ఉక్రెయిన్ ఆందోళనలకు సంబంధించి ఓ సంచలన నిజం వెలుగు చూసింది. ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం కీవ్ వీధుల్లో చెలరేగిన హత్యాకాండ అనంతరం బలవంతంగా కూల్చివేయబడిన సంగతి తెలిసిందే. రష్యా అనుకూల అధ్యక్షుడుగా పశ్చిమ దేశాలు చెప్పే విక్టర్ యనుకోవిచ్ ఈ హత్యాకాండ జరిపించాడని పశ్చిమ దేశాలు, పత్రికలు ఆరోపించాయి. భవనాలపైన ఉన్న స్నైపర్లు ఆందోళనకారులపై కాల్పులు జరిపారని స్నైపర్లను నియోగించింది అధ్యక్షుడే అని అవి ఆరోపించాయి.
అయితే 90 మందికి పైగా చనిపోయిన హత్యాకాండకు అసలు బాధ్యులు యనుకోవిచ్ కాదని ఆయన నుండి బలవంతంగా అధికారం లాక్కున్న కొత్త ప్రభుత్వమే స్నైపర్లను నియోగించి అటు ఆందోళనకారులను, ఇటు పోలీసులను ఇద్దరినీ చంపించిందని లీక్ అయిన ఒక ఫోన్ సంభాషణ ద్వారా వెల్లడి అయింది. ఈ ఫోన్ సంభాషణ యూరోపియన్ యూనియన్ విదేశాంగ శాఖ అధిపతి కేధరీన్ యాష్టన్, ఎస్తోనియా విదేశీ మంత్రి ఉర్మస్ పయట్ ల మధ్య జరిగింది. ఈ సంభాషణను ఉర్మస్ పయట్ నిర్ధారించారు కూడా. ఈ సంభాషణ ఇలా సాగింది.
ఎస్తోనియా విదేశీ మంత్రి పయట్: స్నైపర్ల వెనుక ఉన్నది యనుకోవిచ్ కాదని, కొత్తగా అధికారం చేపట్టిన నూతన కూటమి వారే వారి వెనుక ఉన్నారన్న అవగాహన ఇంకా ఇంకా బలపడుతోంది.
ఇ.యు విదేశీ వ్యవహారాల శాఖ అధిపతి (Foreign Affairs Chief) కేధరిన్ యాష్టన్: దీనిపై విచారణ జరపాలని నేను భావిస్తున్నాను. ఐ మీన్, ఇది నాకు అర్ధం కాకుండా ఉంది. ఇంత ఘోరమా (Gosh)!
(ఫిబ్రవరి 25 తేదీన ఎస్తోనియా విదేశీ మంత్రి కీవ్ సందర్శించాడు. ఇ.యు అనుకూల ఆందోళనకారుల భీభత్సకాండ ఉచ్ఛ దశలో ఉన్న రోజులవి. కీవ్ సందర్శించిన అనంతరం కేధరిన్ కి ఫోన్ చేసిన పయట్ ఈ సంభాషణ జరిపాడు. ఆందోళనకారులను, పోలీసులను ఇద్దరినీ ఒకే గ్రూపు స్నైపర్లు కాల్చారని పయట్ ఈ సందర్భంగా చెప్పాడు. దానికి మద్దతుగా డాక్టర్లు చెప్పిన సాక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారు.)
పయట్: రెండోది, మరింత చింతించవలసిన విషయం, చనిపోయినవారిలో పోలీసులు, ఆందోళనకారులు ఇద్దరూ ఉన్నారు. వీధుల్లోని ఆందోళనకారులను, పోలీసులు ఇద్దరినీ ఒకే స్నైపర్లు చంపారని ఓల్గా బొగోమొలెట్స్ (ఉక్రెయిన్ డాక్టర్, పాటలు కూడా రాస్తారీమె) చెప్పారు. సాక్ష్యాలన్నీ ఈ సంగతినే రుజువు చేస్తున్నాయని ఆమె చెప్పారు. ఇరువైపులా టార్గెట్ చేసుకుని స్నైపర్లు కాల్పులు జరిపారు.
కేధరిన్: అవునా… అది చాలా భయంకరం!
పయట్: ఆమె నాకు కొన్ని ఫోటోలు కూడా చూపించారు. ఒక మెడికల్ డాక్టర్ గా ఒకే చేతి వ్రాత అనీ, ఒకే తరహా బులెట్ లనీ తాను చెప్పగలనని తెలిపారు. ఇంకా ఘోరం ఏమిటంటే (అధికారంలోకి వచ్చిన) ఈ కొత్త కూటమి నిజంగా ఏం జరిగిందన్న దానిపైన విచారణ జరిపించడానికి సిద్ధంగా లేరు… ఈ కొత్త ప్రభుత్వం ప్రారంభంలోనే పరువు పోగొట్టుకుంది.
మైదాన్ (కీవ్ లోని ఇండిపెండెంట్ స్క్వేర్) నాయకులను ఉక్రెయిన్ ప్రజలెవ్వరూ విశ్వసించడం లేదని ఎస్తోనియా విదేశీ మంత్రి కేధరిన్ తో చెప్పడం విశేషం. కొత్త అధికార కూటమి నాయకులందరూ ఏదో విధంగా మురికి గతం కలిగి ఉన్నవారేనని ఆయన అవతలి వ్యక్తికి తెలిపాడు. కేధరిన్, పయట్ ల సంభాషణను ఇంటర్నెట్ కు కూడా అప్ లోడ్ చేశారు.
–
–
పదవీచ్యుతుడయిన అధ్యక్షుడు యనుకోవిచ్ కు విధేయులైన ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ పోలీసులు కేధరిన్, పయట్ ల ఫోన్ సంభాషణను హ్యాకింగ్ చేసి రికార్డు చేశారని రష్యా టుడే తెలిపింది. ఇంటర్నెట్ కు సదరు సంభాషణను అప్ లోడ్ చేసింది కూడా వారే అని సమాచారం.
ఇ.యు, అమెరికా అధికారుల మధ్యవర్తిత్వంలో ఆందోళన చేసిన ప్రతిపక్షాలకు, యనుకోవిచ్ కు ఒప్పందం కుదిరినప్పటికీ దానిని ఉల్లంఘిస్తూ ప్రతిపక్ష కూటమి పైన వర్ణించిన దురాగతానికి పాల్పడ్డారు. ఇరు పక్షాలపైకి కాల్పులు జరిపి హత్య చేయడం ద్వారా ఇరు పక్షాలు అవతలివారే కాల్పులు జరిపారని భావించేలా చేయడం కూటమి లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రపంచానికి మాత్రం పశ్చిమ దేశాలు అధ్యక్షుడు యనుకోవిచ్ కాల్పులు జరిపించాడని ఆరోపించాయి.
(Photos: rt.com – కింద ఫొటోల్లో మిలట్రీ చొక్కాల్లో కనిపిస్తున్నది ఆందోళనకారులే. నూతనంగా అధికారం చేపట్టిన కూటమికి వారు మద్దతుదారులు. వారిని కూడా స్నైపర్లచేత చంపించి నెపాన్ని అధ్యక్షుడు యనుకోవిచ్ పైకి నెట్టారు. ఇలాంటి వాటిని ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటారు. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్లకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు పేరెన్నిక గన్నవి.)
ఇప్పుడు పశ్చిమ దేశాల అనుకూల ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి అమెరికా, ఇ.యు లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యాకి వ్యతిరేకంగా బెదిరింపులకు కూడా దిగుతున్నాయి. రష్యాపై ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధిస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నేతలు పలుమార్లు ఇప్పటికే బెదిరింపులు సాగించారు. ఈ బెదిరింపుల్లో బారక్ ఒబామా స్వయంగా పాలు పంచుకున్నారు.
ఎస్తోనియా విదేశీ మంత్రి చెప్పినట్లుగా అధికారం లాక్కున్న నూతన కూటమి నాయకులు ఉక్రెయిన్ ప్రజల్లో ఎన్నడో విశ్వాసం కోల్పోయారు. వారి అవినీతిని తీవ్రంగా అసహ్యించుకుని యనుకోవిచ్ ను అధ్యక్షుడిగా గెలిపించారు. కానీ ఆయన ఇ.యు లో చేరడాన్ని వాయిదా వేయడంతో ఉక్రెయిన్ ను రష్యావైపు తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో అత్యంత హీనమైన రీతిలో అధికారం నుండి కూలదోశారు.
స్నైపర్లను వినియోగించి ఆందోళనకారులను చంపేయడం, ఆ తర్వాత ఆ నెపాన్ని తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వంపైకి నెట్టడం పశ్చిమ దేశాలకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. యనుకోవిచ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు రెచ్చగొట్టింది వారే. ఇ.యు లో చేరడాన్ని వాయిదా వేసిన మరుసటిరోజు నుంచే ఆందోళనలు మొదలు కావడం, ఆందోళనకారులను ఉద్దేశిస్తూ అమెరికా సెనేటర్లు, ఇ.యు నాయకులు ప్రసంగాలు చేసి వెళ్ళడం బట్టి వారికి మొదటి నుండి ఆదేశాలు ఇస్తున్నది అమెరికా, ఇ.యులే అని స్పష్టం అవుతుంది. స్నైపర్ల కాల్పులకు, ఆందోళనకారులు, పోలీసుల మరణాలకు కారకులు కూడా వారే అనడంలో సందేహం అనవసరం.



