తెలంగాణ నవ్వింది -కార్టూన్


Telangana smiles

పెద్దల సభ రాజ్య సభ ఆమోద ముద్రతో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో చివరి ఇటుకలను చేర్చింది. ఇక లాంఛనప్రాయం మాత్రమే అయిన రాష్ట్రపతి సంతకమే మిగిలింది. రాష్ట్రపతి సంతకం కూడా అయ్యాక గెజిట్ ప్రకటనతో సదరు బిల్లు చట్టంగా ఆచరణలోకి వస్తుంది.

ఉభయ సభల ఆమోదమే తెలంగాణ ఏర్పాటుకు కీలకం. అది కాస్తా పూర్తయింది. దానితో ‘నవ్వింది మల్లె చెండూ’ తరహాలో తెలంగాణ నవ్వింది. ఆ నవ్వు ఢిల్లీ పార్లమెంటు భవనం ముందు తెలంగాణ నేతల ఆనంద నృత్యాలతో విరాజిల్లింది. తెలంగాణ గడ్డ పైన కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్తుపై వారు నిర్మించుకున్న కలలు ఒక్కొక్కటీ సాకారం కావడమే ఇక మిగిలింది.

కానీ ఇల్లు అలుకగానే పండుగ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే జనం ఆశలు నెరవేరినట్లు కాదు. భౌగోళిక విభజనతోనే ప్రజల బతుకులు బాగుపడేపనైతే అది ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగినప్పుడే సాధ్యపడి ఉండేది. ప్రజల అభివృద్ధికి ఉన్న ప్రధాన అడ్డంకి భూస్వాములు, దళారీపెట్టుబడిదారీ వర్గాలే. ఈ వర్గాలే ప్రత్యేక ఉద్యమానికి నాయకత్వం వహించినందున తెలంగాణ శ్రామిక ప్రజలు మరింత నిర్ణయాత్మకమైన పోరాటం చేయక తప్పదు.

తెలంగాణ నవ్వితే సీమ, ఆంధ్ర ప్రాంతం నిండా నిరసనలు నిండినట్లు కార్టూన్ సూచిస్తోంది. కాస్తో కూస్తో నిరసన గళం విప్పిన ఎ.పి.ఎన్.జి.ఓ లు సైతం టి.ఎన్.జి.ఓ లతో కలిసి ఉమ్మడి పోరాటం చేసి ఉమ్మడి డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నేపధ్యంలో ఈ కార్టూన్ అర్ధ సత్యమే కాగలదు.

2 thoughts on “తెలంగాణ నవ్వింది -కార్టూన్

వ్యాఖ్యానించండి