జనారణ్యంలో చిరుత -ఫోటోలు


మనిషి జీవనంపై మోజు పెంచుకుందో ఏమో గానీ ఓ చిరుతపులి మీరట్ జనారణ్యంలోకి ప్రవేశించింది. పోలీసు అధికారుల్ని, అటవీ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. పోలీసులు తమ సహజ స్టైల్ లో లాఠీ చార్జికి దిగినా అది అదరలేదు, బెదరలేదు. పోలీసు లాఠీ ఝళిపిస్తే బెదిరి పరుగులు పెట్టాలని దానికి తెలియదు గదా మరి! పోలీసుల పైకే లంఘించి ఏడుగురిని గాయపరిచి మరీ తన సత్తా చాటుకుంది.

ఆదివారం, ఫిబ్రవరి 23 తేదీన జరిగిందీ ఘటన. ఇంతకీ అది అధికారులకు దొరకనే లేదు. మత్తు మందుతో కూడిన ఇంజెక్షన్లు చేతుల్లో పెట్టుకుని చిరుత వెంట పడినప్పటికీ అటవీ, పోలీసు అధికారులు చిరుతను పట్టుకోలేకపోయారు. అదింకా ఎక్కడో నగరంలోనే నక్కి ఉంటుందని కొందరు భావిస్తుండగా ఊరు దాటిపోయి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు.

ఒక పోలీసు అధికారి పైకి చిరుత బలంగా పంజా విసరడంతో ఆయన భుజంపై తీవ్రం గాయం అయింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇళ్ల కప్పులపై గుండా దూకుతూ ఒక సినిమా హాలు, ఆసుపత్రి, నిర్మాణంలో ఉన్న భవనాలలోకి చొరబడి కలకలం సృష్టించిన చిరుత చివరికి తప్పించుకుని పోయింది. చిరుతను చూడడానికి జనం పెద్ద ఎత్తున గుమి కూడడంతో చిరుతను పట్టుకోవడం అటవీ అధికారులకు సాధ్యం కాలేదు.

రెండు వారాల క్రితం ఇదే నగరంలోకి మరో చిరుత పులి ప్రవేశించి జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. 5 సం.ల బాలుడిని చంపింది కూడా. అంతకు మునుపు ఒక కొండ సింహం మీరట్ లో ప్రవేశించి ఒక భిక్షగాడిని గాయపరిచినట్లు గార్డియన్ టి.వి సమాచారం. సమీపంలోని అడవి నుండి దారి తప్పిన జంతువులు నగరంలోకి ప్రవేశిస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.     

నగర విస్తరణ భూతలం మీది ఇతర జీవ ప్రాణులకు చోటు లేకుండా చేస్తుండడంతో మృగాలు నీటి కోసం, ఆహారం కోసం అనివార్యంగా జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. దీనిని నిరోధించాలంటే జంతువుల చోటును ఆక్రమించకుండా వాటి మానాన వాటిని బతకనివ్వడమే ఏకైక దారి. అది మాత్రం జరగని పని.

Photos: The Atlantic

వ్యాఖ్యానించండి