శత సహస్ర కోటీశ్వరుడు సుబ్రతో రాయ్ అరెస్ట్


Sahara Shaher

Sahara Shaher

సహారా గ్రూపు కంపెనీల అధినేత సుబ్రతో రాయ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుప్రీం కోర్టులో హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. సుబ్రతో రాయ్ కోసం ఆయనకు చెందిన లక్నో నివాసంలో పోలీసులు వెతికినప్పటికి దొరకలేదు. సుబ్రతో కంపెనీల వద్దా, నివాసాల వద్దా పోలీసులు కాపు కాయడంతో పరిస్ధితి తీవ్రతను గమనించిన రాయ్ ఈ రోజు లక్నో పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

సహారా గ్రూపుకు చెందిన రెండు కంపెనీలు ప్రజల నుండి అక్రమ పద్ధతుల్లో సేకరించిన డిపాజిట్లను తిరిగి చేల్లించాలన్న కేసులో సుబ్రతో రాయ్ రెండు సంవత్సరాలుగా సుప్రీం కోర్టుతోనూ, సెబి (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తోనూ ఆయన గేమ్స్ ఆడుతూ వచ్చారు. 17,000 కోట్లకు పైగా సేకరించిన డిపాజిట్లు వడ్డీతో కలిపి 25,000 కోట్ల రూపాయిలు డిపాజిట్ దారులకు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు 5,000 కోట్ల వరకు సెబి వద్ద డిపాజిట్ చేసిన సుబ్రతో రాయ్ మిగిలిన మొత్తాన్ని చెల్లించకుండా కాలం గడిపారు.

సుబ్రతో రాయ్ ధోరణితో విసిగిపోయిన సుప్రీం కోర్టు ధర్మాసనం తన ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. సుబ్రతో రాయ్ తో పాటు రెండు కంపెనీలకు చెందిన డైరెక్టర్లు కూడా హాజరు కావాలని కోరింది. ఇతర డైరెక్టర్లు హాజరయినప్పటికీ రాయ్ మొఖం చాటేశాడు. తన తల్లి గారికి జబ్బు చేసిందని, మంచంపై ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిన తన చేతుల్లోకి తీసుకుని ఉన్నారని అందుకే కోర్టుకు రాలేకపోయారని సుబ్రతో రాయ్ లాయర్ రామ్ జేఠ్మలాని కోర్టుకు తెలిపారు. అందుకు ఆగ్రహించిన సుప్రీం ధర్మాసనం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసి మార్చి 4 లోపు అమలు చేయాలని ఆదేశించింది.

ఫిబ్రవరి 26 తేదీన సుప్రీం ధర్మాసనం అరెస్టు వారంటు జారీ చేయగా ఈ రెండు రోజులు ఆయన పోలీసులకు దొరకలేదు. లక్నో లోని ఆయన నివాసం సహారా షహార్ కు పోలీసులు వెళ్ళినప్పటికీ దొరకలేదు. పోలీసులు ఆయన వస్తాడని భావించిన వివిధ చోట్ల కాపలా కాశారని పత్రికలు తెలిపాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం సహారా షహార్ నుండి పోలీసులను పిలిపించుకుని సుబ్రతో రాయ్ వారికి లొంగిపోయారు. రాయ్ అరెస్టు అనంతరం ‘సహారా హౌసింగ్ ఫీనా’ కంపెనీ షేర్లు 4.39 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది.

“ఈ రోజు రాయ్ ని అరెస్టు చేశాము. ఈ రోజే ఆయనను కోర్టులో హాజరుపరుస్తాము” అని లక్నో ఎస్.పి హాబీబుల్ హాసన్ చెప్పారని పత్రికలు తెలిపాయి. సుబ్రతో రాయ్ పోలీసు కస్టడీలో ఉన్నందున ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్ ను రద్దు చేయాలని లాయర్ రామ్ జెఠ్మలానీ సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని ఈ రోజు కోరారు. రాయ్ కేసు విచారిస్తున్న జస్టిస్ కె.ఎస్.రాధా కృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆయన ఈ మేరకు విన్నవించారు.

తన విన్నపాన్ని ధర్మాసనం ఈ రోజే పరిశీలించాలని రామ్ జేఠ్మలాని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. ధర్మాసనం ఈ రోజు సమావేశం అయ్యే అవకాశం లేదని చెబుతూ జెఠ్మలానీ విన్నపాన్ని తోసిపుచ్చింది.

అంతకుముందు సుబ్రతో రాయ్ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. తాను ఎక్కడికీ పోలేదని, పోలీసుల నుండి తప్పించుకుని తిరగడం లేదనీ, సుప్రీం కోర్టు ఆదేశాలను బేషరతుగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాననీ ఆయన సదరు ప్రకటనలో తెలిపారు. “నేను తప్పించుకుపోలేదు. లక్నోలో ఉన్నాను. అనారోగ్యంతో ఉన్న నా తల్లి వద్దనే నేను ఉండేట్లుగా నన్ను హౌస్ అరెస్టు చేయాలని చేతులు జోడించి సవినయంగా గౌరవనీయులైన సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కోరుతున్నాను” అని ఆయన ప్రకటనలో కోరారని ఐ.బి.ఎన్ ఛానెల్ తెలిపింది.

లక్నోలో రాయ్ ను పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఆయన కుమారుడు సీమంతో రాయ్ ఢిల్లీలో హడావుడిగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ తండ్రి పోలీసులతోనూ, ఇతర అధికారులతోనూ సహకరిస్తున్నారనీ, స్వయంగా ఇష్టంతోనే పోలీసులకు లొంగిపోయారని ఆయన విలేఖరులకు తెలిపారు.

ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన హోటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో సుబ్రతో రాయ్ స్వయంగా విలేఖరులతో మాట్లాడుతారన్న ఊహాగానాలు సాగాయి. ఆయన లక్నోలోనే ఉన్నారని మరికొందరు చెప్పడంతో ఛానెళ్లు ఆయన ఉనికి గురించి రకరకాల ఊహాగానాలు ప్రసారం చేశాయి. చివరికి లక్నోలో అరెస్టు అయినట్లు తెలియడంతో ఊహాగానాలకు తెరపడింది.

సుబ్రతో అరెస్టుతో సహారా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. 68,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా భావిస్తున్న సుబ్రతో రాయ్ తమ కంపెనీల షేర్ల పతనాన్ని అడ్డుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేశారు. సుప్రీం కోర్టులో హాజరు కావడానికే తన తండ్రి ఫిబ్రవరి 24 తేదీన ఢిల్లీ వచ్చారని అయితే తల్లి అనారోగ్యానికి గురి కావడంతో తిరిగి లక్నో వెళ్లాల్సి వచ్చిందని సుబ్రతో తనయుడు సీమంతో రాయ్ విలేఖరులకు వివరణ ఇచ్చుకున్నారు.

“ఆయనకు తన తల్లితో చాలా అనుబంధం ఉంది. ఆమె అనారోగ్యానికి గురి కావడంతో మళ్ళీ లక్నో వెళ్లారు. వ్యక్తిగత హాజరు నుండి ఒక రోజు మాత్రమే మినహాయించాలని ఆయన కోర్టును కోరారు. కానీ ఆయనకు ఆ అవకాశం దొరకలేదు. తన తల్లి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. అందువల్ల సుప్రీం కోర్టు తనను కరుణిస్తుందని ఆయన ఆశిస్తున్నారు” అని సీమంతో రాయ్ పత్రికలు వివరణ ఇచ్చారు.

సుబ్రతో రాయ్ మీడియాపై దాడి ఎక్కు పెట్టడం విశేషం. తనపై ‘కేరక్టర్ అసాసినేషన్’ కు మీడియా పూనుకుంటోందని విమర్శించారు. తనను తన తల్లి నుండి దూరం చేయడం వలన ఆమెకు ఏమయినా జరిగితే మీడియా వ్యక్తులను వదిలి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు కూడా. అరెస్టు నుండి తప్పించుకోవడానికి వీలుగా ఆసుపత్రిలో చేరాలంటూ కొందరు సలహా ఇచ్చారనీ కానీ అలాంటి డ్రామాలు తనకు నచ్చవని చెప్పుకున్నారు. తనను అరెస్టు చేయడం వలన తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని కావున దయ చూపాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు.

అరెస్టు నుండి తప్పించుకోవడానికి సకల అవకాశాలు ఆవిరై మరే మార్గమూ మృగ్యం కావడంతోనే సుబ్రతో రాయ్ కాళ్ళ బేరానికి వచ్చారని వివిధ ఛానెళ్లు, పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళూ పట్టుకునే చాతుర్యం ఉన్నవారే శత కోటీశ్వరులు కాగలరని ఈ సందర్భంగా జనానికి అర్ధం అవుతున్న విషయం.

వ్యాఖ్యానించండి