‘పడమటి గాలి’ ఆరోగ్యానికి మంచిది కాదని వింటుంటాం. ‘అబ్బ! పడమటిగాలి మొదలయిందిరా’ అని పెద్దవాళ్ళు అనుకుంటుండగా చిన్నప్పుడు విని ఉన్నాం. అది ప్రకృతికి సంబంధించిన వ్యవహారం. సాంస్కృతికంగా పశ్చిమ దేశాల సంస్కృతి ఎంతటి కల్లోలాలను సృష్టిస్తున్నదో ‘పడమటి గాలి’ నాటకం ద్వారా రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు శక్తివంతంగా ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇ.యు వైపుకి ఉక్రెయిన్ జరిగిన ఫలితంగా ఇప్పుడు అదే పడమటి గాలి, ఆ దేశాన్ని చుట్టుముడుతోంది. ప్రజల ఆర్ధిక ఆరోగ్యానికి అదెంత ప్రమాదకరమో నూతన ప్రభుత్వం తన మొదటి చర్యలోనే తేల్చి చెప్పింది.
బలవంతంగా అధికారం లాక్కున్న నూతన కూటమి ప్రభుత్వం ఉక్రెయినియన్ల పెన్షన్లను సగానికి తగ్గించడానికి పధకం రచిస్తోంది. ఖజానా ఖాళీ అయిందన్న పేరుతో, పొదుపు కార్యక్రమం అని చెబుతూ, అది ఈ చర్యకు ఒడిగొడుతోంది. దేశం ఆర్ధికంగా చితికిపోయిందని, బైటపడాలంటే ఐ.ఎం.ఎఫ్ అప్పు తప్పనిసరి అని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఉక్రెయిన్ ఋణ చెల్లింపుల సంక్షోభం నుండి బైటపడాలన్నా ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర పొదుపు చర్యలు అమలు చేయాలనీ, అందులో భాగంగా పెన్షన్లు 50 శాతం తగ్గించక తప్పదని ప్రభుత్వం నమ్మబలుకుతోంది.
పొదుపు చర్యలలో భాగంగా ఉక్రెయిన్ ప్రజలకు ఇస్తున్న సామాజిక చెల్లింపులు రద్దు చేయడం ప్రభుత్వ మొదటి ప్రాధామ్యం అని నూతన ప్రభుత్వం తయారు చేసిన పత్రం ద్వారా తెలుస్తోందని కొమ్మర్ సాంట్ ఉక్రెయిన్ అనే పత్రికను ఉటంకిస్తూ రష్యా టుడే తెలిపింది. ఋణ సంక్షోభంలో ఇరుక్కున్న యూరో జోన్ దేశాలకు సైతం ఐ.ఎం.ఎఫ్+ఇ.యు ల కూటమి ఇవే షరతులను అమలు చేసేలా ఒత్తిడి చేసింది. తద్వారా కంపెనీలు, పాలకవర్గాల సంక్షోభాన్ని ప్రజల సంక్షోభంగా మార్చడంలో అవి ఇతోధికంగా కృషి చేశాయి. ఉక్రెయిన్, ఇ.యు వైపు మొగ్గిన ఫలితంగా పొదుపు పేరుతో పడమటి గాలి ఇప్పుడు ఉక్రెయిన్ ను చుట్టుముడుతోంది.
“బడ్జెట్ వ్యయాన్ని కనీస స్ధాయికి తగ్గించడానికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఒక పధకాన్ని రచించింది. దీని ప్రకారం బడ్జెట్ కోతలను మార్చి నెలాఖరు లోపు అమలులోకి రావాల్సి ఉంటుంది. ఈ లక్ష్యం కోసం, ముఖ్యంగా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాలని, పన్ను పధకాలను తొలగించాలని, సామాజిక లబ్ది లను బాగా కోత పెట్టడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఉదాహరణకు వర్కింగ్ పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో 50 శాతం కోత పెట్టాలనీ ప్రభుత్వం నిర్ణయించింది” అని కొమ్మర్ సాంట్ ఉక్రెయిన్ పత్రిక నివేదించిందని ఆర్.టి తెలిపింది.
ఉక్రెయిన్ ప్రభుత్వ సామాజిక విధాన మంత్రిత్వ శాఖ డిసెంబర్ 1, 2013 తేదీన విడుదల చేసిన ఒక పత్రం ప్రకారం ఆ దేశంలో సగటు పెన్షన్ 160 డాలర్లు. ఇప్పుడు పశ్చిమ దేశాల కుట్రల ద్వారా అధికారంలోకి వచ్చిన నూతన కూటమి ప్రభుత్వం ఈ సగటు 80 డాలర్లకు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అధికారంలోకి వచ్చీ రాగానే ఖజానా ఖాళీగా ఉందని చెప్పిన కొత్త ప్రభుత్వం ఆ పేరుతో ప్రజలపై దాడి ప్రారంభించింది.
ఋణ చెల్లింపులు ఎగవేయకుండా చూడడానికి సాధ్యమైనంత గట్టిగా కృషి చేస్తామని చెబుతున్న నూతన ప్రధాని ఆర్సెని యట్సెన్యుక్ తమ ప్రజా వ్యతిరేక చర్యలకు తగిన పునాదిని ముందే సిద్ధం చేసుకుంటున్నాడు. ఋణ చెల్లింపులు ఎగవేయకుండా ఉండాలంటే తద్వారా ఋణ సంక్షోభంలోకి జారకుండా ఉండాలంటే పెన్షన్లు, ఇతర భృతి చెల్లింపులు తగ్గించక తప్పదని ఆయన ప్రజలకు చెప్పనున్నాడు. అదే నోటితో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల నుండి ఆర్ధిక ప్యాకేజీ త్వరలో పొందనున్నట్లు చెప్పాడు. యూరప్ ఋణ సంక్షోభం సాకు చూపి యూరో జోన్ దేశాలలో అమలు చేస్తున్న అత్యంత వినాశకర పొదుపు విధానాలు, వ్యవస్ధాగత సర్దుబాటు విధానాలు ఇప్పుడిక ఉక్రెయిన్ ప్రజల దుంప తెంచనున్నాయి.
ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లకు కావలసిన షరతులను అమలు చేయడానికి తగిన హామీల పత్రాన్ని కొత్త ప్రభుత్వం రికార్డు సమయంలో తయారు చేసి పంపుతోంది. ఎంత వేగంగా తయారు చేశారో అంతే వేగంగా ఫిబ్రవరి 27నే పార్లమెంటులో ఆమోదించేశారు. అనంతరం ఆర్ధికాభివృద్ధి శాఖ, వాణిజ్య శాఖలు ఆమోదముద్ర వేయడం కూడా మార్చి 3తో పూర్తయిపోయింది. ఇపుడు ఉన్న పార్లమెంటులో అనేక మంది సభ్యులు, ముఖ్యంగా తగ అధికార పార్టీకి చెందిన సభ్యులు హాజరు కావడం లేదు. కానీ సభలో వారిదే మెజారిటీ. అనగా మెజారిటీ సభ్యులు లేకుండానే అత్యంత ముఖ్యమైన చట్టాలను ‘మమ’ అనిపించుకుని ఆమోదించేస్తున్నారు. ఇవి అంతిమంగా ఉక్రెయిన్ ప్రజల మెడలకు ఉరి తాడుగా చుట్టుకోవడం ఖాయం.
ఐ.ఎం.ఎఫ్, ఇ.యు, యూరోపియన్ కమిషన్ లు ప్రతిపాదించిన విషమ షరతుల ఒప్పందానికి ఒప్పుకునే పనైతే 11 బిలియన్ యూరోల రుణం ఇవ్వడానికి సిద్ధం అని ఇ.సి అధ్యక్షుడు జోస్ బరోసో ప్రకటించాడు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల అప్పుల షరతులు ఋణ గ్రహీత దేశాల ఆర్ధిక వ్యవస్ధలను పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఉత్పత్తి చేసే సరుకులకు వినియోగదారీ మార్కెట్లుగా మార్చి వేస్తాయి. అనగా ఋణ గ్రహీత దేశాల ఉత్పత్తి వ్యవస్ధలను సర్వ నాశనం చేస్తాయి. అందువల్ల ఉద్యోగాలు, వేతనాలు, సదుపాయాలు అన్నీ పరాధీనం అవుతాయి. దేశీయ ఉత్పత్తి వ్యవస్ధను కోల్పోతే దేశం భవిష్యత్తు కుక్కలు చింపిన విస్తరిగా మిగులుతుంది. ఐ.ఎం.ఎఫ్, ఇ.యు ల షరతుల వల్ల ఉక్రెయిన్ ప్రజలకు గ్యాస్ ధరలు పెరగడంతో పాటు వేతనాలు స్తంభనకు గురవుతాయి. బడ్జెట్ కోతలు అంతిమంగా ప్రజల కొనుగోలు శక్తిని కోసేస్తాయి.
2014 సం.కి గానూ 6.8 నుండి 8.4 బిలియన్ డాలర్ల వరకు బడ్జెట్ కోతలు విధిస్తామని ఇప్పటికే కీవ్ ప్రభుత్వం ప్రకటించింది. అనగా ఈ మేర ప్రజల జేబులు ఖాళీ అవుతాయి. రోజు కూలీ తీసుకుని కీవ్ వీధుల్లో విధ్వంసం సృష్టించిన అమాయక ప్రజానీకం కళ్ళు తెరిచేలోపు జరగవలసింది జరిగిపోయి ఉంటుంది.

శేఖర్ గారు,
అంతర్జాతీయ వార్తలు వీలైనపుడల్లా చదువుతూంటాను. ఉక్రెయిన్ గురించి ట్రాక్ చేయటంలేదు. అరబ్ దేశాలు నిరంతరం మతం పేరుతో సున్ని, షియా వహాబి విభేదాలతో కొట్టుకొని చస్తూంటారు. మరి అమెరికా,యురోప్ పశ్చిమదేశాల వారిని చూస్తే మతపిచ్చి పైకి లేకపోయినప్పటికి, యుద్ద పిచ్చి లేక పిపాస విపరీతంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఎమిటి? ఎప్పుడు చూసిన వారు పక్కదేశాన్ని పడల్గొట్టాలని చూస్తారెందుకు అనిపిస్తుంది. భారత ఉపఖండంలో జనాభాఎక్కువ,రిసోర్సేస్ తక్కువగా ఉన్నా మనదేశాలు ఆదేశాలతో పోలిస్తే శాంతియుతంగా నే మెలుగుతున్నట్లు అర్థమౌతుంది. యురోప్ దేశాల సంక్షోభం గురించి పెట్టుబడి/కార్పోరేట్ కోణంలో కాకుండా వేరే కోణంలో, మీరు ఇప్పటి వరకు గమనించినది ఎదైనా విషయముంటె అభిప్రాయం రాసేది.