ప్రకృతిలోని ఆయా జీవరాశుల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోగలిగితే ఒక్కో సందర్భంలో మానవ జీవితం పైన రోత పుట్టక మానదు. ఒక కాకి చనిపోతే వంద కాకులొచ్చి గోల గోల చేయడం తెలిసిన విషయమే. పసిగుడ్డుగా ఉన్న తమ పిల్లల్ని కాపాడుకోవడానికి దాదాపు ప్రతి పక్షి, జంతువు ప్రాణాలకైనా తెగించే సాహసం ప్రదర్శిస్తుంది. మనిషి మాత్రం కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విడిపోయి మేం గొప్పంటే మేమే గొప్పంటూ కొట్టుకు చస్తూ మూగ జీవాల ముందు వెలతెలా పోతుంటాడు.
పక్షులు గుంపులు గుంపులుగా బతకడం మనకు తెలిసిన సంగతే. ఏవో కొన్ని అరుదైన జాతులు తప్ప దాదాపు ప్రతి పక్షి జాతీ గుంపులుగా బతుకుతూ ఒకదానికొకటి తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. స్టార్లింగ్ అనే పిట్టలు ఈ లక్షణాలతో పాటు మరో అరుదైన లక్షణం కనబరుస్తాయి. శత్రువు (గద్ద లాంటి పక్షులు) నుంచి ప్రమాదం ఎదురవుతోందని గ్రహించినపుడు భారీ సంఖ్యలో ఎగురుతూ ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ఒక పెద్ద ఆకారం ఎగురుతున్న భ్రాంతిని కలగజేస్తాయి. దానితో శత్రువు పరార్!
ఇలా ఒక క్రమబద్ధమైన ఆకారంలో స్టార్లింగ్ పక్షులు ఎలా ఎగరగలుగుతున్నాయి అన్నది పరిశీలకులకు ముఖ్యంగా ఆర్నితాలజిస్టులకు, ఇతర శాస్త్రవేత్తలకు ఒక అంతు చిక్కని సమస్యగా ఉంటూ వచ్చింది. స్టార్లింగ్ పక్షుల ప్రత్యేకత ఏమిటంటే ఆకాశంలో తాము సృష్టించే ఆకారాలను మార్చుకుంటూ పోవడం. గుంపులో ఒక పక్షి తన దిశను మార్చుకుందే అనుకుందాం. దానికి అనుగుణంగా రెప్పపాటులోనే ఇతర పక్షులు కూడా ‘దిశ’ లేదా ‘ఆకారం’ మార్పిడిని ఎలా సింక్రొనైజ్ చేస్తాయి? ఇదే శాస్త్రవేత్తలను తొలిచిన ప్రశ్న.
స్టార్లింగ్ పక్షులకు చెందిన ఈ ప్రత్యేక లక్షణాన్ని ఆంగ్లంలో మర్మరేషన్స్ అంటారు. ఈ మర్మరేషన్ రహస్యాన్ని శాస్త్రజ్ఞులకు ఇంకా పూర్తిగా అంతుబట్టలేదు. కొంతవరకు పసిగట్టినా సమాధానం తెలియని ప్రశ్నలు వారికి ఇంకా ఉన్నాయి. ఒక పక్షి దిశ మార్చితే మహా అయితే అది పక్క ఉన్న పక్షులకు కనిపిస్తుంది. కాబట్టి అవి కూడా తదనుగుణంగా దిశ మార్చగలవు. కానీ మొత్తం ఆకారం క్రమబద్ధంగా కదిలేలా ఆ గుంపులోని పక్షులన్నింటికీ జ్ఞానం ఎలా వచ్చేస్తుంది? అది కూడా సెకండ్లలో?
గతంలో సినిమాల్లో నాయకా నాయికలు మాత్రమే ఆడుకుంటూ పాడుకుంటూ ప్రేమించుకునేవారు. ఇప్పుడు దాదాపు అన్ని పాటలకు గ్రూప్ డ్యాన్స్ లే. గ్రూపులో ఉండే డ్యాన్సర్లు లయబద్ధంగా కదులుతుంటే మనకి కనిపించేది గ్రూపు కదలికలే గానీ, ఒక్కో డ్యాన్సర్ కదలిక కాదు. హీరో, హీరోయిన్ల ప్రత్యేక పోతుందన్న ప్రమాదం వల్ల వారికి ప్రత్యేక రంగులో డ్రస్సులు తొడిగి వారి ప్రత్యేకత కాపాడుకుంటారు. ముందే ప్రాక్టీస్ చేసి ప్రదర్శిస్తారు గనుక ఇక్కడ రహస్యం ఏమీ లేదు. ఇదే తరహాలో ఉండే స్టార్లింగ్ పక్షుల కదలికలు ప్రాక్టీస్ వల్ల వచ్చేవి అయితే కాదు.
ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు కనిపెట్టినదాని ప్రకారం ఒక్కో స్టార్లింగ్ పక్షి తన చుట్టూ ఉన్న 6 లేదా 7 పక్షులను నేరుగా ప్రభావితం చేస్తుంది. అంటే ఒక పక్షి దిశ మార్చినా వేగం మార్చినా వెంటనే 6 లేదా 7 పక్షులు తదనుగుణంగా స్పందిస్తాయి. ఆ 7 పక్షులు ఒక్కొక్కటీ మరో 7 పక్షులతో నేరుగా కమ్యూనికేట్ చేస్తాయి. అవి మళ్ళీ మరో 7 పక్షులతో…. ఇలా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవడం ఒక సెకన్ కంటే తక్కువ సమయంలోనే జరిగిపోతుందిట. ఆ విధంగా గుంపులు ఎన్ని వందలు, వేలు పక్షులు ఉన్నా సమర్ధవంతంగా సింక్రొనైజ్ చేయగలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ఏడే ఎందుకని? ఏడు అనే సంఖ్య ప్రకృతిలో ప్రతిచోటా ఆయా సందర్భాల్లో చక్కగా పని చేసే సంఖ్య అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏడడుగుల సంబంధం. ఏడు జన్మలు, ఏడు సముద్రాలు, అటేడు-ఇటేడు తరాలు ఇలా మనుషుల్లో కూడా ఏడు సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత తక్కువేమీ కాదు. గుంపు సమన్వయం చక్కగా ఉండడానికీ అదే సమయంలో వ్యక్తిగత ప్రయత్నం కూడా సమర్ధవంతంగా సాగడానికీ, మళ్ళీ ఈ రెండింటి (గుంపు ప్రవర్తన, వ్యక్తిగత సామర్ధ్యం) మధ్యా సమతూకం సాధించడానికీ ఈ 7 అన్న సంఖ్య సరిగ్గా సరిపోతుందని శాస్త్రవేత్తల భావన.
స్టార్లింగ్ పక్షుల గుంపు ప్రవర్తన విషయంలో శాస్త్రవేత్తలు చెబుతున్నవి పూర్తి సమాధానం, అవగాహన ఇచ్చేవి కావు. శాస్త్రబద్ధ పరిశోధన, ఆవిష్కరణలు ఒక నాటితో తేలేవీ కావు కదా!
ఈ ఫోటోలు ఒక చోటివి కావు. వివిధ దేశాల నుండి సేకరించినవి. ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.
















అత్భుతం గా ఉన్నాయి, పక్షుల విన్యాసాలూ, ఫోటోలూ !
వివిధ దేశాల నుంచి సేకరించినా , ఇజ్రాయిల్ పక్షులే ‘ ఉత్తమ కళాకారులు ‘ అనిపిస్తుంది చూస్తుంటే !!