ఎన్నికల బడ్జెట్ -కార్టూన్


Election Budget

లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలనే బైపాస్ రోడ్లుగా వేసుకుంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం పదేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. విదేశీ మాస్టర్లు, స్వపార్టీ నాయకుల ఆదేశాలను కిమ్మనకుండా పాటించే హార్వర్డ్ మర మనిషి యు.పి.ఎ డ్రైవర్ గా తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇచ్చిన ఆదేశాలను పొల్లుపోకుండా ఎంత ఖచ్చితంగా అమలు చేస్తే మర మనిషి అంత సమర్ధవంతంగా పని చేసినట్లన్నది లోకోక్తిగా మార్చడంలోనూ మన మరమనిషి సఫలం అయ్యారు.

ఇక చివరి బడ్జెట్ ను జనరంజకంగా మార్చే బాధ్యత ఆర్ధికామాత్యులు చిదంబరంపై పడింది. సదరు బాధ్యతను తాజా బడ్జెట్ ప్రతిబింబిస్తోందని కార్టూనిస్టు సూచించారు. అది విజయవంతం అవుతుందా లేదా అన్నది తెలిసే యోగం వారికీ లేదూ మనకీ లేదు. బడ్జెట్ ని చూసి పడ్డ ఓట్లెన్నో లెక్కించే అవకాశం అందుబాటులో లేదు కాబట్టి.

చిదంబరం బడ్జెట్ ప్రధానంగా మధ్యతరగతి జనాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారని పత్రికలన్నీ వ్యాఖ్యానించాయి. అది చాలా వరకు నిజం కూడా కార్లలో ఎన్ని రకాలున్నాయో వాటన్నింటిపైనా పరోక్ష పన్ను (ఎక్సైజ్ సుంకం) 4 శాతం తగ్గించడం ద్వారా మధ్యతరగతి జీవుల కారు కలల్ని తట్టి లేపారు ఆర్ధిక మంత్రి. ఇది ఒకవైపు కార్ల అమ్మకాలు పెంచే చర్య కనుక కార్ల కంపెనీలకు లాభం. కార్ల కంపెనీల ధరలు తగ్గిస్తూ ఇప్పటికే మారుతి, హుండై, మహీంద్ర, నిసాన్ కంపెనీలు నిర్ణయం ప్రకటించాయి కూడా. మరోవైపు కారు కలల్ని సాకారం చేసే చర్య కనుక ఎగువ మధ్య తరగతి, సంపన్న మధ్య తరగతి జనానికి లాభం. అనగా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒకే చర్యతో అటు కంపెనీలనీ సంతృప్తి పరిచి ఇటు కాసిని ఓట్లూ రాల్చే చర్య.

2009 వరకు విద్యార్ధులు తీసుకున్న రుణాలపై వడ్డీ పూర్తిగా మాఫీ చేయాలన్న ప్రతిపాదన చదువు పూర్తి చేసినవారికి ఉపయోగం. ఇది కూడా ప్రధానంగా మధ్య తరగతిని సంతృప్తిపరిచేదే. ఎందుకంటే నిమ్న వర్గాల విద్యార్ధులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు ఎలాగూ లేవు కనుక. ఈ చర్యతో 2,600 కోట్ల రూపాయలు కేంద్రం వదులుకోనుంది.

బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అనుకున్నట్లుగా జి.డి.పిలో 4.8 శాతంకి పరిమితం చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇదెలా సాధ్యం అయిందా అంటే ఆర్ధిక మంత్రి అనుసరించిన ఎత్తుగడ. ఇంధన సబ్సిడీలో 35,000 కోట్ల రూపాయలను వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బదిలీ చేయడం ద్వారా చిదంబరం ఈ లక్ష్యం సాధించారు. ఇది అంకెల మాయాజాలం తప్ప వాస్తవ ఆర్ధిక సామర్ధ్యం కాదు.

నిర్భయ ఫండ్ కింద మరో 1000 కోట్లు కేటాయించిన చిదంబరం గత బడ్జెట్ లో కేటాయించిన 1,000 కోట్లు ఖర్చు చేసిందీ లేనిదీ చెప్పలేదు. వాస్తవం ఏమిటంటే గత కేటాయింపులు ఖర్చు చేయలేదు. మహిళాబ్యాంకు అని ఊదరగొట్టారే గానీ ఆ పని ఎంతవరకు వచ్చింది వివరం లేదు. నిర్భయ ఫండ్ ని కూడా రాజకీయ లక్ష్యంగా మార్చుకోగల తెంపరితనం మన పాలకుల సొంతం.

ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు అదనంగా 1200 కోట్లు ఇస్తున్నట్లు చెప్పి అక్కడి ఓట్లకు గాలం వేశారు. అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని రైతులు రికార్డు స్ధాయిలో 263 మిలియన్ టన్నుల ధాన్యం పండించగా అది తమ ఘనతగా మంత్రి చెప్పుకున్నారు. బొగ్గు కార్మికుల కష్టంతో రికార్డు స్ధాయిలో బొగ్గు ఉత్పత్తి తీస్తే అదీ తమ ఘనతగానే డప్పు కొట్టుకున్నారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 67 శాతం జనాభాను కవర్ చేసేశామని చెప్పారు. చట్టం తెచ్చిందే మొన్న. ఇంతలోకే దాన్ని అమలు కూడా చేసేశామని చెప్పుకోవడం ఎలా సాధ్యమో?

అసత్యాలు, అర్ధ సత్యాలు, డప్పుల మోతలతో కూడిన తాజా బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అనడానికి తగినదే. కానీ కేవలం బడ్జెట్ ప్రతిపాదనలతో ఓట్లు రాల్చుకోవడం సాధ్యమా అన్నదే అనుమానం.

 

2 thoughts on “ఎన్నికల బడ్జెట్ -కార్టూన్

  1. బడ్జెత్ బ్రీఫుకేసులో చిత్తులెక్కల అంచనాలుగా తప్ప దేశ ఆర్ధిక స్వాలంబనకు మార్గదర్శకం శుద్ధశూన్యం. చిదంబరం లుంగికట్టేముందు డ్రాయరు సర్దుకుని తెచ్చిన బొందు లెక్కలు. సంవత్సరానికి ఒకసారి వస్తె అది బడ్జెత్ కానీ పదిసార్లు డ్రాయరు బొందు సవరిస్తూ రాలే పొట్టును ప్రజల నెత్తిన చుండ్రులా చూపిస్తుంటే సగటు మనిషి ధరల పెరుగుదలలో పూర్తిగా అరిగిపోయినావాడిని పట్టుకుని ఈ చిదంబరం అంకెలగారడీతో సదా దువ్వుతూనేవుంటాడు.

వ్యాఖ్యానించండి