అమెరికా: ఆర్ధిక కష్టాలతో మిలట్రీ ఖర్చుల కోత


“మన కోశాగార (ఆదాయం) సవాళ్ళ పరిమాణం యొక్క వాస్తవికతను గుర్తించే బడ్జెట్ ఇది. మనం ఉంటున్న ప్రమాదకరమైన ప్రపంచంలో, ఈ దేశపు భద్రతను కాపాడుకోవడంలో మనకి గల కీలక పాత్ర నేపధ్యంలో, అస్ధిరమైన ప్రపంచ పరిస్ధితులకు తగిన విధంగా రూపొందించిన బడ్జెట్” అని 2015 సం రక్షణ బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ చక్ హెగెల్ చెప్పారని సి.ఎన్.ఎన్ తెలిపింది. “మునుముందు ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మనం ముందున్న వాస్తవికత అదే” అని ఆయన నిర్మొహమాటంగా అమెరికా మిలట్రీ భవిష్యత్తును ఆవిష్కరించారు.

రక్షణ బడ్జెట్ తగ్గించుకునే కార్యక్రమం హెగెల్ ముందు నుండే ప్రారంభం అయింది. చక్ హెగెల్ కు ముందు రక్షణ కార్యదర్శిగా రాబర్ట్ గేట్స్ పని చేశారు. ఆయన హయాంలోనే బడ్జెట్ కి పరిమితులు విధించుకుంటూ వచ్చారు. రాబర్ట్ గేట్స్ హయాంలో ఆధునీకరణ మాటున బడ్జెట్ తగ్గించుకోగా ఇప్పుడు ఆ ముసుగు కూడా తొలగించుకుని వాస్తవికతను అంగీకరించక తప్పదన్న సత్యాన్ని బాహాటంగానే చెప్పేస్తున్నారు. అంటే ఇక ఎంతమాత్రం వాస్తవాలను దాచిపెట్టుకోలేని పరిస్ధితికి అమెరికా ఆర్ధిక స్ధితి చేరుకుందని అంగీకరించినట్లే. వాస్తవికతకు అనుగుణంగా అమెరికా తనను తాను మార్చుకుంటున్న దిశలో నూతన దశకు చేరుకున్నామని చక్ హెగెల్ చెబుతున్నారు. గడ్డు పరిస్ధితిని కూడా అందంగా, ఆడంబరంగా, గంభీరంగా చెప్పుకోవడం అన్నమాట!

13 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా యుద్ధ భారం లేని బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చక్ హెగెల్ చెప్పడం విశేషం. 2014 డిసెంబర్ నాటికి ఆఫ్ఘన్ నుండి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని ఒబామా ఇప్పటికే ప్రకటించారు. ఈ గడువు ముగిశాక కూడా 10 నుండి 20 వేల వరకు సైనిక బలగాలను ఆఫ్ఘనిస్తాన్ లో ఉంచడానికి అమెరికా-ఆఫ్ఘన్ ల మధ్య ఒప్పందం కుదరవలసి ఉంది. ఈ ఒప్పందాన్ని ఆఫ్ఘన్ గిరిజన తెగల మహాసభ ‘లోయ జిర్గా’ ఆమోదించినప్పటికీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాత్రం సంతకం పెట్టలేదు.

దేశంలో ఉండే బలగాలకు ఆఫ్ఘన్ ప్రజల ఇళ్ళల్లో చొరబడి దాడులు చేసే హక్కు కావాలని ఒబామా కోరుతుండగా తాను అందుకు అభ్యంతరం చెబుతున్నానని కర్జాయ్ చెబుతున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పౌరులపై దురాగతాలకు పాల్పడే అమెరికా సైనికులను ఆఫ్ఘన్ చట్టాల ప్రకారం శిక్షించే అవకాశం ఉండాలని కర్జాయ్ కోరుతుండగా దానికి అమెరికా ఒప్పుకోవడం లేదు. ఈ అంశాల దగ్గర పీటముడి పడిపోవడంతో హమీద్ కర్జాయ్ సంతకం పెట్టకుండా హఠం వేశాడు. సంతకం పెట్టడం ఆలస్యం అయితే తమ బలగాలను పూర్తిగా ఉప్సంహరిస్తామని ఇక ఆఫ్ఘన్ రక్షణ బాధ్యత ఆఫ్ఘన్ ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరిస్తున్నా కర్జాయ్ పట్టించుకోలేదు.

కోతల అనంతరం మిలట్రీ బడ్జెట్ గతం కంటే తగ్గిపోతుందని సైనికుల సంఖ్య కూడా తగ్గించేస్తారని తెలుస్తోంది. ప్రత్యేక ఎత్తుగడల బలగాన్ని పటిష్టం చేసుకునేవైపుగా కృషి పెంచుతారని నెబ్రాస్కా మాజీ సెనేటర్ కూడా అయిన హెగెల్ ని ఉటంకిస్తూ సి.ఎన్.ఎన్ తెలిపింది. “మా విశ్లేషణలో ఏమి తేలిందంటే ఈ ఎత్తుగడల బలగాలకు (tactical force) భారీ పోరాట యుద్ధంలో దాడిని తిప్పికొట్టే సామర్ధ్యం ఉంటుంది -ఉండి తీరాలి కూడా. అదే సమయంలో శత్రువుకు వ్యతిరేకంగా వాయు, నావికా బలగాలకు మద్దతుగా మరో యుద్ధరంగంలో మద్దతుగా నిలవడం లోనూ, దేశ భద్రతలోనూ సైనిక బలగాలు నిమగ్నం కావాలి” అని హెగెల్ తెలిపారు.

జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్టిన్ డెంప్సే ఆమోదం కూడా పొందిన బడ్జెట్ కోతలు కాంగ్రెస్ (దిగువ సభ లేదా ప్రతినిధుల సభ) నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా జాన్ మెక్ కెయిన్ లాంటి యుద్ధ పిపాసులతో నిండి ఉండే రిపబ్లికన్ పార్టీ నుండి విమర్శలు, ప్రతిఘటన తప్పనిసరి. అమెరికా ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా, అమెరికా అక్రమ యుద్ధాల్లో ఎంతమంది విదేశీ అమాయక పౌరులు బలయినా అమెరికా ఆధిపత్యం కొనసాగాలంటే దురాక్రమణ యుద్ధాలు తప్పనిసరి అని ఈ యుద్ధ పిచ్చోళ్ళ నిశ్చితాభిప్రాయం.

2016 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేస్తాడని భావిస్తున్న సెనేటర్ (ఫ్లోరిడా) మార్కో రుబియో చక్ హెగెల్ ప్రకటించిన కోతలను అప్పుడే ప్రశ్నిస్తున్నాడు కూడా. అమెరికా భద్రతకు ప్రమాదాలు పెరుగుతున్నాయనీ, ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై కేంద్రీకరించాలన్న పధకం ఒక పక్క ఉండగా మిలట్రీ బడ్జెట్ కోతలు ఎలా విధిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ‘మిలట్రీ బడ్జెట్ కోతలకు ఎలాంటి వ్యూహాత్మక అర్ధమూ లేదు’ అని ఆయన దుయ్యబట్టాడు.

ఏమిటా కోతలు?

అయితే అమెరికా ఆర్ధిక పరిస్ధితి పట్ల అవగాహన ఉన్నవారు మాత్రం కోతలు తప్పని పరిస్ధితిని గుర్తిస్తున్నారు. కోతలు సరైన చోట విధిస్తున్నారా లేదా అన్న సంగతి పక్కనబెడితే మొత్తం మీద కోతలు తప్పవని వారు అంగీకరిస్తున్నారు. అనేకమంది మాజీ మరియు ప్రస్తుత సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు వారిలో ఉన్నారు.

  • నిజానికి మిలట్రీ బడ్జెట్ కోతలకు సంబంధించి  గత డిసెంబర్ లోనే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. దీని ప్రకారం 2014లో మిగిలి ఉన్న సంవత్సరానికి 500 బిలియన్ డాలర్లకు, 2015 మొత్తానికి మరో 500 బిలియన్లకు రక్షణ బడ్జెట్ పరిమితం చేయాలి.
  • శక్తివంతమైన చిన్న సైన్యం అన్న సూత్రానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించామని చక్ హెగెల్ చెప్పారు.
  • భద్రమైన, రక్షణాత్మకమైన, ఆధారపడదగిన, సమర్ధపూర్వకమైన అణు బలగాలలో మరిన్ని ముఖ్యమైన పెట్టుబడులు పెట్టాలి.
  • అన్ని మిలట్రీ బలగాల -రిజర్వ్ బలగాలు మరియు చురుకుగా విధుల్లో ఉండే బలగాలు- సంఖ్యను తగ్గించాలి.
  • ప్రస్తుతం అమెరికా సైనిక బలగాల సంఖ్య 520,000. ఈ సంఖ్యను 440,000 నుండి 450,000 వరకు తగ్గించాలి. (సెప్టెంబర్ 11, 2001 దాడుల సమయంలో అమెరికా బలగాల సంఖ్య అత్యధికంగా 570,000 ఉన్నది.) ఈ తగ్గింపు అమలయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత తక్కువ సైనిక బలగాలున్న దశకు అమెరికా చేరుతుంది.
  • సైబర్ వార్, ప్రత్యేక బలగాల కార్యకలాపాల బడ్జెట్ లో కోత ఉండదు. అవి యధావిధిగా కొనసాగుతాయి.
  • ఖరీదైన, వివాదాస్పదమైన F-35 ఫైటర్ జెట్ల తయారీ కొనసాగుతుంది.
  • 40 సం.ల నాటి A-10 యుద్ధ విమానాలను విధుల నుండి తప్పించాలి. తద్వారా 5 యేళ్లలో 3.5 బిలియన్ డాలర్లు పొదుపు చేయాలి.
  • ప్రపంచ వ్యాపితంగా ఉన్న వివిధ ఎంబసీల వద్ద రక్షణకు 900 మంది మెరైన్ సైనికులను నియమించాలి.
  • ప్రత్యేక బలగాల సంఖ్యను 66,000 నుండి 69,700 కు పెంచాలి.
  • ఈ లెక్కల ప్రకారం యాక్టివ్-డ్యూటీ బలగాల సంఖ్య 13 శాతం తగ్గించినట్లవుతుంది. అలాగే రిజర్వ్ బలగాలను 5 శాతం తగ్గించినట్లు, ప్రత్యేక బలగాలను 6 శాతం పెంచినట్లు అవుతుంది.
  • మిలట్రీ బలగాలకు ఇస్తున్న వివిధ సదుపాయాలలో కోత విధించాలి. అనగా ఇళ్ళు, వైద్య ఖర్చుల కోసం సైనిక ఉద్యోగులు మరింత భారం మోయాల్సి ఉంటుంది.
  • అమెరికా సైనిక స్ధానవరాల్లో నిత్యావసర సరుకులకు ఇచ్చే సబ్సిడీలలో కోతలు విధించాలి.
  • ప్రతిపాదిత కోతలను 2016 తర్వాత కూడా కొనసాగించలేని పక్షంలో సైనికుల తగ్గింపు మరింత తీవ్రం చేయాలి. దానివల్ల అమెరికా జాతీయ భద్రతకు గణనీయ స్ధాయిలో ప్రమాదం ఏర్పడవచ్చు.
  • గత డిసెంబర్ లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఈ యేడు, వచ్చే యేడు కోతల్లో స్వల్ప రాయితీ ఇవ్వవచ్చు.
  • సైనిక బలగాలపై ఆధారపడడం తగ్గించి సైబర్ వార్, ప్రత్యేక బలగాలపై ఆధారపడడం పెరగాలి.

వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక విశ్లేషణ ప్రకారం హెగెల్ ప్రకటించిన మిలట్రీ బడ్జెట్ ఆఫ్ఘన్ యుద్ధం నుండి కేంద్రీకరణ తగ్గించడానికీ, చైనాపై సైబర్ దాడులను తీవ్రం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఆల్-ఖైదా, మరియు అనుబంధ గ్రూపుల నుండి ప్రమాదం ఎదుర్కోవడం ముఖ్య లక్ష్యంగా చేసుకుంది. కానీ వాస్తవం ఏమిటంటే ఆల్-ఖైదా అన్నది అమెరికాకు వ్యూహాత్మక మిత్రుడే తప్ప శత్రువు కాదు. అసలు ఆల్-ఖైదా శక్తులు అమెరికా ఆదేశాల మేరకు టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతుంటే వారిని సాకుగా చూపిస్తూ ఆయా దేశాల్లోని జాతీయ పోరాట శక్తుల పైన ఆల్-ఖైదా ముద్ర వేసి డ్రోన్ దాడులకు, సి.ఐ.ఏ కుట్రలకు తెగబడడం అమెరికా అనుసరించే లోతైన, పైకి కనపడని ప్రపంచాధిపత్య వ్యూహం.

కాబట్టి అమెరికా మిలట్రీ బలం ఎంత తగ్గితే ప్రపంచ అంత ఎక్కువ భద్రంగా ఉందనే అర్ధం. కాబట్టి అమెరికా మిలట్రీ బడ్జెట్ కోతలు ప్రపంచానికి శుభవార్త.

One thought on “అమెరికా: ఆర్ధిక కష్టాలతో మిలట్రీ ఖర్చుల కోత

వ్యాఖ్యానించండి