స్కాట్లండ్ రిఫరెండం: యు.కె పాచిక ‘పౌండ్’


Pro-independence supporters march in Edinburgh

Pro-independence supporters march in Edinburgh

పౌండ్ స్టెర్లింగ్ ను కరెన్సీగా వదులుకోవాల్సి వస్తే స్కాట్లండ్ కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకోవడం గానీ లేదా యూరో జోన్ లో చేరడం ద్వారా యూరోను కరెన్సీగా చేసుకోవడం గానీ చేయాల్సి ఉంటుంది. అయితే స్కాట్లండ్ నేతలు యూరో జోన్ లో చేరడానికి సిద్ధంగా లేరు. యూరోపియన్ యూనియన్ లో ఒక స్వతంత్ర సభ్య దేశంగా ఉండడానికి మాత్రమే వారు మొగ్గు చూపుతున్నారు. కానీ పౌండ్ కరెన్సీని కోల్పోయినట్లయితే స్కాట్లండ్ ఆర్ధిక వ్యవస్ధ కొన్ని ఆర్ధిక కుదుపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని యు.కెతో కరెన్సీ యూనియన్ గా ఉండడానికే స్కాట్లండ్ నేతలు మొగ్గు చూపుతున్నారు.

సరిగ్గా ఈ పాచికనే యు.కె నేతలు ప్రయోగిస్తున్నారు. స్కాట్లండ్ లో ప్రధాన బ్యాంకుల కార్యకలాపాలు కొత్త కరెన్సీకి మారడానికి సిద్ధంగా లేవు. దానికి బదులు ఎడిన్ బరో (స్కాట్లండ్ రాజధాని) నుండి తమ కేంద్ర కార్యకలాపాలను లండన్ కు మార్చుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో యు.కె ఆర్ధిక మంత్రి జార్జ్ ఒస్బోర్న్ ‘పౌండ్’ విషయంలో చేసిన ప్రకటనను స్కాట్లండ్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

పౌండ్ స్టెర్లింగ్ ను కొత్త దేశం స్కాట్లండ్ తో పంచుకోడానికి అంగీకరించకపోతే యు.కె అప్పుల్ని తాము పంచుకునేది లేదని స్కాట్లండ్ స్వతంత్రతకు ఛాంపియన్ గా భావిస్తున్న అలెక్స్ సాల్మండ్ హెచ్చరిక జారీ చేశారు. పౌండ్ పైన యు.కె కు ఎంత హక్కు ఉందో స్కాట్లండ్ కు కూడా అంతే హక్కు ఉందని కాబట్టి యు.కె నేతలు తమ ఎత్తుగడలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

“స్కాట్లండ్ ప్రజలను బెదిరించడం, రౌడీయిజం చెలాయించడం ద్వారా తమ పని సాధించడానికి టోరీల (కన్సర్వేటివ్ పార్టీ) నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ స్టెర్లింగ్ పై యాజమాన్యానికి వారు చేస్తున్న ప్రయత్నాలు వారికే ఎదురు తిరగడం తధ్యం. స్కాట్లండ్ వ్యాపితంగా ప్రజలు వారి ఎత్తుగడలను తిప్పికొడతారు. పౌండ్ పై జార్జ్ ఒస్బోర్న్ కు ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందని స్కాట్లండ్ ప్రజలకు తెలుసు” అని స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్.ఎన్.పి) నేత కూడా అయిన సాల్మండ్ హెచ్చరించాడు.

Scotland's First Minister Alex Salmond

Scotland’s First Minister Alex Salmond

స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా మారాలా లేదా అన్న అంశంపై సెప్టెంబర్ 18, 2014 తేదీన రిఫరెండం జరగనుంది. ఇందులో 16 సం. వయసు దాటినవారు అందరూ ఓటు వేయనున్నారు. అనగా 40 లక్షలమంది ఓటు వేస్తారని తెలుస్తోంది. విడిపోవడానికే స్కాట్ ప్రజలు ఓటు వేస్తే యు.కె తో 307 సంవత్సరాల బంధాన్ని తెంచుకున్నవారు అవుతారు.

గత గురువారం (ఫిబ్రవరి 13) జార్జి ఒస్బోర్న్ ప్రకటన చేసిందగ్గర్నుండి తాజా గలాటా మొదలయింది. స్వతంత్రంగా ఉండడానికే స్కాట్లండ్ నిర్ణయించుకుంటే వారు పౌండ్ ని వదులుకోవాల్సి ఉంటుందని ఒస్బోర్న్ ప్రకటించారు. స్కాట్లండ్ విడిపోకుండా అడ్డుకోవడానికే ఒస్బోర్న్ ‘పౌండ్’ పాచిక విసిరాడని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ దెబ్బతో స్కాట్లాండ్ ప్రజలు స్వతంత్ర ప్రకటనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఒస్బోర్న్ నమ్ముతున్నారని వారి అభిప్రాయం. “సి.డి కలెక్షన్ తరహాలో రెండు దేశాల మధ్య పంపకం జరగడానికి పౌండ్ అనేది ఆస్తి ఏమీ కాదు” అని జార్జ్ ఒస్బోర్న్ గత గురువారం చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు.

స్టెర్లింగ్ కరెన్సీ స్కాట్లండ్ కరెన్సీగా ఉంచడానికి అంగీకరిస్తే అది యు.కె ఆర్ధిక వ్యవస్ధకే ఉపయోగం అని స్కాట్లండ్ నేతలు చెబుతున్నారు. కంపెనీలు, ధనికవర్గాల వరకు చూస్తే ఇది నిజం కూడా. ఉమ్మడి కరెన్సీ వల్ల ఉపయోగం అనే 17 ఐరోపా దేశాలు ‘యూరో’ కరెన్సీ ఏర్పాటు చేసుకుని జాతీయ కరెన్సీలను రద్దు చేసుకున్నాయి. సరుకుల అమ్మకానికి బౌగోళిక సరిహద్దులు లేకుండా చేసుకోవడం ద్వారా మార్కెట్ ను విస్తరించుకోవడం, సరుకుల అమ్మకాలు పెంచుకోవడం ఉమ్మడి కరెన్సీ ప్రధాన లక్ష్యం. అయితే ఈ క్రమంలో ప్రధానంగా లబ్ది పొందేదీ కంపెనీలు మాత్రమే. పన్నులు లేకుండా చేసుకోవడానికి ఉమ్మడి కరెన్సీ పట్ల మొగ్గు చూపే కంపెనీలు సరిహద్దులకు అతీతంగా కార్మికులు, ఉద్యోగులను అనుమతించడానికి మాత్రం ఒప్పుకోవు.

యు.కె ఆర్ధిక వ్యవస్ధలో స్కాట్లండ్ ఆర్ధిక వ్యవస్ధ దాదాపు 10వ వంతు ఉంటుంది. స్కాట్లండ్ ఆర్ధిక కార్యకలాపాలు లండన్ తోనూ, స్టెర్లింగ్ తోనూ భారీ మొత్తంలో ముడి పడి ఉంది. స్కాట్లండ్ ఆర్ధిక వ్యవస్ధను ద్రవ్యపరంగా పర్యవేక్షించేది యు.కె ప్రభుత్వమే. స్కాట్లండ్ సముద్ర జలాల్లో చమురు వెలికి తీస్తున్నది, నిర్వహిస్తున్నది కూడా ప్రధానంగా యు.కె ప్రభుత్వమే. స్కాట్లండ్ లో అతి పెద్ద బ్యాంకు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్. దీని కార్యకలాపాలు కూడా లండన్ ద్రవ్య కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. పౌండ్ స్టెర్లింగ్ కరెన్సీని స్కాట్లండ్ పొందలేని పక్షంలో తన కేంద్ర కార్యాలయాన్ని ఎడిన్ బరో నుండి లండన్ కు మార్చుకోవలసిన అవసరం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా పౌండ్ వ్యాపారాన్ని కోల్పోకుండా అది చూసుకోగలుగుతుంది. లాయిడ్ బ్యాంకింగ్ గ్రూప్ కూడా దాదాపు ఇదే పరిస్ధితి.

స్కాట్లండ్ విడిపోతే యు.కె రుణాలలో కొంత భాగం కోల్పోవలసి ఉంటుందని మదుపుదారులు ప్రారంభంలో భయపడ్డారు. అయితే యు.కె రుణాలు మొత్తం (1.2 ట్రిలియన్ డాలర్లు) తామే చెల్లిస్తామని యు.కె ట్రెజరీ చెప్పడంతో దాని ప్రభావం మార్కెట్ల పై పడలేదు. యు.కె ట్రెజరీ ప్రకటనకు అర్ధం అప్పులు మొత్తం యు.కె భరిస్తుందని కాదు. విడిపోయే సందర్భంలో స్కాట్లండ్ వాటాగా వచ్చే రుణాలను వసూలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటానని యు.కె ట్రెజరీ చెబుతున్నట్లు అర్ధం. అనగా ఋణ బాండ్ల చెల్లింపులు స్కాట్లండ్ ట్రెజరీని ఆశ్రయించాల్సిన అవసరం మదుపుదారులకు ఉండదు. స్కాట్లండ్ మాత్రం తన ఋణ వాటాను యు.కె ట్రెజరీకి చెల్లిస్తుంది.

జార్జి ఒస్బోర్న్ ప్రకటన ప్రభావం స్కాట్లండ్ ప్రజలపై తక్కువ ఉండబోదు. ఈ ప్రభావాన్ని స్వతంత్రం కోరుకుంటున్న పార్టీలు ఎలా అధిగమిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

వ్యాఖ్యానించండి