ఇండియా, గాంధీ, బోస్… జెస్సీ జాక్సన్ అభిప్రాయాలు


Jesse Jackson with Krishna Bose

Jesse Jackson with Krishna Bose

అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకుడు జెస్సి జాక్సన్ ఇండియా సందర్శించారు. జెస్సీ జాక్సన్ అమెరికాలో 1960ల కాలంలో వెల్లివిరిసిన నల్ల జాతి పౌర హక్కుల ఉద్యమానికి నేతృత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ సమకాలికులు. భారత జాతీయోద్యమ నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ‘నేతాజీ మ్యూజియం’ ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కోల్ కతా లో ఆయన సుభాష్ సోదరుని కుమార్తె కృష్ణ బోస్ కలిసి జెస్సీ జాక్సన్ విలేఖరులతో మాట్లాడారు.

ఈ సమావేశంలో ఇండియాకు సంబంధించిన పలు విషయాలను ఆయన చర్చించారు. మన గురించి మనం ఏమనుకునేది ఒక సంగతి. మన గురించి ఇతరులు ఏమనుకునేది మరొక సంగతి. ఈ రెండోది తెలుసుకునే అవకాశం మనకు చాలా తక్కువసార్లు వస్తుంది. అమెరికా పౌర హక్కుల నేత జెస్సీ జాక్సన్ కు భారత దేశం గురించి, భారత ప్రజాస్వామ్యం గురించి చెప్పిన అభిప్రాయాలను తెలుసుకోవడం సముచితం కాగలదు. దానికి ముందు ‘పౌర హక్కులు – మానవ హక్కులు’ అంశం గురించి కాస్త తెలుసుకుందాం.

మానవ హక్కులు అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రాచుర్యం సంపాదించింది గానీ వాటి కంటే ముఖ్యమైనవి ‘పౌర హక్కులు.’ సమస్త అధికారాలను గుప్పెట్లో పెట్టుకున్న పాలకులు సదరు అధికారాల ద్వారా పౌరుల హక్కులను నియంత్రిస్తారు. పాలితులపై పాలకులకు గల ఆధిపత్యాన్ని, వారు సాగించే అణచివేతలను ఎత్తి చూపేవి పౌర హక్కులు. మానవ హక్కులు అన్న ధోరణి పాలకులు-పాలితుల మధ్య ఉన్న అసమాన ఆధిపత్య సంబంధాలను చూడడానికి నిరాకరిస్తుంది. ‘పాలకులు, పాలితులు అందరూ ఒకటే, అందరూ మానవులే కాబట్టి అందరి మానవ హక్కులూ సమానమే’ అన్న తప్పుడు అవగాహనను జనంలో చొప్పించడానికి పాలకులు కనిపెట్టిన పోస్ట్ మోడ్రనిస్టు భావజాలంలోని ఒక భాగమే ‘మానవ హక్కులు’.

స్ధూలంగా చూస్తే మానవ హక్కులకు ఎవరూ జవాబుదారీగా కనపడరు. వ్యవస్ధను కొన్ని వర్గాలు గుప్పెట్లో పెట్టుకుని నియంత్రిస్తున్నారు అన్న నిజాన్ని ఈ మానవ హక్కుల ధోరణి కప్పి పెడుతుంది. పౌర హక్కులు అలా కాదు. దేశంలో ప్రతి పౌరుడు సమాన హక్కులు కలిగి ఉన్నాడని రాజ్యాంగం గుర్తిస్తుంది. ఆయా హక్కులను రాజ్యాంగం పౌరుడికి హామీ ఇస్తుంది. అనగా రాజ్యాంగాన్ని అమలు చేసేవారు పౌరులకు సదరు హక్కులను గ్యారంటీ చేయాలి. అందువలన హక్కులు హరించబడే పరిస్ధితి వచ్చినపుడు పౌరులు రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంటుంది. మానవ హక్కులకు కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్న అవగాహన ఉన్నప్పటికి అది అనిర్దిష్టం. ఎందుకంటే అణచివేతకు పూనుకునే వర్గాలకు కూడా ‘మానవ హక్కుల’ పేరుతో రక్షణ కల్పించే వెసులుబాటు ఈ అవగాహన కల్పిస్తుంది.

భారత దేశానికి సంబంధించినంతవరకు పౌర హక్కుల కార్యకర్తలలో ముందు పీఠిన నిలిచేది బాల గోపాల్, కన్నాభిరాన్ లు. వీరిద్దరి నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం (APCLC) రెండు దశాబ్దం పాటు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. శ్రామిక వర్గాల పోరాటాలకు అండగా నిలిచి వివిధ నల్ల చట్టాలు, నల్ల బలగాలు దన్నుగా పాలకులు సాగించిన దమననీతిని ఎండగట్టడంలో ఎ.పి.సి.ఎల్.సి అగ్రభాగాన నిలిచింది. అనంతర కాలంలో బాల గోపాల్ సైతం ఆచరణాత్మకమైన, ప్రజాస్వామికమైన పౌర హక్కుల భావనను వీడి పాలకుల భావజాలమైన ‘మానవ హక్కుల’ ను చేపట్టడం ఒక విపరీత పరిణామం.

ఇప్పుడు భారత దేశం గురించి జెస్సీ జాక్సన్ అభిప్రాయాలలో కొన్నింటిని చూద్దాం.

  • ఒక విధంగా చెప్పాలంటే భారత దేశం స్వేచ్ఛా దేశమే కానీ అసమానతలున్న దేశం.
  • సాంకేతిక రంగంలో ఇండియా నెంబర్ 1 దేశం. అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశం. ఆర్ధిక వృద్ధిలోనూ ముందున్న దేశం. ప్రపంచం నలుమూలలా నైపుణ్యాన్ని ఎగుమతి చేస్తున్న దేశం. అమెరికాలో శాస్త్ర పరిశోధనలు ప్రధానంగా భారత శాస్త్రవేత్తలు చేస్తున్నదే; మైక్రోసాఫ్ట్ నాయకుడు ఒక భారతీయుడు; కొన్ని దేశాలు ప్రధానంగా చమురు ఎగుమతి చేస్తాయి, కొన్ని దేశాలు కలప మరియు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తాయి, ఇండియా మాత్రం ప్రధానంగా ప్రజ్ఞను ఎగుమతి చేస్తోంది. శాస్త్ర రంగంలో సమర్ధవంతమైన మెదళ్ళను భారత్ ఉత్పత్తి చేస్తోంది. ఆ లక్షణం ఇండియానే కాక ప్రపంచాన్ని కూడా కాపాడుతోంది. అందుకనే కొంతమంది పిల్లలను చదువుకు దూరం చేయడం, తద్వారా నిరక్షరాస్యులుగా మిగిలిపోక తప్పని పరిస్ధితిని కల్పించడం మహా పాపం.
  • ఉగ్రవాదానికి మూల కారణాల్లో ఒకటి పేదరికం. జనంలో భయం పాదుకొల్పడానికి ఉగ్రవాదం ప్రయత్నిస్తుంది. ఐదేళ్లు నిండకమునుపే చనిపోతారేమోనని, ఇక ఎన్నడూ చదువు మొఖం చూడలేమోనని, జీవికకు తగిన మొత్తం సంపాదించలేమేమోనని వారి భయం. అలాంటి దరిద్రం ఉగ్రవాదాన్ని, భయాన్ని పెంచి పోషిస్తుంది. అందుకే దానిపై దృష్టి కేంద్రీకరించాలి… ఉగ్రవాదానికి నిరంతర కారణంగా ఉండగల సామర్ధ్యం దారిద్ర్యానికి ఉంది. దారిద్ర్యం సామూహిక విధ్వంసక మారణాయుధం. ఎందుకంటే అది మూకుమ్మడి చావులకు గురి చేస్తుంది. పసి పిల్లల మరణాలను పెంచుతుంది; ఆయుష్షును తగ్గిస్తుంది; జీవన ఉత్తేజాన్ని నీరుగారుస్తుంది; శరీరాన్ని బలహీనం చేస్తుంది; స్ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తుంది; కలలను నాశనం చేస్తుంది.
  • భారత విముక్తి పోరాటంలో మిగిలిపోయిన భాగం ఏమిటంటే… దరిద్రం నుండి విముక్తి.
  • భారత్, అమెరికాలు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలే అయినా, సామాజిక మరియు ఆర్ధిక అసమానతలు అన్న పెను రక్కసి బారిన పడ్డాయి.
  • ఆర్ధిక వ్యవస్ధను ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఈ రెండు దేశాలకు ఉన్నది. ఈ గమ్యం చేరనంతవరకు అసమానతలతో పోరాడవలసిన లక్ష్యం అసంపూర్తిగానే ఉండిపోతుంది.
  • భారత జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర అందులో లేకుండా పోయింది.
  • అహింసాయుత పోరాటం, ఆక్రమణకు వ్యతిరేకంగా సైనిక ప్రతిఘటన… ఈ రెండు సాధనాల ద్వారా ఇండియా ఉనికిలోకి వచ్చింది. వలస పాలన నుండి స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో ఈ రెంటి పాత్ర ఉంది. కనీస సంఖ్యలో ఆయుధాలు చేపట్టడం ద్వారా కూడా యుద్ధాలు గెలవొచ్చని గాంధీ చూపారు. ఆ ‘కనీస ఆయుధాలు’ అన్న పాత్రను బోస్ పోషించారు. ఆ సంగతి విస్మరణకు గురయింది.
  • ఒక మిలట్రీ కమాండర్ గా శ్వేత జాత్యహంకారంపై మండేలా జరిపిన సాయుధ పోరాటాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే బోస్ మిత్రుడుగా గాంధీ పాత్రను గుర్తించాలి. వారిద్దరు ఒకరినొకరు (పరోక్షంగా) ఎలా తోడ్పడ్డారో గుర్తించాలి. మూలాల నుండి ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం ప్రారంభించాలని, అందరికి సమాన హక్కులు ఇవ్వాలని మహాత్మా, నేతాజీ ఇద్దరూ నమ్మారు.

(ఇది అవగాహన కోసం మాత్రమే. జెస్సీ జాక్సన్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించాలని లేదు. -విశేఖర్)

2 thoughts on “ఇండియా, గాంధీ, బోస్… జెస్సీ జాక్సన్ అభిప్రాయాలు

  1. జాక్సన్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించాలని లేదు…అంటూ మాలో సందేహాలు లేవనెత్తారు.
    మీ అభిప్రాయాలు ఏమిటో సంక్షిప్తంగా రాసి ఉండకూడదా శేఖర్ గారు.

  2. చందుతులసి గారూ, సంక్షిప్తంగా రాయగల అభిప్రాయాలూ కాదివి. అందుకే రాయలేదు. అదీకాక జాక్సన్ తాకిన కొన్ని అంశాలను సందర్భానుసారంగా ఇప్పటికే చర్చించి ఉన్నాను.

వ్యాఖ్యానించండి