
Russia’s President Vladimir Putin (front C), accompanied by Russian Defence Minister Sergei Shoigu (front L), walks to watch military exercises upon his arrival at the Kirillovsky firing ground in the Leningrad region, March 3, 2014. REUTERS/Mikhail Klimentyev/RIA Novosti/Kremlin
తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల నుండి రష్యా తమ సేనలను వెనక్కి రప్పించుకుంది. ఉక్రెయిన్ లో కుట్ర ద్వారా రష్యా వ్యతిరేక, ఇ.యు + అమెరికా అనుకూల శక్తులు బలవంతంగా అధికారం చేజిక్కించుకున్న నేపధ్యంలో రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులో కొద్ది రోజులుగాసైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసాలను చాలించుకుని ఇక బ్యారక్ లను చేరుకోవాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు ఇవ్వడంతో రష్యా సేనలు వెనక్కి వెళ్ళాయి. దీనితో అమెరికా + ఇ.యు మరియు రష్యాల మధ్య అంతర్గతంగా ఒక ఒప్పందం కుదిరి ఉండవచ్చని పత్రికలు, పరిశీలకులు, మార్కెట్లు భావిస్తున్నట్లుగా రాయిటర్స్ తెలిపింది.
రష్యా సేనలు వెనక్కి వెళ్లడంతో ఆసియా దేశాల్లో స్టాక్ మార్కెట్లు తదనుగుణంగా స్పందించాయి. ఆసియా, యూరోప్ ల సరిహద్దు దేశం అయిన ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలు చల్లబడినట్లే అన్న సంకేతాలు అందినట్లుగా భావించిన మార్కెట్లు లాభాలతో ముగిశాయి. భారత దేశ స్టాక్ మార్కెట్ బొంబే స్టాక్ ఎక్ఛేంజీ (సెన్సెక్స్) 260 పాయింట్లకు పైగా లాభపడింది.
హాంగ్ కాంగ్, జపాన్, కొరియా స్టాక్ మార్కెట్లు కూడా 0.5 శాతం నుండి 1.5 శాతం వరకు పెరిగి లాభాలు నమోదు చేశాయి. రష్యా దాడి చేస్తుందన్న అంచనాతో సోమవారం ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలు నమోదు చేయగా చమురు ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఐరోపా మార్కెట్లు ప్రారంభం లోనే 1.5 శాతం నుండి 2.5 శాతం వరకు లాభాలు నమోదు చేయగా అమెరికా మార్కెట్లలో ఇంకా ట్రేడింగ్ ప్రారంభం కాలేదు.
అమెరికా, ఇ.యుల హెచ్చరికల వల్లనే రష్యా సేనల వెనక్కి మళ్లింపు జరిగిందన్న అభిప్రాయాన్ని పశ్చిమ పత్రికలు సృష్టిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే రష్యా సేనల విన్యాసాల ముంగింపు ముందుగా అనుకున్నదే. ఉక్రెయిన్ పరిణామాల నేపధ్యంలో పశ్చిమ రష్యాలో తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో విన్యాసాల నిర్వహణకు పుతిన్ ఆదేశాలు ఇచ్చారు. మార్చి 4తో విన్యాసాలు ముగించాలని ముందుగా అనుకున్నదే అని రష్యా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే మార్కెట్ల సానుకూల స్పందనకు అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటన కారణం అని అనంతరం పశ్చిమ పత్రికలు మెల్లగా అసలు నిజం విప్పాయి. చివరి అస్త్రంగా మాత్రమే సైనిక చర్యకు దిగుతామని చెప్పిన పుతిన్ సదరు చర్యను పూర్తిగా ఉపసంహరించుకోవడం లేదని చెప్పారు. మాస్కోలో విలేఖరులతో మాట్లాడిన ఆయన ఉక్రెయిన్ లో రష్యన్లు భయాందోళనల మధ్య నివసిస్తున్నారని వారి ప్రయోజనాల రక్షణ కోసం సైనిక చర్యకు పాల్పడే హక్కును రిజర్వ్ లో ఉంచుకుంటున్నానని తెలిపారు. దీనితో అమెరికా, ఇ.యు నేతల హెచ్చరికల వల్లనే పుతిన్ బెదిరిపోయాడన్న పశ్చిమ పత్రికల ప్రచారం ఒట్టి డొల్ల అని తేలిపోయింది.
ఉక్రెయిన్ లో రాజ్యాంగ విరుద్ధంగా కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చివేశారని పుతిన్ విలేఖరులకు తెలిపారు. పదవీచ్యుతుడయిన విక్టర్ యనుకోవిచ్ ప్రజాస్వామిక ఎన్నికల ద్వారా అధ్యక్షుడుగా ఎన్నుకోబడినందున ఇప్పటికే ఆయనే చట్టబద్ధ అధ్యక్షుడని గుర్తు చేశారు. “కీవ్ జరిగిన సంఘటనల పైన ఒకే ఒక నిర్ధారణ మాత్రమే చేయగలం. అది రాజ్యాంగ విరుద్ధమైన కుట్ర. సాయుధంగా అధికారం లాక్కున్నారు… బలగాలను దించడం గురించి, ఇప్పటికైతే ఆ అవసరం లేదు. మిలట్రీ బలగాలను వినియోగించే అవసరం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే మరే అవకాశం మిగలనప్పుడు మాత్రమే. చివరి అవకాశంగా మాత్రమే మిలట్రీ అవసరం వస్తుంది” అని పుతిన్ విలేఖరులతో అన్నారు.
పుతిన్ విలేఖరుల సమావేశానికి ఒకటి రెండు రోజుల ముందు ఉక్రెయిన్ మాజీ అధ్యక్షురాలు యులియా టిమెషెంకో మాస్కోకు బయలుదేరి వెళ్లారని కొన్ని పత్రికలు తెలిపాయి. ఈ వార్తకు పశ్చిమ పత్రికలు ప్రాముఖ్యం ఇవ్వలేదు. బహుశా తాము పుతిన్ తో తెరవెనుక చర్చలు సాగిస్తున్నట్లు ప్రపంచానికి తెలియడం పశ్చిమ దేశాలకు ఇష్టం లేకపోవచ్చు. రష్యాపై ఆంక్షలు విధిస్తామని, రాజకీయంగా ఒంటరిని చేస్తామనీ ఒక పక్క ప్రకటిస్తూ, అదే రష్యాతో అదే ఉక్రెయిన్ విషయంలో చర్చలు జరుపుతున్న విషయం చెప్పుకోవడానికి పశ్చిమ దేశాలు బహుశా సిగ్గుపడుతుండవచ్చు. టిమెశెంకో మధ్యవర్తిత్వంతోనే ఉద్రిక్తతలు తగ్గించేవైపుగా పుతిన్ ప్రకటన చేసి ఉండవచ్చు. దీనిని పశ్చిమ పత్రికలు తమకు అనుకూలంగా అనువదించుకుని సంతృప్తి పడుతున్నాయి.
పదవీచ్యుతుడయిన యనుకోవిచ్ ను రష్యా అనుకూల అధ్యక్షుడుగా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేస్తున్నప్పటికీ గత చరిత్ర అందుకు విరుద్ధంగా ఉంది. ఇ.యూలో చేరడానికి యనుకోవిచ్ ఎన్నడూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. పైగా ఇ.యులో చేరడానికి ఆయన మొదటి నుండి చర్చలు జరుపుతున్నారు. కానీ ఇ.యు తో ఒప్పందం వలన ఉక్రెయిన్ ధనిక వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని గ్రహించాకనే ఆయన ఇ.యులో చేరికపై పునరాలోచనలో పడ్డారు. ఈ ఒప్పందం వలన ఐ.ఏం.ఎఫ్ విధించే విషమ షరతులకు తల ఒగ్గడంతో పాటు ఉక్రెయిన్ గుత్తాధిపత్య కంపెనీలు తమ మార్కెట్లను అమెరికా, ఇ.యు కంపెనీలకు ధారాదత్తం చేయాల్సిన పరిస్ధితి వస్తుందని గ్రహించాయి. దాని ఫలితమే వారి ప్రతినిధి అయిన యనుకోవిచ్ ఇ.యు చేరికను వాయిదా వేయడం. ఈ వాయిదాను తిరస్కరించడంగానే అమెరికా, ఇ.యులు పరిగణించి కృత్రిమ ఆందోళనలను రెచ్చగొట్టాయి.
ఉక్రెయిన్ పై ఒత్తిడి పెంచుతున్న రష్యా
రష్యా నుండి దూరం అవుతూ పశ్చిమ దేశాల అనుకూల శక్తులు ఉక్రెయిన్ లో అధికారం చేపట్టిన నేపధ్యంలో ఆ దేశంపై రష్యా ఒత్తిడి పెంచుతోంది. ఉక్రెయిన్ కు ఇవ్వజూపిన పలు ఆర్ధిక, వాణిజ్య రాయితీలను ఒక్కొక్కటీ ఉపసంహరిస్తోంది. పాత బాకీలపై ప్రకటించిన రాయితీలను ఉపసంహరించుకుంటోంది. సహజ వాయువు ధరలపై ఇచ్చిన భారీ రాయితీలను వెనక్కి తీసుకుని పాత సరఫరాలకు కూడా అసలు ధరలు కక్కాలని స్పష్టం చేస్తోంది.
రష్యాలో అతి పెద్ద సహజవాయువు ఉత్పత్తిదారు అయిన గాజ్ ప్రోమ్ ఈ మేరకు గ్యాస్ ధరలపై ఇస్తున్న రాయితీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ నుండి తాజా నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పడం ద్వారా ఈ లోపు తగిన సానుకూల చర్యలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. కొన్ని రాయితీల ఉపసంహరణ మాత్రం పాత తేదీనుండి అమలు చేస్తామని పరోక్షంగా తెలిపింది.