అన్నా హజారే రాజకీయం -కార్టూన్


Didi does needfull

“అవినీతి వ్యతిరేక పోరాటాన్ని నేను తేలిక చేసేశాను – మన దీదీని ఎన్నుకోండి చాలు – ఇక అవసరమైందంతా ఆమె పూర్తి చేసేస్తారు…”

***

రాజకీయాలు తనకు సరిపడవని చెబుతూ అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నారు. మొదట అరవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పి కూడా కిరణ్ బేడీ మంత్రాంగంతో ఆయన వెనక్కి తగ్గారు. పైగా ఎన్నికల్లో తన పేరు వినియోగించడానికి వీలు లేదంటూ ఆప్ పార్టీపై ఆంక్షలు విధించారు. తన పేరును అక్రమంగా ఉపయోగించుకుంటున్నారని, తన పేరు చెప్పి వసూళ్లు చేస్తున్నారని కూడా ఆప్ పైన ఆయన ఆరోపణలు గుప్పించారు.

అలాంటి రాజకీయ విద్వేషపరుడు ఈ రోజు ఒక రాజకీయ పార్టీకి ప్రచారం కూడా చేస్తానని ప్రకటించడం ఎలా అర్ధం చేసుకోవాలి? కాంగ్రెస్, బి.జె.పిలు సంయుక్తంగా ఆమోదించిన జన్ లోక్ పాల్ బిల్లును గతంలో కోరలు లేనిదిగా తానే చెప్పిన అన్నా తీరా చట్టాన్ని ఆమోదించాక అంతకంటే గొప్ప చట్టం లేదు పొమ్మన్నారు.

కేంద్రం తెచ్చిన జన్ లోక్ పాల్ ను విమర్శించినందుకు అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన తప్పు పట్టారు కూడా. ఆ దెబ్బతో అన్నా హజారే అవినీతి వ్యతిరేకతలోని పస ఏపాటిదో అర్ధం కాగా మమతా బెనర్జీకి ఆయన ఇస్తున్న మద్దతుతో తానేమిటో ఆయన మరింతగా చాటుకున్నట్లు అయింది.

ఎంత విచిత్రం అంటే మమతా బెనర్జీ పార్టీ దేశం అంతటా 100 మంది లోక్ సభ అభ్యర్ధులను నిలబెట్టడానికి సాయం చేస్తానని అన్నా ప్రకటించేశారు. తన అభ్యర్ధులు బెంగాల్ బయట టి.ఎం.సి అభ్యర్ధిగా లేదా స్వతంత్ర అభ్యర్ధిగా నిలబెడతానని కూడా ఆయన చెప్పారు. తాను నాలుగు నెలల క్రితమే 17 అంశాలపై ముఖ్యమంత్రులందరికి లేఖలు రాశానని కేవలం మమతా బెనర్జీ మాత్రమే తన లేఖకు స్పందించారు కనుక తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. అదే నోటితో అరవింద్ కేజ్రీవాల్ తన లేఖకు స్పందించలేదు కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చేదీ లేదని అదే నోటితో చెప్పారు.

ఇంత భారీ మద్దతు మమతా బెనర్జీకి ఇవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే ఆమె నిరాడంబర జీవనం ఆయనకు నచ్చిందట. దేశం కోసం ఆమె ఎంతో త్యాగం చేశారట. అందుకే మద్దతు ఇస్తారట! ఇంతకీ ఆమె చేసిన త్యాగం ఏమిటో ఆయన చెప్పలేదు.

మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించినందుకు వివిధ మహిళా సంఘాలు షాక్ అయ్యామని తెలిపాయి. పశ్చిమ బెంగాల్ లో ఆ మధ్య వరుసగా జరిగిన అత్యాచారాల కేసుల పట్ల ఆమె స్పందించిన తీరు అంత భేషుగ్గా ఉంది మరి. మహిళలపై జరిగిన అత్యాచారాలను కూడా తన ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రగా చెప్పగల మహిళా రత్నం, త్యాగమయి మన మమతా దీదీ. అలాంటి త్యాగశీలికి సత్యాగ్రహి అన్నా మద్దతు!

వినేవాళ్ళు ఉండాలే గానీ…

One thought on “అన్నా హజారే రాజకీయం -కార్టూన్

  1. ఏమైనా చెబుతారు కదాండి. మన దగ్గర జగన్ మాత్రం ఏ పాపం చేశారు. ఆయన పార్టీకి కూడా హజారే మద్దతు ఇవ్వొచ్చు కదా….

వ్యాఖ్యానించండి