GSAT, GISAT ల మధ్య తేడా ఏమిటి?


Geostationary orbit

Geostationary orbit

శ్రీవిద్య:

GSAT మరియు GISAT ల మధ్య ఉన్న తేడా ఏమిటో వివరించగలరు?

సమాధానం:

GSAT అంటే జియో సింక్రొనస్ శాటిలైట్ (Geosynchronous Satellite) అని అర్ధం.

GISAT అంటే GEO ఇమేజింగ్ శాటిలైట్ (GEO Imaging Satellite) అని సాధారణ అవగాహనగా చెబుతారు. అయితే శాస్త్రీయంగా ఖచ్చితంగా చెప్పాలంటే దీని పూర్తి నామం ‘Geostationary Hyperspectral Imager Satellite’.

వివరాల్లోకి వెళ్తే:

GSAT ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ISRO దేశీయంగా అభివృద్ధి చేసిందని చెబుతారు. కానీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం అని చెప్పడం సరికాదనీ, దిగుమతి చేసుకున్న పరికరాలు కూడా మనవాళ్లు వాడతారని గుసగుసలు వినిపిస్తుంటాయి. వివిధ ప్రసార సేవలను అందించడంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ఇప్పటిదాకా 10 GSAT లను ఇస్రో ప్రయోగించింది. వీటిలో కొన్ని మాత్రమే సేవలు అందిస్తున్నాయి. కొన్నింటిని డీ కమిషన్ చేసుకోగా మరికొన్ని విఫలం అయ్యాయి. ఇప్పటికీ విదేశీ ట్రాన్స్ పాండర్లపై కొన్ని భారత కమ్యూనికేషన్ సేవలు ఆధారపడి ఉన్న మాట వాస్తవం.

మనవంటూ చెప్పుకునే GSAT లలో మొత్తం 168 ట్రాన్స్ పాండర్లు ఉండగా వాటిలో 95 ట్రాన్స్ పాండర్లను ప్రైవేటు ప్రసార సాధన కంపెనీలకు కేటాయించారు. C బ్యాండ్ (విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్ లోని ఒక భాగాన్ని ఇలా పిలుస్తారు. సాధారణంగా మెగా హార్ట్జ్ -MHz- లలో కొలుస్తారు), Ku బ్యాండ్ (K బ్యాండ్ కి దిగువన ఉండే విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్ కు ఉన్న పేరు. సాధారణంగా గిగా హర్ట్జ్ -GHz- లలో కొలుస్తారు) లలో సేవలు అందించే ఈ ట్రాన్స్ పాండర్లను టెలీ కమ్యూనికేషన్ సేవలు, టి.వి ప్రసారాలు, వాతావరణ అంచనాలు, ప్రకృతి విలయాలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు తదితర సేవలకు వినియోగిస్తారు.

జియో సింక్రొనస్ ఆర్బిట్ లో తిరిగేలా నిర్దేశిస్తారు కాబట్టి వీటిని జియో సింక్రొనస్ శాటిలైట్ అంటారు. అనగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గం.ల సమయం తీసుకుంటుంది కదా. GSAT లు కూడా సరిగ్గా ఇదే వేగంతో తిరిగేలా నిర్దేస్తారు. భూ పరిభ్రమణ వేగంతో సింక్రొనైజ్ అయ్యేలా నిర్దేస్తారు కనుక జియో సింక్రొనస్ అయింది. ఈ లక్షణం వల్ల ఈ ఉపగ్రహం తనకు నిర్దేశించిన స్ధలంలోనే కదలకుండా ఉన్నట్లుగా భూమి పై ఉన్నవారికి తోస్తుంది. అందువలన గ్రౌండ్ స్టేషన్ లో ఉన్నవారికి శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది.

జియో సింక్రొనస్ ఆర్బిట్ లో ఒక ప్రత్యేక రకం ఉంది. భూమధ్య రేఖకు సరిగ్గా పైన ఉండేలా శాటిలైట్ ను నిర్దేశిస్తే దాని ఆర్బిట్ ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. GISAT లను ఇలాంటి ఆర్బిట్ లో ప్రవేశపెడతారు. GISAT ప్రధాన పని కొద్ది నిమిషాల వ్యవధుల్లో నిర్దేశించిన ప్రాంతాలకు సంబంధించిన భారీ ఇమేజ్ లను భూమిపై ఉండే గ్రౌండ్ స్టేషన్ కు పంపించడం.

2016-17 లో ప్రయోగించడానికి వీలుగా GISAT నిర్మిస్తున్నామని ఇస్రో కొద్ది వారాల క్రితం ప్రకటించింది. ఇది భూమి ఉపరితాళానికి 36,000 కి.మీ దూరంలోని కక్ష్యలో ప్రవేశపెడతారని సమాచారం. ప్రతి 5 నిమిషాల కొకసారి ఇమేజ్ లను పంపే ఏర్పాటు చేస్తున్నందున వాస్తవంగా ఏమి జరుగుతున్నదో 5 నిమిషాల తేడాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ అంశాల ద్వారా మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే GSAT, GISAT ల మధ్య కక్ష్య విషయంలోను, వినియోగం విషయంలోనూ తప్ప భారీ తేడాలు లేవు. అయితే ఈ కక్ష్యలో మార్పు వల్లనే ఫలితాల్లో భారీ తేడా ఉంటుంది. GSAT లద్వారా పొందే ఇమేజిలు తక్కువ రిసోల్యూషన్ ఉంటే GISAT ఇమేజిల రిసోల్యూషన్ వందల మీటర్ల నుండి కి.మీటర్ల వరకు ఉంటుంది. GISAT ఇమేజిల వ్యవధి తక్కువ కనుక రియల్ టైమ్ పరిణామాలు గమనించవచ్చు.

2 thoughts on “GSAT, GISAT ల మధ్య తేడా ఏమిటి?

  1. విశేఖర్ గారు. మీరు సైన్స్ టెక్నాలజీ ని కూడా బాగా వివరిస్తున్నారే. తెలుగులో సైన్స్ టెక్నాలజీ గురించి అర్ధమయ్యేలా చెప్పే వాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. వీలైనప్పుడల్లా అటువంటి సైన్స్ సంగతులు కూడా వివరించగలరు. సీరియస్ రాజకీయాల మధ్యలో ఆటవిడుపుగానూ ఉంటుంది. నాలుగు సైన్స్ విషయాలు కూడా తెలుసుకున్నట్లు ఉంటుంది. ధన్యవాాదాలు.

వ్యాఖ్యానించండి