unlike Europeans.

 4. “ఒకరు ఇద్దరు విధ్వంసాలకు పాల్పడినప్పటికీ వారి ప్రధాన లక్ష్యం తాము టార్గెట్ చేసుకున్న ప్రదేశంలోని సంపదలే తప్ప మతం కాదు”
  ఇస్లామిక్ యుద్దాలు జరిగింది మతవ్యాప్తి కోసమే అని అనుకుంటున్నాను. భారతదేశంలో క్రూసేడులు జరగలేదు కానీ ఇస్లామిక్ మతయుద్దాలు జరిగాయి.

 5. @ గతం గొప్పతనం గానీ, మతం గొప్పతనం గానీ ప్రజలకు సంబంధం లేనిది.

  అంతేకదా. ప్రస్తుతం అష్టకష్టాలు పడుతున్న వారికి గతం గొప్పదనంతో వచ్చేదేముంది…ఒరిగేదేముంది. చరిత్ర- గుణపాఠాలు నేర్చుకోవడానికి, ప్రస్తుతాన్ని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడాలి.

  ఇక భారతదేశానికి ఇతర దేశాలపై పూర్తిగా దాడి చేయలేదనడం పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే పల్లవులు థాయిలాండ్, కాంబోడియా తదితర దేశాలపై దాడి చేసి దండెత్తిన ఆనవాళ్లున్నాయి. అందువల్లే అక్కడ అంగ్ కోర్ వాట్ లాంటి హిందు ఆలయాలు ఉన్నాయి. ఇక శ్రీలంక పై అనేక మంది రాజులు దండెత్తారు.
  నౌకాయానం చేయడాన్ని పాపంగా భావించే వారు కాబట్టి….నౌకా దళాలు మన దగ్గర పెద్దగా అభివృద్ధి చెందలేదు. మన నౌకా దళాలు బలహీనమంటే పోర్చుగీసు నుంచి వాస్కోడిగామ మహా ఐతే ఓ వంద మందితో వచ్చి ఉంటాడు. తన నౌకా దళం బలంతో…ఇక్కడ జామోరిన్ సైన్యాన్ని ఓడించాడు. అలా చాలా కాలం అరేబియా సముద్రం… పోర్చుగీసుల చేతిలోనే ఉండిపోయింది. మూడు వైపులు సముద్రం…దాన్ని దాటి విదేశాలకు వెళ్లి దాడి చేసేంత భారీగా సైన్యాన్ని తరలించడం శక్తికి మించిన పని. మిగిలిన ఉత్తరం వైపు హిమాలయాలు….భయంకరమైన చలిని తట్టుకొని దాడి చేసేంత అవసరమూ అప్పుడు లేదు. ఎందుకంటే అవతలి రాజ్యాల్ని జయించినా అవేమీ అంత సంపన్న రాజ్యాలు కావు. అన్నిటికీ మించి మన వాళ్లకు…” పరలోకం గురించి ఆలోచన అధికం తప్ప పరాయి దేశాన్ని దోచుకోవాలనే ఆలోచన లేదు.”

 6. *నౌకాయానం చేయడాన్ని పాపంగా భావించే వారు కాబట్టి….*

  చందు తులసి గారు,
  చిన్నపుడు మాటిచర్ కూడా ఇటువంటి అభిప్రాయం చెప్పాడు. కాని పాఠ్యపుస్తకంలో చదివినట్లు గుర్తులేదు. మీకు తెలిసి ఎవరైనా పుస్తకంలో ప్రస్థావించి ఉంటే, ఆ పుస్తకం వివరాలు తెలియజేయగలరా?

 7. శ్రీరాం గారు. నౌకాయానం చేయడం పాపంగా….భావించడం పందొమ్మిదో శతాబ్దం ప్రారంభం దాకా ఉండేదని నేను చాలా పుస్తకాల్లో చదివినట్లు గుర్తు. మీకు ఆధార సహితంగా ఏ పుస్తకంలో ప్రస్తావించింది వెతికి చెబుతాను.
  బారిష్టర్ పార్వతీశం నవలలో కూడా….ఈ ప్రస్తావన వస్తుంది చూడండి. నా ఉద్దేశం ప్రకారం జన బాహుళ్యంలో ఉన్నదే రచయిత మొక్కపాటి రాసి ఉంటారు. ఇక దీని గురించి వివరంగా ఏ పుస్తకంలో రాసింది మీకు తప్పకుండా చెబుతాను.

 8. ‘సముద్ర ప్రయాణం పాపం’ అన్న హిందువుల మూఢ నమ్మకం చిన్నప్పటి నుండీ చదువుతున్నదే. అనేక కధలు, నవలలు, చరిత్ర పుస్తకాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ఇండియాకు సముద్ర దారి కనిపెట్టడానికి బయలుదేరిన ఐరోపా వ్యాపారస్ధులు కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా రాశారు.

  వికీ పీడియాలో ఈ అంశం పైన ఒక ఆర్టికల్ ఉంది. దానికి లింక్ ఇది:

  http://en.wikipedia.org/wiki/Kala_pani_%28taboo%29

 9. వుప్పల లక్ష్మణ రావు గారి బతుకు పుస్తకం చూడండి. బ్రిటీషు వారితో సమన్వయం కుది రాక మనభారతీయ బ్రహ్మనులు భారిష్టర్లు, ప్రభుత్వాదికారులకు కావలిసి ఐ సి ఎస్‌ లు, ఉతదితర కోర్సులు చదవాటానికి ఇంగ్లాండ్‌ వెల్లే వారు. వెల్లి వచ్చిన తరువాత సముధ్రయాణ దోషం పోవాటానికి కావలిసిన ప్రక్షాళనలు చేసు కొనే వారు. మొదట ఈలాంటి వారిని వెలి వెసినా క్రమేనా ప్రక్షాళన స్థాయికి వచ్చి ఆ తరువాత మరుగున పడి పోయాయి. లక్ష్మణ రావు గారిని మొట్టమొదటి విదేశ స్త్ర్రీని పెళ్లి చేసిన వారిగా కూడా చెప్పుకోవచ్చునేమో!

 10. శేఖర్‌ గారు,
  మీరిచ్చిన ఈ వివరణ గానీ, సరళీకరణ గురించి ఇచ్చిన వివరణ గాని చాలా బాగున్నాయి.ఎన్నో పుస్తకాలు చదివితే గాని ఈ సారాన్ని తేలేము. ఇది విధ్యార్దుల పట్ల కామదేనువుగానే భావించాలి. నేను మొట్ట మొదట ఇంత చిక్కగా ఉండే వ్యాసాలని ఫ్రొ. హరగోపాల్‌ రాయగా చూశాను. ఆయనరాజ్యాంగ సారాన్ని ఒక్క న్యూస్‌ పేపర్‌ పేజిలో వచ్చేటట్లు – ఆంద్ర జ్యోతి అనుకుంటాను -రాశారు. నేను ఆ వ్యాసాన్ని కటింగ్‌ చేసుకొని దాచుకొని పదే పదే చదువుకొనే వాడిని.

 11. ‘ఒకప్పుడు విద్యార్జనకై చెన్నపట్నము వెళ్ళినవారికీ తగు ప్రాయశ్చిత్తములుండెడివి. నేడు ఉద్యోగార్ధము విదేశములు వెళ్ళినవారికి గూడా ఎటువంటి ప్రాయశ్చిత్త శిక్షలూ లేకుండబోయినవి’. అంటారు కందుకూరివారు ఒకానొక పుస్తకంలో. ఇది తొమ్మిదో తరగతిలో మాకు పాఠంగా ఉండింది కూడా. అంతదాకా ఎందుకులెండీ, ప్రస్తుతకాలంలోనే హిందూమత ప్రవచనాలు చేసే చాగంటీగారు కూడా తనకి సముద్రం దాటడం ఇష్టంలేదనీ, అది దోషమనీ చెబుతుంటారు. Having said that, వాస్కో డ గామాకి భారతదేశం వరకూ దారిచూపించినది ఒక గుజరాతీ వర్తకుడన్న విషయాన్ని చదివాను. బహుశా ఆపాటికే ఈ ఛాదస్తపు పట్టింపులు సడలడం మొదలయ్యుండాలి.

  భారతదేశం అన్నభావన చాలా కాలంగా ఉన్నదేగానీ, వేర్వేరుకాలాల్లో ఆభావనను కట్టుబడిన భూభాగం వేరు. పురాణ గ్రంధాల్లో భారతదేశం అన్నమాటకి దాదాపు దక్షిణాసియా మరియు కొంత యూరోపు అన్న అర్ధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మధ్యయుగాల్లో ఆ భావన లీలామాత్రంగానే ఉండి రాజ్యాధీశులందరూ తమతమ రాజ్యాలకోసం పోరాడారు. కొందరు దూరదృష్టితో పర్షియనులకు వ్యతిరేకంగా కూడిపోరాడినా అది కేవలం వేరేమతంవారు అన్నభావతోటీ, వారి కౄరత్వాన్ని వినిఉండబట్టేకానీ, భారతదేశమన్న భావనతోకాదు. ఇదే భావనతో ‘భారతదేశ’పు రాజులను పురుషోత్తముడూ అలెక్జాండర్‌ను నిలువరించడానికి సైన్యాలను కూడగట్టడం, అంభి దాన్ని కాదని అలెక్జాండర్‌తో పొత్తుకూడటం మనం చదువుకున్నవేకదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s