పార్లమెంటు వెల్ నుంచే ప్రచారం మొదలు -కార్టూన్


Abyss

సగటు పురుషుడు: పార్లమెంటులో దీన్ని ‘వెల్ ఆఫ్ ద హౌస్’ అంటారు…

సగటు స్త్రీ: ఎన్నికల్లోనేమో మహా అగాధం అని పిలుస్తారు…

మరో అద్భుతమైన కార్టూన్! పార్లమెంటు ఉభయ సభల్లోనూ సాధారణంగా జరిగే గొడవలకు, ముఖ్యంగా ఇటీవల తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా వివిధ పార్టీల నేతలు వేసిన వేషాలకు కారణం ఏమిటో స్పష్టంగా తెలియజెపుతున్న కార్టూన్ ఇది.

2014 సాధారణ ఎన్నికల ప్రచారం చివరి లోక్ సభ, రాజ్య సభల సమావేశాల నుండే మొదలయిందని కార్టూన్ సూచిస్తోంది. పదే పదే వెల్ లోకి దూసుకు రావడంతో పాటు అక్కడే సెటిలైపోయి గంటల తరబడి అరుస్తూ, నిలబడి ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ఆయా పార్టీల ఎం.పి లు తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు.

పార్లమెంటులో జరిగిన ఎన్నికల ప్రచారం ‘వెల్ ఆఫ్ ద హౌస్’ గా జనం ముందు కనపడితే ఎన్నికలకు వచ్చేసరికి అవే పార్టీలకు అదే ఎన్నికల ప్రచారం లోతైన అగాధంగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారాన్ని లోతైన అగాధంగా మార్చేసిన పుణ్యం కూడా రాజకీయ పార్టీలదే. దానికి జనాన్నని ప్రయోజనం లేదు.

ఓటుకు నోటు తీసుకుంటూ, తాగుతూ, పార్టీలు పంచే తాయిలాలు స్వీకరిస్తూ జనం ఉంటేనే పార్టీల అక్రమ కార్యక్రమాలు, ప్రభుత్వంలోకి వచ్చాక వారి దోపిడి కార్యకలాపాలు సక్రమంగా సాగుతాయి. వారి తాయిలాలను తిరస్కరించి సక్రమమైన అభ్యర్ధులకే ఓటు వేసే చైతన్యాన్ని జనం ప్రదర్శిస్తే ఆ పార్టీలకూ, నాయకులకే నష్టం. ఎందుకంటే వారెవరూ సక్రమ అభ్యర్ధులు కారని జనానికి తెలిస్తుంది కాబట్టి.

అందుకే తాము సృష్టించుకున్న అగాధంలోకి రాజకీయ పార్టీలు ఇష్టంగా దూకేస్తాయి. దూకలేనివారు తిట్టుకుంటూ కాలం గడిపేస్తారు. జనం మాత్రం ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు.

One thought on “పార్లమెంటు వెల్ నుంచే ప్రచారం మొదలు -కార్టూన్

  1. పార్లమెంట్ రాజకీయ కప్పల బెకబకలు. వ్యవహారాలలో లుకలుకలనే విషయం లోకవిదితం. తెలంగాణా చిన్నిల్లు భాగవతంలో ఈ దిగుడు బావి ప్రఖ్యాతిని సంతరించుకుంది. ఊట తక్కువ, ఊహలెక్కువతో ఎండగట్టే స్పీకరుగారి పరిధిలోని బావి. వట్టిపోయిన గొడ్ల అరుపులతో విసిగిన క్షణంలో సముదాయించలేక చివరికి బయట పాలేళ్ళను పిలిచి ఈ బావినుంచే గొడ్లచావిడికి లాక్కెళతారు.

వ్యాఖ్యానించండి