లాలూ కాంగ్రెస్ సీట్ల తూకం -కార్టూన్


బీహార్ లో కొనసాగుతున్న రాజకీయాలు భారత దేశంలోని మురికి రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. బి.జె.పి మతతత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పే రామ్ విలాస్ పాశ్వాన్ మరోసారి ఆ పార్టీతోనే సీట్ల సర్దుబాటుకు సిద్ధపడగా ఘన చరిత్ర కలిగిన జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ కాసిన్ని సీట్ల కోసం అవినీతికి శిక్ష పడిన లాలూతో బేరాలు సాగిస్తోంది.

లాలూ-కాంగ్రెస్ కూటమితో జత కలుస్తాడని భావించిన పాశ్వాన్ తగినన్ని సీట్లు దక్కకపోవడంతో ‘మతతత్వ’ కార్డు పక్కకు విసిరేసి ఎక్కువ సీట్లు ఆఫర్ చేసిన ఎన్.డి.ఏ తో ఎంచక్కా జత కట్టేశారు. అదేమిటని ప్రశ్నిస్తే తాను ‘గతం’లో జీవించదలుచుకోలేదని సూత్రం వల్లిస్తున్నారు. నిజం ఏమిటంటే ఆయన గతం వర్తమానానికి అతీతం ఏమీ కాదు. పత్రికలు కూడా ‘మళ్ళీ ఎన్.డి.ఏ గూటికి పాశ్వాన్’ అన్నాయే గానీ ఆయన సూత్రాలను ప్రశ్నించే బృహత్కార్యానికి పెద్దగా పోలేదు.

కాంగ్రెస్, లాలూల సీట్ల దోబూచులాట ఇంకా ముగియకపోవడం ఒక వినోద కార్యక్రమం. జాతీయ పార్టీ సీట్ల కోసం ఓ ప్రాంతీయ పార్టీని దేబిరించడం ఒక విచిత్రం అయితే ఆ ప్రాంతీయ పార్టీ అధినేత అవినీతి కేసులో జైలు శిక్ష పడినా ఆయనకు సానుభూతితో కూడిన ప్రజాదరణ పెరుగుతున్నట్లు పత్రికలు చెప్పడం మరో విచిత్రం. ఎన్నికల వేళ ఇలాంటి చిత్రాలు మరెన్ని చూడాల్సి ఉంటుందో!

లాలూ ఎన్ని సీట్లు ఆఫర్ చేసినా కాంగ్రెస్ కు సరితూగడం లేదని కార్టూన్ సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. 11 సీట్లు ఇవ్వడానికి లాలూ సిద్ధపడగా కాంగ్రెస్ ఇంకా ఎక్కువ కావాలంటోంది. లాలూపై పైచేయి సాధించడానికా అన్నట్లు బీహార్ లో తమకు ఇంకా అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత చాకో చెప్పడంతో బీహార్ రాజకీయాల స్వరూపం మరింత మురికిగా మారినట్లయింది. నితీష్ కుమార్ జె.డి(యు) తో తెరవెనుక మంతనాలు జరుగుతున్నాయని కూడా కాంగ్రెస్ లీక్ చేసింది. దీనితో కాంగ్రెస్ తో పొత్తు సమస్యే లేదని జె.డి(యు) చెప్పుకోవాల్సి వచ్చింది.  

Lalu-Congress

వ్యాఖ్యానించండి