బి.జె.పికి ఆటవస్తువు తెలంగాణ -కార్టూన్


T Bill - BJP games

తెలంగాణ బిల్లు పైన కేబినెట్ కసరత్తు పూర్తయ్యి బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశిస్తున్న తరుణంలో బి.జె.పి ఇక తన అసలు రూపం చూపడం ప్రారంభించింది. రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నట్లు ఆరోపిస్తూ వచ్చిన బి.జె.పి తాను స్వయంగా వివిధ గొంతులతో మాట్లాడడం ప్రారంభించింది. ఒకవైపు బేషరతు మద్దతు అని చెబుతూనే సీమాంధ్రకు న్యాయం చేయాలని కొత్తగా అనుపల్లవి అందుకుంది.

బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ ‘బిల్లుకు మద్దతు ఇచ్చి తీరతాం’ అని ప్రకటిస్తుండగానే ఎల్.కె.అద్వానీ ‘ఇలాంటి తప్పుల తడక బిల్లుకు మద్దతు ఎలా ఇస్తాం’ అని ప్రశ్నించడం ప్రారంభించారు. సుష్మా స్వరాజ్ గారయితే సీమాంధ్ర నేతల దగ్గర ఒక మాట, తెలంగాణ నేతల వద్ద మరొక మాట చెబుతున్నారని పత్రికలు వెల్లడి చేశాయి. బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టలేదని సుష్మ ప్రభృతులు ప్రకటించగా ఇక తెలంగాణ బిల్లును వదిలి వోట్-ఆన్-అకౌంట్ కి వెళ్ళడం ఉత్తమం అని అద్వానీ ముక్తాయించారు. వీరందరికీ అతీతంగా ‘ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారు’ అంటూ నరేంద్ర మోడి మరో వాదన ప్రారంభించారు.

దాదాపు పదేళ్ళ పాటు కాంగ్రెస్ ఆడిన ఆటలన్నీ గత వారం రోజుల్లోనే బి.జె.పి ఆడిందంటే అతిశయోక్తి కాదేమో. సీసా బల్ల తరహాలో తెలంగాణ బిల్లును కిందకీ మీదకీ తొక్కుతూ ఆడుకుంటున్న బి.జె.పి వైఖరి వెనుక ‘తాము కూడా వీలయినంత రాజకీయ లబ్ది పొందాలన్న వ్యూహం’ దాగి ఉందన్నది స్పష్టమే. తెలంగాణ వాగ్దానం, అమలు ద్వారా రాజకీయ లబ్ది పొందుతున్నపుడు తాము మాత్రం కాంగ్రెస్ కి ఆ అవకాశం ఎందుకివ్వాలన్నది బి.జె.పి వాదన కావచ్చు. ఈ వాదన సబబుగానే కనిపించినా దానివల్ల ఇన్నాళ్ళూ అది చూపిన పెద్ద మనిషి వైఖరి గంగలో కలిసిపోవడమే జనం తెలుసుకోవాల్సిన విషయం.

ఎలాంటి గొడవలు లేకుండా మూడు రాష్ట్రాలు ఏర్పరిచాం అని తరచుగా చెప్పుకునే బి.జె.పి తెలంగాణ విషయంలో జరుగుతున్న గొడవల్లో తానూ పాత్ర పోషిస్తోంది. గొడవ చేసే కాంగ్రెస్ సీమాంధ్ర సభ్యులను సస్పెండ్ చేస్తే ఒప్పుకోం అంటూనే గొడవ జరక్కుండా సభ నడిస్తేనే బిల్లుకు మద్దతు ఇస్తాం అంటూ ‘వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి’ వైఖరి అవలంబిస్తోంది. పెప్పర్ స్ప్రే ఉదంతం తర్వాత ‘బిల్లును ప్రవేశపెట్టాం. ఇక అది పార్లమెంటు ఆస్తి’ అని హోమ్ మంత్రి షిండే మాటల్ని అక్షరాలా పాటిస్తున్నారా అన్నట్లుగా సదరు బిలుతో బి.జె.పి ఆటలు సాగుతున్నాయి.

ఈ రోజు (ఫిబ్రవరి 17) పార్లమెంటు లాబీల్లో సోనియా గాంధీ, వెంకయ్య నాయుడు తారసపడ్డారట. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని సోనియా కోరగా వెంకయ్య నాయుడు ‘మా సవరణలకు ఒప్పుకుంటేనే మద్దతు’ అని షరతు విధించారని తెలుగు ఛానెళ్లు చెబుతున్నాయి. మా సవరణలకు ఒప్పుకున్నా లేకున్నా బిల్లుకు మద్దతు ఇచ్చేదీ ఖాయం అని అరుణ్ జైట్లీ చెప్పినట్లు మూడు రోజుల క్రితం టి.డి.పి నేత దయాకర్ రెడ్డి, టి.బి.జె.పి నేత కిషన్ రెడ్డి చెప్పారు. బి.జె.పి స్టాండు మారినట్లా, కానట్లా అన్నది తెలియకుంది.

2 thoughts on “బి.జె.పికి ఆటవస్తువు తెలంగాణ -కార్టూన్

  1. మీ రన్నది నిజమే. బీజేపీ వాళ్ళేమీ కాంగ్రేసువారి కన్నా తక్కువ తినలేదు. దొందూదొందే.

    ఇకపోతే బేషరతుగా మద్దతు ఇవ్వటం అంటే, సీమాంధ్రలో మనుషులున్నారా, ఉంటే ఉండనీ, వాళ్ళు ఏమైపోయినా మనకేం. మాటప్రకారం తథాస్తూ అనటమే సత్యసంధత అని భావిస్తే ఎవరూ చెప్పగలిగింది ఏమీ లేదు. అలా అనకపోవటం ఆక్షేపణీయం అంటే అది నిజమే కాబోలు అనుకోక తప్పదు – మా బోటి వాళ్ళం మీలాగా మేథావులంకాము గదా!

  2. శ్యామలరావు గారూ,

    ‘సమన్యాయం’, ‘సీమాంధ్రుల సమస్యలు కూడా పట్టించుకోవాలి’ ఇత్యాది నినాదాల వెనుక వివిధ పార్టీలు చేస్తున్న డిమాండ్లన్నీ ప్రధానంగా సీమాంధ్ర ధనికులకు హైద్రబాద్ లో ఉన్న ఆస్తులను కాపాడడానికి ఉద్దేశించినవే. నిజంగా సీమాంధ్ర జనం కోసం చేస్తున్న డిమాండ్లు చాలా తక్కువ. బి.జె.పి కూడా కంపెనీలకు, వ్యాపారస్ధులకు మేలు చేసే డిమాండ్లనే ప్రతిపాదించారు. బి.జె.పి కోరుతున్న పన్ను మినహాయింపులు, కావూరి లాంటివారు కోరుతున్న యు.టి తదితర డిమాండ్లు కూడా ధనికవర్గాల ఆస్తుల రక్షణ, వృద్ధిలే లక్ష్యంగా పెట్టుకున్నవి. సీమాంధ్ర జనానికి మేలు చేసేవి కావు.

    నా ఉద్దేశ్యంలో ఉమ్మడి రాజధాని, యు.టి లాంటివాటివల్ల సీమాంధ్ర జనానికి నష్టం తప్ప లాభం లేదు. దానికంటే కొత్త రాజధాని వేగంగా అభివృద్ధి చేసుకునే ప్యాకేజీలు, ఆదాయ పన్ను తగ్గింపు, పరోక్ష పన్నుల తగ్గింపు లాంటి డిమాండ్లు చేసి నెరవేర్చుకోగలిగితే సీమ, ఆంధ్ర జనానికి మేలు జరుగుతుంది. జాగ్రత్తగా చూస్తే సీమాంధ్ర నాయకులు వేస్తున్న వెర్రి వేషాలన్నీ వారి ఆస్తుల కోసమే అని ఇట్టే అర్ధం అవుతుంది. వారి వెనుక వెళ్ళి మోసపోవడం కంటే జనం స్వతంత్రంగా ఉద్యమాలు సాగించి తమ సొంత డిమాండ్లు నెరవేర్చుకోగలిగితేనే తగిన ఫలితం వస్తుంది. కానీ అందుకు నాయకత్వం వహించేవారు లేకపోవడమే మన దౌర్భాగ్యం.

    నేను మేధావిని కాను. నాకు తెలిసింది చెబుతున్నాను. మీకు తెలిసింది మీరు చెబుతున్నారు. ఒకరికి తెలియనివి మరొకరు తెలుసుకోవడానికి ఇదొక మార్గం.

వ్యాఖ్యానించండి