ప్రశ్న: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై రాద్ధాంతమేల?


parl

ఉమేష్ పాటిల్:

హాయ్ సర్, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాం అని ప్రభుత్వం, ప్రవేశపెట్టలేదు అని ప్రతిపక్షం వాళ్ళు అన్నారు కదా.

1)అసలు దానికి అంత రాద్ధాంతం ఎందుకు?

2) ప్రవేశపెట్టింది మళ్ళీ ప్రవేశపెట్టలేమా?

3) అసలు ప్రవేశపెడితే ఏమి జరుగుతుంది?

4) మళ్ళీ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలిపింది?

సమాధానం:

1) ప్రవేశపెట్టడం పైనే అంత రాద్ధాంతం చేయడానికి ప్రధాన కారణం వివిధ పార్టీలకు ఉన్న రాజకీయ స్వార్ధ ప్రయోజనాలు. తెలంగాణ వ్యతిరేకులు బిల్లును ఏదో రకంగా అడ్డుకోవాలన్న ప్రయత్నంలో ఈ వివాదాన్ని రేపారు. బి.జె.పి, సి.పి.ఐ పార్టీలు తెలంగాణకు అనుకూలమే అయినా వారు కూడా స్పీకర్ వద్దకి వెళ్ళడం ద్వారా వివాదాన్ని పెంచారు. వారు చెప్పిన కారణం పార్లమెంటరీ ప్రక్రియల్లో ఇది చెడ్డ సంప్రాదాయంగా స్ధిరపడుతుందేమో అని.

ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి అవసరమైన రాజ్యాంగ బద్ధ ప్రక్రియను, బిజినెస్ రూల్స్ ను సక్రమంగా పాటించకపోతే భవిష్యత్తులో ఇంకా ముఖ్యమైన బిల్లులను కూడా అధికార పక్షాలు ఈ విధంగా తూతూ మంత్రంగానో లేదా మోసపూరితంగానో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయవచ్చన్నది వారి అభ్యంతరం. 

అయితే షిండే ప్రభృతులు చెప్పిన సమాధానం, అలాంటిదేమీ జరగలేదని. తప్పుడు సంప్రదాయాలు నెలకొల్పినట్లు అవుతుందేమో అన్న అనుమానాలు రగిలే విధంగా ఏమీ జరగలేదనీ ఎప్పుడూ చేసే పద్ధతుల్లోనే బిల్లు ప్రవేశపెట్టామని వారు చెప్పారు.

సాధారణంగా బిల్లు ప్రవేశపెట్టే ముందు స్పీకర్ సభ అనుమతి కోరతారు. ఇది మూజువాణీ ఓటు ద్వారా జరుగుతుంది. బిల్లు ప్రవేశపెట్టడానికి అంగీకరించేవారు Aye అనాలని అడుగుతారు. అంగీకరించేవారు అంతా ‘Aye’ అని అరుస్తారు. వ్యతిరేకించేవారు No అనాలని స్పీకర్ అడుగుతారు. ఆ విధంగానే వ్యతిరించే సభ్యులు ‘No’ అని అరుస్తారు. దీనినే మూజువాణి ఓటు అనీ, Voice vote అనీ అంటారు.

దీనికి ముందు బి.ఏ.సి సమావేశంలో సభ ఎజెండాపై ఆయా పార్టీల అభిప్రాయాలని స్పీకర్ తీసుకుని ఉంటారు. అక్కడ వెల్లడి అయ్యే అభిప్రాయాల ద్వారా ఏయే పార్టీలు ఒక బిల్లు ప్రవేశాన్ని అనుకూలించేదీ, వ్యతిరేకించేది స్పీకర్ కి ఒక అవగాహన వస్తుంది. వివిధ రాజకీయ పార్టీల సభ్యుల సంఖ్య స్పీకర్ కి తెలుసు గనక సభలో బిల్లుకు అనుకూలంగా ఉండే పక్షాల సభ్యులు ఎక్కువగా ఉంటే సభ అనుకూలంగా ఉంది అన్న నిశ్చయానికి స్పీకర్ వస్తారు. వ్యతిరేకంగా ఉండే సభ్యులు ఎక్కువగా ఉంటే వ్యతిరేకంగా ఉంది అన్న నిర్ణయానికి వస్తారు. దీనిని మూజువాణి ఓటు సమయంలోలో పరిగణలోకి తీసుకుంటారు.

లోక్ సభ సమావేశాలకు ముందు జరిగిన బి.ఏ.సి సమావేశంలో కాంగ్రెస్, బి.జె.పి లు తెలంగాణ బిల్లు ప్రవేశానికి అనుకూలత తెలిపాయి. ఇక లాంఛనంగా సభ అభిప్రాయాన్ని కొరడమే మిగిలింది. అది మూజువాణి ఓటుతో పూర్తి చేయాలి. స్పీకర్ మీరా కుమార్ హోమ్ మంత్రిని బిల్లు ప్రవేశపెట్టడానికి సభ్యులను అనుమతి కోరారు. Aye, No అనాలని కోరారు. గందరగోళంలో ఇది అందరికి వినిపించలేదు, కనిపించలేదు. (కానీ ఛానెళ్లు చూపిన ప్రసారంలో స్పీకర్ అనుమతి కోరుతున్న సంగతి స్పష్టంగా కనపడింది.) పోడియం చుట్టూ వంద మంది వరకు ఎం.పిలు మూగి అరుపులు కేకలు వేస్తుంటే ఎలా వినపడుతుంది?

ఆ వెంటనే స్పీకర్ హోమ్ మంత్రి షిండేను బిల్లు ప్రవేశపెట్టాలని పిలిచారు. ఆయన లేచి బిల్లును చదవడం ప్రారంభించడం, బిల్లు లాక్కోవడానికి కొందరు, వారిని నిలువరించడానికి కొందరు ప్రయత్నించడంతో ఘర్షణ మొదలయింది. ఈ లోపు పెప్పర్ స్ప్రే జల్లారు. ఇదంతా రెండు, మూడు నిమిషాల్లో జరిగిపోయింది.

ఈ విధంగా బిల్లు ప్రవేశ పెట్టే ప్రక్రియను మొదటి రీడింగ్ గా పరిగణిస్తారు. (ఒక బిల్లు చట్టంగా రూపొందే లోపు ఉభయ సభల్లో మూడు రీడింగ్ ల చొప్పున పూర్తి చేసుకోవాలి) మొదటి రీడింగ్ ని ‘Motion for leave’ అంటారు. ఇది సక్రమంగా జరగలేదని విపక్షాలు వాదించాయి. ఇది చట్టబద్ధ ప్రక్రియ కాబట్టి సక్రమంగా చేయాలని అవి వాదించాయి. ప్రవేశపెట్టే దశలోనే అనగా మొదటి రీడింగ్ లోనే ఒక బిల్లును సభ తిరస్కరించవచ్చు. (ఢిల్లీ అసెంబ్లీలో లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టే దశలోనే కాంగ్రెస్, బి.జె.పి లు కుమ్మక్కై డివిజన్ కోరి ఓటింగ్ ద్వారా తిరస్కరించాయి. దానితో ప్రభుత్వం రాజీనామా చేసింది.)

ప్రవేశపెట్టే దశలోనే సభా కార్యక్రమాలను గందరగోళపరిస్తే వివాదం చెలరేగి బిల్లు ఆమోదాన్ని అడ్డుకోవచ్చని సీమాంధ్ర నేతలు భావించారు. వారు అనుకున్నట్లుగానే ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యంతరం తెలిపాయి. స్పీకర్ ని కలిసి బిల్లు ప్రవేశపెట్టినట్లుగా చూడొద్దని కోరాయి. అయితే స్పీకర్ ఏం చెప్పారో గానీ ఆ వివాదం సద్దుమణిగింది.

ఫస్ట్ రీడింగ్ సక్రమంగా జరగలేదని చెప్పడం ద్వారా తాము సీమాంధ్ర ఆందోళనలను కూడా పరిగణిస్తున్నామని బి.జె.పి చెప్పడలిచింది. పార్లమెంటరీ సాంప్రదాయాలను కాపాడడానికి తాము ప్రయత్నిస్తున్నామని సి.పి.ఐ లాంటి పార్టీలు చెప్పదలిచాయి. మొత్తం మీద పరస్పర అవగాహనతో ఈ వివాదాన్ని అంతటితో వదిలేశాయి.

బిల్లు ప్రవేశపెట్టాక దానిపై జరిగే చర్చను సెకండ్ రీడింగ్ గా పరిగణిస్తారు. ఇందులో రెండు దశలు ఉంటాయి. ప్రవేశ పెట్టిన బిల్లును చర్చించి ఆమోదించాలా లేక సెలెక్ట్ కమిటీ, జాయింట్ కమిటీ లాంటి కమిటీలకు రిఫర్ చేయాలా, సభ్యుల అభిప్రాయం కోసం సర్క్యులేట్ చేయాలా అన్నది నిర్ణయిస్తారు. చర్చకు నిర్ణయించినా రెండో దశలోకి ప్రవేశిస్తుంది. సెలెక్ట్ లేదా జాయింట్ కమిటీలకు ఇస్తే సదరు కమిటీల నుండి వచ్చిన బిల్లు రెండో దశలోకి ప్రవేశిస్తుంది. రెండో దశలో క్లాజుల వారీగా బిల్లును పరిగణిస్తారు.

బిల్లుపై జరిగే చర్చను ధర్డ్ రీడింగ్ గా పరిగణిస్తారు. చర్చానంతరం జరిగే ఓటింగ్ (మూజువాణీ లేదా డివిజన్) కూడా ఇందులో భాగమే.

ఈ విధంగా ఒక బిల్లు మూడు రీడింగ్ లను సక్రమంగా బిజినెస్ రూల్స్ కి అనుగుణంగా పూర్తి చేసుకుంటే సంతకం కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. అనంతరం గెజెట్ ప్రచురణ ద్వారా చట్టం అవుతుంది. మూడు రీడింగ్ లు చట్టబద్ధ ప్రక్రియలు కాబట్టే రాద్ధాంతం. అందులోకి రాజకీయ ప్రయోజనాలు జొరబడితే చేయాల్సినంత కంగాళీ చెయ్యొచ్చు.

2) ఒకసారి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ ప్రవేశపెట్టడం పైనే వివాదం వస్తే ఆ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టవచ్చు. అందుకు ఆటంకాలు ఏమీ లేవు. తెలంగాణ బిల్లు అవసరం అనుకుంటే, సక్రమంగా ప్రవేశపెట్టలేదు అనుకుంటే మళ్ళీ ప్రవేశపెట్టడానికి సిద్ధం అని గ్రామీణ మంత్రి జైరాం రమేష్ ఒక టి.వి ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు కూడాను.

3) బిల్లు ప్రవేశపెడితే ఏం జరుగుతుందన్న ప్రశ్న మీకెందుకు వచ్చింది? ఒక చట్టం రూపొందేముందు దాని ముసాయిదాను బిల్లు అంటారు. ఉభయ సభల్లో పెట్టి చర్చించి సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతి సంతకం చేస్తారు. అప్పుడది చట్టం అవుతుంది. ఒక చట్టాన్ని చేయడానికే బిల్లును ప్రవేశపెడతారు. పార్లమెంటు ఉన్నదే అందుకు కదా. ప్రవేశపెడితే ఏం జరుగుతుందన్న ప్రశ్న ఏమిటి?

4) తెలంగాణ బిల్లు వివాదాస్పదమైన, సమస్యగా మారిన బిల్లు. దానిని ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని సీమాంధ్ర ప్రతినిధులు ఎన్నడూ లేని రీతిలో పెప్పర్ స్ప్రే జల్లడానికి కూడా తెగించారు. అలాంటిది మళ్ళీ ప్రవేశపెట్టాలంటే మరోసారి గందరగోళానికి, యుద్ధ వాతావరణానికి సిద్ధపడాలి. ఒకసారి పెప్పర్ స్ప్రే జల్లారు. రెండోసారి ఏం చేస్తారో మరి? ఇదొక విషయం.

బిల్లు సక్రమంగా ప్రవేశపెట్టలేదు, పద్ధతులు ప్రవేశపెట్టలేదు అన్న విమర్శ ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన సమస్య కూడా. ఆరు దశాబ్దాల నుండి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమైన బిల్లును సక్రమంగా ప్రవేశపెట్టలేదన్న విమర్శను అంగీకరిస్తే అంత అనుభవం ఉండి కూడా ఏదో తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే. అందుకే అంతా సక్రమంగానే చేశామని వారు వాదించారు.

6 thoughts on “ప్రశ్న: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై రాద్ధాంతమేల?

  1. vere bills to deenini polchalemu,endukante edi state reorg bill,deenini praveshpette mundu prsd anumati avasaram ,okvela malli pettalante malli prsd permission avasarama?okavela praveshpedite bill pass ayyevaraku prsd ki bill ki sambandham leda? anduke kevalam praveshpettadam valla emavutundani adigya

వ్యాఖ్యానించండి