తెలంగాణ చర్చ: కొన్ని ఆసక్తికర ఘటనలు


TDP MPs celebrate

‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ పై చర్చ సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలకు లోక్ సభ కేంద్రం అయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టకేలకు సాకారం అయ్యేలా చొరవ చూపినందుకు లేదా సహకరించినందుకు సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసేది ఒకరయితే తనకూ కొంత క్రెడిట్ ఇవ్వాలని కోరేది మరొకరు. లగడపాటి పెప్పర్ స్ప్రే పుణ్యమాని ఎం.పిలే తమ తమ నాయకులకు కాపలా కాసిన పరిస్ధితి. ఒక పక్క నినాదాల హోరు సాగుతుండగానే మరో పక్క క్లాజుల వారీగా ఓటింగు కోసం తలలు లెక్కపెట్టిన స్పీకర్!

లోక్ సభలో చోటు చేసుకున్న వివిధ ఘటనలు ఇలా ఉన్నాయి.

  • అందరినీ ఆకర్షించిన ఘటన పొన్నం ప్రభాకర్ చర్య. ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లుపైన చర్చ ప్రారంభించిన హోమ్ మంత్రి షిండే కొద్ది నిమిషాలకు తన ప్రసంగం ముగించారు. అనంతరం సుష్మా స్వరాజ్ బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. ఆమె తర్వాత జైపాల్ రెడ్డి ప్రసంగం. జైపాల్ రెడ్డి ప్రసంగం ముగిస్తే బిల్లుపై మూజువాణి ఓటు తీసుకుంటారనగా కరీం నగర్ ఎం.పి పొన్నం ప్రభాకర్ సోనియా గాంధీ వద్దకు వచ్చారు. అప్పుడే ఆమె కొద్దిసేపు బైటికి వెళ్ళి రావడానికి సీట్లోంచి లేచారు. భావోద్వేగాలు ముప్పిరిగొన్న పొన్నం ప్రభాకర్ అమాంతం వంగిపోయి సోనియా గాంధీ కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నారు. దీనికి సోనియా స్పందన ఏమిటన్నదీ తెలియరాలేదు.
  • పెప్పర్ స్ప్రే లాంటి ఘటన మళ్ళీ జరుగుతుందని భావించారో ఏమో ముందు వరుసలో కూర్చొన్న సోనియా గాంధీ, సుశీల్ కుమార్ షిండే ప్రభృతులకు అండగా పలువురు కాంగ్రెస్ సభ్యులు మార్షల్స్ తరహాలో కాపలా కాశారు. ఆరన్ రషీద్, లాల్ సింగ్, భక్త చరణ్ దాస్, హందుల్లా సయ్యద్, మహాబల్ మిశ్రా తదితరులు భద్రతా గోడ తరహాలో నిలబడి కాపలా కాశారని ది హిందు తెలిపింది.
  • ఒక విచిత్రమైన, జనానికి అర్ధం కానీ ఘటన. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎం.పిలు నినాదాలు ఇస్తున్నారు. వారికి తోడుగా ఎస్.పి, టి.ఎం.సి సభ్యులు కూడా నినాదాలు అందుకున్నారు. వారేమన్నా షిండే పైకి వస్తారేమో అని కాపలా కాస్తున్న రషీద్, లాల్ సింగ్ లే నినాదాలు చేస్తున్నవారికి గొంతు బొంగురుబోయి దగ్గుతుండడంతో తమ వద్ద ఉన్న దగ్గు బిళ్ళలు (lozenges – విక్స్ బిళ్ళలు లాంటివి) వారికి పంచి పెట్టారట. ఒక వామపక్ష సభ్యులు కూడా ఈ పంపకంలో భాగం పంచుకున్నారుట! జనం దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
  • బిల్లు, సవరణలు పాసై లోక్ సభ వాయిదా పడ్డ తర్వాత పొన్నం ప్రభాకర్ మరోసారి సోనియా గాంధీ వద్దకు వెళ్లారు. సోనియా గాంధీ ఫోటోలతో కూడిన ఫ్లెక్శీలను ప్రదర్శించడానికి ఆయన అనుమతి కోరారు. అందుకు సోనియా నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
  • బడ్జెట్ ముందరి సమావేశంలో పెప్పర్ స్ప్రే జల్లి కలకలం సృష్టించిన లగడపాటి రాజగోపాల్ ఐదు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ లోక్ సభలో ప్రవేశించడానికి ఆయన ప్రయత్నించారు. కానీ గేటు వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ఆయన లోపలికి వెళ్లలేకపోయారు. ఇంతకీ మళ్ళీ సభకు వెళ్ళి ఆయన ఏం చేయదలిచారో!
  • సి.పి.ఐ (ఎం) పార్టీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది. భాషాప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతానికి ఎ.పి విభజన వ్యతిరేకం అంది. కానీ సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రం ఆ పార్టీ ఎన్నడూ పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్ధాయిలో ఉన్నపుడు కూడా ‘అయినా, మేం వద్దంటే ఆగుతుందా’ అని అడిగారు తప్పితే గట్టిగా వాదించలేదు. అలాంటిది మొదటిసారిగా ఈ రోజు సి.పి.ఎం సభ్యులు వెల్ లోకి వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. వారి పక్కనే తృణమూల్ కాంగ్రెస్ ఎం.పిలు కూడా నినాదాలు ఇచ్చారు. ఇరు పార్టీల దృష్టిలో గూర్ఖాలాండ్ ఉద్యమం ఉందని అందుకే రాష్ట్రంలో ఉప్పు-నిప్పుగా ఉండే పార్టీలు లోక్ సభలో ఒక్కటయ్యాయని కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోట్లాడితే తెలంగాణలో తమకు సమస్య కావడంతో ఆ పనీ సి.పి.ఎం చేయలేకపోయింది. చంద్రబాబు నాయుడు ‘రెండు కళ్ల సిద్ధాంతం’ బహిరంగంగా చెబితే సి.పి.ఎం చెప్పలేదు. అంతే తేడా.
  • తృణమూల్ కాంగ్రెస్ సభ్యులా స్లోగన్లు ఆకట్టుకున్నాయి: ఆజ్ కా దిన్ కాలా హై – కాంగ్రెస్, బి.జె.పి జోడా హై; ఆజ్ కా దిన్ కాలా హై – రాహుల్, మోడి జోడా హై; ఆజ్ కా దిన్ కాలా హై – సుష్మా, సోనియా జోడా హై.
  • సాధారణంగా జైపాల్ రెడ్డి నియమాలకు, సహనానికి చిరునామాగా వ్యవహరిస్తారు. అయితే ఈ రోజు ఆయన తన ప్రసంగం సందర్భంగా సోనియా చేత సుద్దులు చెప్పించుకున్నారు. తెలంగాణ 60 యేళ్ళ నాటి సమస్య అనీ, 2004లోనే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చిందని, ఆ మేరకు రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చోటు దక్కిందని చెబుతూ ఆయన ‘ఇన్నాళ్లూ ఆంధ్ర నాయకులు కుంభకర్ణుల్లా నిద్ర పోతున్నారా?’ అని ఆవేశంగా ప్రశ్నించారు. వెంటనే సోనియా గాంధీ ‘కఠిన పదజాలం వద్దు’ అని ఆయనకు సూచించారు.
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతున్నందుకు తనకు కూడా క్రెడిట్ ఇవ్వాలని బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్ తన ప్రసంగంలో కోరారు. “బిల్లు ఆమోదం పొందిన తర్వాత మీరంతా సోనియా గాంధీకి క్రెడిట్ ఇస్తారు… కానీ ఈ చిన్నమ్మను మాత్రం మరిచిపోకండి” అని తనను తాను ఉద్దేశిస్తూ సుష్మా చెప్పారని పత్రికలు తెలిపాయి.
  • బిల్లు ఆమోదంలో పరస్పరం సహకరించుకున్న కాంగ్రెస్, బి.జె.పి లు బిల్లు ఆమోదం పొందాక మళ్ళీ పరస్పరం ఒకరిపై ఒకరు దాడి ప్రారంభించారు. తెలంగాణ బిల్లుకు ఆమోదం పొందాలన్న ఉద్దేశ్యం కాంగ్రెస్ కి అసలు లేనే లేదని బి.జె.పి మద్దతు ఇవ్వడంతో బిల్లు పెట్టక తప్పలేదని సుష్మా విమర్శించారు. బి.జె.పి తన ద్వంద్వ ప్రవృత్తిని మరోసారి చాటుకుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బి.జె.పి ని విమర్శించారు. ఈ నాటకాలేమిటో, ఈ పార్టీలేమిటో? ‘వీళ్ళు మనకి అర్ధం కారు’ అని సరిపెట్టుకోవాలేమో.
  • లోక్ సభ లో జరిగిన చర్చ ప్రత్యక్ష ప్రసారం కాకపోవడంపై పార్టీలన్నీ విమర్శలు ఎక్కుపెట్టాయి. దీనికి నిరసనగానే జె.డి(యు), టి.ఎం.సి లు వాకౌట్ చేశాయని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. స్పీకర్ మీరాకుమార్ ఆదేశాల మేరకే ప్రసారం నిలిపేశామని లోక్ సభ నిర్వాహక అధికారులు చెప్పినట్లు కూడా పత్రికలు చెప్పాయి. అలా చేసే హక్కు స్పీకర్ కి ఉన్నదని రాజీవ్ శుక్లా, సల్మాన్ ఖుర్షీద్ లాంటి ఎం.పిలు సమర్ధించారు కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చింది. స్పీకర్ మీరా కుమార్ ప్రసారాల నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వలేదనీ, సాంకేతిక లోపం వల్లనే ప్రసారాలు నిలిచిపోయాయని ప్రభుత్వం చెబుతోంది. తలుపులు మూసుకుని చర్చించారన్న విమర్శ సరికాదని, పత్రికలు, ఛానెళ్ల విలేఖరులంతా తమ స్ధానంలో ఉండి ఆద్యంతం ప్రొసీడింగ్స్ ని తిలకించారని తెలిపింది. కేవలం ప్రత్యక్ష ప్రసారమే ఆగిందని దానికి కారణం సాంకేతిక లోపం అని చెబుతోంది.

2 thoughts on “తెలంగాణ చర్చ: కొన్ని ఆసక్తికర ఘటనలు

  1. తగిన సమయంలో తగిన సాంకేతికలోపం ఏర్పాటుచేసుకోగల సాంకేతికపరిజ్ఞానాన్ని అభివృధ్ధిచేసుకుని చక్కగా ఉపయోగించుకున్నందుకు ఆ మహానుభావులు ఎవరైతే వారికి తప్పక అభినందనలు చెప్పాలి యావద్భారతమూ

  2. మొత్తానికి అరవై ఏళ్ళ కధకు ముగింపు సాఫల్యత లభించింది, తెలంగాణా రాష్ట్రావతరణ సఫలికృతమయింది. తెలంగాణా తల్లి దీవెనలతో అందరికి శుభాశీసులు.

వ్యాఖ్యానించండి