అస్సాం కు చెందిన పదో తరగతి విద్యార్ధి అఫ్రీద్ ఇస్లాం సరికొత్త కంప్యూటర్ కనిపెట్టి సంచలనం సృష్టించాడు. హార్డ్ డిస్క్ కు బదులుగా మైక్రో చిప్ ని వినియోగించడం ఈ కొత్త కంప్యూటర్ విశిష్టత. జర్మనీకి చెందిన ఒక కంపెనీ అఫ్రీద్ కు సహకారం అందించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు తనకు 7వ తరగతిలో ఇచ్చిన కంప్యూటర్ తో సమస్యలు ఎదుర్కొన్న అఫ్రీద్ ఆ సమస్యలే పునాదిగా కొత్త తరహా కంప్యూటర్ తయారీకి ఆలోచన మొదలు పెట్టి మూడేళ్లలో సఫలం కావడం విశేషం.
అఫ్రీది ఇస్లాం గౌహతి నగరంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్ధి. ప్రస్తుతం సి.బి.ఎస్.ఇ సిలబస్ లో 10వ తరగతి చదువుతున్నాడు. ఇతను తయారు చేసిన కంప్యూటర్ లో విండోస్, లైనక్స్ రెండింటిపై ఆధారపడిన కొత్త తరహా ఆపరేటింగ్ సిస్టం పని చేస్తుంది. విండోస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం లలోని డిపెండెన్సీలను కొత్త ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధికి ఇస్లాం వినియోగించాడు. దీనికి వైరస్ ల నుండి పూర్తి రక్షణ ఉంటుందని తెలుస్తోంది.
మార్చి 3 నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న అఫ్రీద్ ఇస్లాం అస్సాం రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సంస్ధ అధికారులతో కలిసి తాను అభివృద్ధి చేసిన కొత్త కంప్యూటర్ గురించి పత్రికలకు వివరించాడు. తన కంప్యూటర్ ను రెవో బుక్ (రివొల్యూషనరీ బుక్) గా ఇస్లాం నామకరణం చేశాడు. మెకానికల్ మరియు ఎలక్ట్రానికల్ హార్డ్ డిస్క్ లు రెండింటినీ ఉపయోగించాల్సిన అవసరం తన కంప్యూటర్ కు లేదని ఇస్లాం తెలిపాడు. మెమొరీ స్టోరేజి యూనిట్ గా కూడా పని చేసే మైక్రో చిప్ లోనే ఓ.ఎస్ (ఆపరేటింగ్ సిస్టం) పని చేస్తుందని, కాబట్టి సమాచారం (డేటా) కోల్పోయే ప్రమాదం ఇందులో ఉండదని తెలిపాడు.
అయితే మైక్రో చిప్ ని మెమొరీగా ఎలా ఉపయోగిస్తారో వివరాలేవీ పత్రికలు ఇవ్వలేదు. ఎంత మెమొరీని మైక్రో చిప్ లు అందివ్వగలవో కూడా వివరాలు లేవు. తాను కనిపెట్టిన కొత్త కంప్యూటర్ సిస్టం పై పేటెంట్ హక్కుల కోసం అఫ్రీద్ దరఖాస్తు చేసుకున్నాడు.
తన కంప్యూటర్ కోసం అభివృద్ధి చేసిన ఓ.ఎస్ కు ReVo IX గా ఇస్లాం నామకరణం చేశాడు. ఇది మైక్రో చిప్ లో ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. అత్యధిక వేగంతో ఇది పని చేస్తుందని, ఫైర్ వాల్ కూడా లోపలే ఏర్పాటు చేయబడి ఉంటుంది గనక ఉన్నత స్ధాయి భద్రత ఉంటుందని అఫ్రీద్ తెలిపాడు. తన కంప్యూటర్ లోని ఓ.ఎస్ పూర్తిగా స్వంత్రమైనదని అఫ్రీద్ చెబుతున్నాడు.
“హార్డ్ డిస్క్ డ్రైవ్ లో సమాచారం నష్టపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అందులో కదిలే భాగాలు ఉంటాయి. షాక్ తగిలితే కంప్యూటర్ క్రాష్ అయ్యే అవకాశం ఎక్కువ. శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం లోకి తీసుకెళ్లినా క్రాష్ అవుతుంది. కానీ మైక్రో చిప్ లో కదిలే భాగాలు లేవు. అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోను కావు. కనుక మైక్రో-చిప్ లో నడిచే కంప్యూటర్ వ్యవస్ధలో సమాచారం కోల్పోయే ప్రమాదం ఉండదు” అని అస్సాం ఎలక్ట్రానిక్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్ధలో సీనియర్ సిస్టమ్స్ సలహాదారుగా పని చేస్తున్న అనుపమ్ బర్మన్ చెప్పారని ది హిందు తెలిపింది.
“కొత్త సిస్టం అభివృద్ధి చేసేందుకు ఐడియా నాకు 7వ తరగతిలో ఉండగా వచ్చింది. మా తల్లిదండ్రులు నాకు కొనిపెట్టిన కంప్యూటర్ వల్ల నేను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ సమస్యల ద్వారా నాకు ఐడియా వచ్చింది” అని అఫ్రీద్ చెప్పాడు. కంప్యూటర్ తయారీలో తనకు ఒక జర్మన్ కంపెనీ సహకారం అందజేసిందని తాను తెలిపాడు. అయితే జర్మనీ కంపెనీ పేరేమిటో ది హిందు పత్రిక ఇవ్వలేదు. అఫ్రీద్ కనిపెట్టిన కంప్యూటర్ కు పేటెంట్ ఇవ్వడానికి తగిన అన్ని లక్షణాలు ఉన్నాయని పేటెంట్ సంస్ధ ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది.
అస్సాం సైన్స్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్ కౌన్సిల్ లో శాస్త్రవేత్తగా పని చేస్తున్న సిద్ధార్ధ్ దేబ్ నాధ్ ప్రకారం అఫ్రీద్ కు తగిన మొత్తంలో ఆర్ధిక సహాయం అందినట్లయితే మార్కెట్ లకు తన ఉత్పత్తిని సరఫరా చేయగలడని, అందులో భారీ విజయం సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. అఫ్రీద్ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న జర్మనీ కంపెనీ అతని ప్రాజెక్ట్ కు సహకారం అందించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది.
“దాదాపు కంప్యూటింగ్ పరికరాలన్నీ హార్డ్ డిస్క్ డ్రైవ్, ఫ్లాష్ మెమొరీ, ఎలక్ట్రానిక్ డిస్క్ తదితర పరికరాలను వినియోగించి ఆపరేటింగ్ సిస్టం ను నడుపుతాయి. నా ఆవిష్కరణలో మెకానికల్, ఎలక్ట్రానిక్ హార్డ్ డిస్క్ ల స్ధానంలో ఒక మైక్రో చిప్ మాత్రమే ఉంటుంది. దీని వల్ల వేగం, నిలవ సామర్ధ్యం బాగా పెరుగుతుంది. హార్డ్ డిస్క్ తో పోలిస్తే నా ఆవిష్కరణలోని మైక్రో చిప్ 4 రెట్లు వేగంగా పని చేస్తుంది. ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. డేటా కోల్పోయే అవకాశమే ఉండదు. విద్యుత్ కూడా ఎక్కువ అవసరం లేదు” అని అఫ్రీద్ పేర్కొన్నట్లుగా టి.ఓ.ఐ తెలిపింది.
మానవ సమాజం వినియోగిస్తున్న అనేక శాస్త్ర ఆవిష్కరణలలో మౌలికమైనవాటిలో చాలామటుకు యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణలే. కొన్ని ఆవిష్కరణలకు పూనుకున్నవారు కనీసం చదువు లేకుండానే వివిధ పరికరాలను, సిద్ధాంతాలను ఆవిష్కరించిన చరిత్ర ఉంది. వారిలో సహజసిద్ధంగా పని చేసిన వివేకం, intution లను సామర్ధ్యంగా అభివృద్ధి చేయడంలో వారు సఫలం అయ్యారు. యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని ఘటనలు పెన్సిలిన్ లాంటి అద్భుతమైన ఔషధం కనిపెట్టడానికీ, కెప్లర్ సూత్రాలు ఆవిష్కరించబడడానికీ దారి తీసాయని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
ఈ నేపధ్యంలో అఫ్రీద్ ఇస్లాం ఆవిష్కరణను అతని వయసును చూసి అనుమానించవలసిన అవసరం లేదు. అఫ్రీద్ లాంటి మెరికలకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా పశ్చిమ దేశాల ఆవిష్కరణలకు పోటీగా సొంత శాస్త్ర, సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన కర్తవ్యం భారత ప్రభుత్వంపై ఉన్నది. పశ్చిమ కంపెనీలకు సేవలు చేయడంలో మునిగిపోయే పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దేశీయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరని 66 యేళ్ళ భారత పాలకుల చరిత్ర, వారి ప్రాధామ్యాలు చెప్పే సత్యం. అఫ్రీద్ ఇస్లాం తగిన ప్రోత్సాహం అందక జర్మనీకి తరలిపోయే పరిస్ధితి రాకూడదని ఆశించడం తప్పు కాబోదు.

congratulations ఇస్లాం ….. :)
ఇటువంటి మట్టిలో మాణిక్యాలు….మనదేశంలో ఇంకా ఎన్నో ఉండే ఉంటాయి. వాళ్లను వెలికితీయాల్సిన అవసరం ఉంది.