ఇటలీ, ఇ.యు ల నుండి వచ్చిన ఒత్తిడికి భారత ప్రభుత్వం తల వంచినట్లు కనిపిస్తోంది. పైరసీ చట్టాన్ని ప్రయోగించడం లేదని కేంద్రం ఈ రోజు సుప్రీం కోర్టుకు తెలిపింది. యాంటీ-పైరసీ యాక్ట్ (సముద్ర దోపిడి వ్యతిరేక చట్టం) ప్రకారం తమ మెరైన్ సైనికులను విచారించడానికి ఇండియా సిద్ధపడడం పట్ల ఇటలీతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తాను అనుకున్నట్లుగా ఇండియా ముందుకు వెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవని, తగిన ప్రతిస్పందన ఖాయం అనీ ఇటలీ ప్రభుత్వం, ఇ.యు నేతలు ప్రకటించారు.
ఇటలీ అయితే ఇండియాలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది కూడా. ఇటలీ మెరైన్ల కేసులో వెనక్కి తగ్గేది లేదని రక్షణ మంత్రి ఆంటోని ఆర్భాటంగా ప్రకటించిన మరుసటి రోజే భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పోతున్న సూచనలు వెలువడడం గమనార్హం.
కేరళ తీరం వెంబడి చేపలవేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ఎన్రికా లెక్సి పై ఉన్న ఇటలీ మెరైన్లు కాల్పుల్ జరపడంతో ఇద్దరు భారతీయులు చనిపోయిన సంగతి తెలిసిందే. 2012లో జరిగిన ఈ ఘటనపై మొదట కేరళ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం కేసు హై కోర్టు పరిధిలోనిది కాదని చెబుతూ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇది 2013 ప్రారంభం నాటి సంగతి. సుప్రీం ఆదేశాలు వెలువడి సంవత్సరం పూర్తయినా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తర్వాత సంగతి, కనీసం ఏ సెక్షన్ కింద విచారించాలో కూడా కేంద్రం తేల్చలేదు. దానితో ఇటలీ, ఇ.యు లు తీవ్ర అసంతృప్తి ప్రకటిస్తూ వచ్చాయి.
ఎట్టకేలకు కేంద్రం తమ నిర్ణయాన్ని ఈ రోజు (ఫిబ్రవరి 24) సుప్రీం కోర్టుకు తెలిపింది. ముందు చెప్పినట్లుగా యాంటీ పైరసీ చట్టం అయిన ఎస్.యు.ఏ చట్టం పరిధిలోకి ఈ కేసు రాదని తాము భావిస్తున్నట్లుగా తెలిపింది. ఎస్.యు.ఏ చట్టం ప్రయోగానికి సంబంధించి ఇటలీ, ఇండియాల మధ్య తలెత్తిన వైరుధ్యం పరిష్కారం అయిందని, న్యాయ శాఖ మంత్రి సూచన మేరకు పైరసీ చట్టం ఈ కేసుకు వర్తించదని నిర్ణయించామని తెలిపింది. కానీ భారత ప్రభుత్వం ఇన్నాళ్లూ చెప్పింది ఇది కాదు. ఎస్.యు.ఏ చట్టం వర్తిస్తుందని చెబుతూ వచ్చింది. ఈ చట్టం కింద గరిష్టంగా మరణ శిక్ష విధించవచ్చు.
తమ మెరైన్లకు మరణ శిక్ష చట్టం వర్తింప జేయడం పట్ల ఇటలీ, ఇ.యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరణ శిక్ష విధించబోమని కేంద్రం హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఎస్.యు.ఏ చట్టం కిందే విచారిస్తామని తెలిపింది. కేంద్రం ప్రకటన బట్టి కనీస శిక్ష 10 సం.ల కారాగారం విధించడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు పత్రికలు, విశ్లేషకులు ఊహాగానాలు చేశారు. ఈ ఊహలను తలకిందులు చేస్తూ అసలు ఎస్.యు.ఏ చట్టమే వర్తించదు పొమ్మని కేంద్రం జెల్ల కొట్టింది.
న్యాయ శాఖ మంత్రి సూచనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి నేడు సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే ఒక డిమాండ్ సాధించుకున్న ఇటలీ ప్రభుత్వం మరో కొత్త డిమాండ్ ను కోర్టు ముందు ఉంచింది. కేసును విచారిస్తున్న భారత కేంద్ర విచారణ సంస్ధ ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ’ కి ఇటలీ మెరైన్ల కేసును విచారించే పరిధి లేదని అభ్యంతరం తెలిపింది.
“ఎన్.ఐ.ఏ సంస్ధ ఐ.పి.సి పరిధిలోని నేరాలను విచారించడానికి లేదు. మొత్తం విచారణని ఎన్.ఐ.ఏ నిర్వహించింది. కానీ చట్టం ప్రకారం దానికి ఆ పరిధి లేదు” అని ఇటలీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న ముకుల్ రోహ్తగి సుప్రీం కోర్టుకు నివేదించారు. ఈ వాదనను కేంద్రం తోసిపుచ్చింది. ఎన్.ఐ.ఏ కి తగిన పరిధి ఉందని, చట్టం ప్రకారమే ఆ సంస్ధ విచారిస్తోందని తెలిపింది.
తాజా వైరుధ్యంతో కేసు ఎన్.ఐ.ఐ పరిధి మీదికి మళ్ళింది. ఎన్.ఐ.ఏ పరిధికి సంబంధించిన వాదనలు చేపట్టడానికి వీలుగా ఇటలీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇటలీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నాక మరో వారం రోజుల్లో కేంద్రం దానికి స్పందించాలని ఆదేశించింది. ఎస్.యు.ఏ సమస్య పరిష్కారం అయిందనుకుంటే ఇప్పుడు ఎన్.ఐ.ఏ పరిధి సమస్య కొత్తగా రంగప్రవేశం చేసింది. ఇటలీ వాదనను భారత ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుందన్నది వేచి చూడాల్సిన విషయం.

ఇంక ఈ ఇటాలియన్ మెరైన్ సైనికులకు ఇతోధికంగా సత్కారం అందజేసి (వీలైతే పద్మభూషణ్ లేదే అంతకన్న పెద్ద)బిరుదులిచ్చి సగౌరవంగా వీడ్కోలు పలకటమే మిగిలిన కార్యక్రమం. (వారి మన ఏలిక సోనియాగారి దేశంవారు కదా మరి!)