
Pro-Russian protesters with the Russian Presidential flag take part in a rally in central Donetsk March 1, 2014. REUTERS/Stringer
పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ప్రజా ప్రభుత్వాన్ని కుట్ర చేసి కూల్చివేసిన నేపధ్యంలో ఉక్రెయిన్ రష్యా, పశ్చిమ రాజ్యాల ప్రభావాల మధ్య నిలువునా చీలుతున్న భయాలు తలెత్తాయి. రష్యా అనుకూల ప్రజలు ఎక్కువగా నివసించే తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలో పలు పట్టణాలలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని రష్యా జెండాలను ఎగురవేస్తున్నారు. కొన్ని చోట్ల తమ ప్రాంత భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ‘ప్రజాభిప్రాయ సేకరణ’ జరపాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తుండగా ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యా మద్దతుతోనే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది.
తూర్పు ఉక్రెయిన్ నగరం దోనేట్స్క్ నగరాన్ని సోమవారం రష్యా అనుకూల ఆందోళనకారులు ఆక్రమించుకున్నారు. తమ ప్రాంత భవితవ్యాన్ని నిర్ణయించే ‘రిఫరెండం’ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవాలని ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దానితో త్వరలో దోనేట్స్క్ లో రిఫరెండం నిర్వహించడానికి స్ధానిక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిఫరెండంలో ప్రజల్ని ఏమి అడగనున్నదీ ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది.
తూర్పు ఉక్రెయిన్, దక్షిణ ఉక్రెయిన్ లలో దాదాపు అన్నీ నగరాల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనల్లో రష్యాకు అనుకూలంగా నినాదాలు ఇస్తూ రష్యా జాతీయ జెండాలు ఎగురవేయడం పరిపాటిగా మారింది. నిన్నటివరకూ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పశ్చిమ దేశాలకు అనుకూలంగా, ముఖ్యంగా ఇ.యు లో చేరికకు అనుకూలంగా హింసాత్మక ఆందోళనలను రెచ్చగొట్టిన ఇ.యు, అమెరికాలు ఇప్పుడు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలో చెలరేగుతున్న ఆందోళనలకు రష్యా ప్రోత్సాహం ఇస్తున్నదంటూ ఆరోపించడం ఓ కొసమెరుపు. ఉక్రెయిన్ పై దాడి చేసి ఆక్రమించడానికి ముందస్తుగా ఈ ఆందోళనలను మాస్కో రెచ్చగొట్టిందని కుట్ర ద్వారా అధికారం చేపట్టిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
దోనేట్స్క్ లో ఆందోళనకారులు ప్రభుత్వం ప్రధాన కార్యాలయంపై దాడి చేసి మొదటి, రెండవ అంతస్ధులను ఆక్రమించారని ఆ పై అంతస్ధులకు తాళాలు వేసి ఉండడంతో మిగిలిన 9 అంతస్ధుల లోకి ప్రవేశించలేకపోయారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “పుతిన్, వెంటనే రా” అంటూ ఆందోళనకారులు పెద్ద పెట్టున నినాదాలు ఇస్తున్నారని, పోలీసులను నెట్టుకుంటూ, తొక్కుకుంటూ వెళ్ళి భవనాన్ని ఆక్రమించారని రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ తెలిపారు. మునిసిపల్ ఉద్యోగులను, చట్ట సభల సభ్యులను బైటికి వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. కింది అంతస్ధులను వారు ఆక్రమించడంతో పై అంతస్ధుల్లో ఉన్న విలేఖరులు చిక్కుకుపోయారని, వారిని ఆ తర్వాత పోలీసులు క్షేమంగా కిందికి దించారని తెలుస్తోంది. 11 అంతస్ధుల భవనంపై ఉన్న ఉక్రెయిన్ జెండాను అవనతం చేసిన ఆందోళనకారులు రష్యా జెండాను ఎగరవేశారు.
భవనం లోపలే ఉండిపోయిన చట్ట సభల సభ్యులు దోనెన్ట్స్క్ ప్రజల డిమాండ్లకు మద్దతుగా ఒక డిక్లరేషన్ ను ఆమోదించారు. “దోనెట్క్స్ ప్రాంత ప్రజల చొరవకు మద్దతు ఇస్తున్నాం. ప్రదర్శనల్లో వారు చేసిన డిమాండ్లకు సంఘీభావం ప్రకటిస్తున్నాం” అని తెలిపే తీర్మానాన్ని 98-3 ఓట్ల తేడాతో వారు ఆమోదించారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రాంతీయ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచారు. ఉక్రెయిన్ లో హింసాత్మక కుట్రతో అధికారంలోకి వచ్చిన పశ్చిమ అనుకూల ప్రభుత్వాన్ని ‘చట్ట విరుద్ధమైనది”గా ప్రకటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ గురించి డిక్లరేషన్ ఏమీ వ్యాఖ్యానించలేదు. భద్రతా బలగాలను ప్రాంతీయ ప్రభుత్వం ఆధీనంలో ఉంచాలని, ఉక్రెయిన్ ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు నిలిపేయాలని కూడా ప్రదర్శకులు డిమాండ్ చేశారు. వీటిని ప్రాంతీయ ప్రభుత్వం అమలు చేసేదీ లేనిదీ తెలియరాలేదు.
ప్రదర్శకులు చేసిన మరో ముఖ్యమైన డిమాండు ‘రిఫరెండం నిర్వహించడం.’ ఈ డిమాండ్ కు డిక్లరేషన్ ఆమోదం తెలిపింది. అయితే రిఫరెండంలో ఓటింగుకు పెట్టే తీర్మానంలో ఏమి కోరేది ఇంకా నిర్ణయించలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం సార్వభౌమ ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ మార్చి 30 తేదీన రిఫరెండం నిర్వహించాలన్నది ఆందోళనకారుల డిమాండ్. ఇలాంటి రిఫరెండం జరిగితే అది చట్ట విరుద్ధం అవుతుందని ఉక్రెయిన్ లో అమెరికా, ఇ.యు లు ప్రతిష్టించిన నూతన ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజల శాంతి భధ్రతలను కాపాడే బాధ్యత ప్రజా వాలంటీర్లకు అప్పగించాలని, రష్యాకు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి మధ్య ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాలను గుర్తిస్తున్నామని ప్రాంతీయ పార్లమెంటు తీర్మానం (డిక్లరేషన్) పేర్కొంది.
రష్యా బలగాలు ఇప్పటికే క్రిమియాను అదుపులోకి తెచ్చుకున్నాయి. అక్కడ మార్చి 30 తేదీన రిఫరెండం జరుగుతోంది. స్వతంత్ర దేశంగా గానీ లేదా మరిన్ని స్వతంత్ర విధానాలు అవలంబించే అధికారాలను పొందే విధంగా గానీ ఈ రిఫరెండంలో ప్రజలు నిర్ణయించనున్నారు. 1954లో నికిటా కృశ్చెవ్ అధికారంలో ఉండగా క్రిమియాను రష్యా ఉక్రెయిన్ కు అప్పగించింది. అప్పట్లో రష్యా, ఉక్రెయిన్ లు రెండూ సోవియట్ రష్యా లో భాగమే కావడం మూలాన ఈ అప్పగింత కేవలం లాంఛన ప్రాయమే. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ లు రెండు వేరు వేరు దేశాలు. కనుక సహజంగానే క్రిమియా రిఫరెండం ఓ సమస్యగా ఉక్రెయిన్ భావిస్తోంది.
క్రిమియాతోనే సరిపెట్టుకోకుండా ఉక్రెయిన్ లోని తూర్పు దక్షిణ ప్రాంతాలను కూడా రష్యా బలగాలు ఆక్రమించవచ్చన్న వార్తలను పశ్చిమ పత్రికలు ప్రచారంలో పెట్టాయి. కానీ రష్యా నుండి ఆవైపుగా చర్యలు లేవు. ఉక్రెయిన్, రష్యా సరిహద్దు వద్ద రష్యా బలగాలు మిలట్రీ విన్యాసాలు నిర్వహిస్తుండడాన్ని తమ వాదనకు మద్దతుకు అమెరికా, ఇ.యు లు చూపుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం దాడి చేస్తామని గానీ, చేయబోమని గానీ చెప్పలేదు. ఉక్రెయిన్ లో రష్యన్ల ప్రయోజనాలను కాపాడే హక్కు తమ ఉన్నదని ఆయన ప్రకటించాడు. ఇదే విషయాన్ని ఆయన అమెరికా అధ్యక్షుడు ఒబామాకు కూడా (ఫోన్ లో) స్పష్టం చేశారు.
తూర్పు ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశ్యంతోనే రష్యా దోనెట్స్క్ ప్రాంతంలో ఆందోళనలను రెచ్చగొట్టిందని ఉక్రెయిన్ నూతన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇదే కావడమే ఉక్రెయిన్ హైరానాకు కారణం. బొగ్గు, ఉక్కు, రసాయనాలు, టర్బైన్లు తదితర ఉత్పత్తులు ఇక్కడే ఎక్కువగా సాగుతున్నాయి. అణు కర్మాగారాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అదీ కాక పశ్చిమ దేశాలు పదవీచ్యుతుడిని చేసిన విక్టర్ యనుకోవిచ్ ఈ ప్రాంతం వాడే. ఈ ప్రాంతంలోని ఉక్రెయిన్ జాతీయులు కూడా మొదటి భాషగా రష్యన్ భాషనే ఉపయోగిస్తారు.
