ప్రశ్న: వోట్-ఆన్-అకౌంట్ అంటే?


Chidambaram

ప్రశ్న (మల్లిఖార్జున్): సాధారణ బడ్జెట్ కీ, వోట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ కీ తేడా చెప్పండి?

సమాధానం: క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలికంగా ఖర్చులు గడుపుకోవడానికి ప్రతిపాదించే బడ్జెట్ నే వోట్-ఆన్-అకౌంట్ అంటారు. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ అవసరం వస్తుంది. పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ ఆమోదించాలంటే సభల్లో సంతృప్తికరంగా చర్చలు జరగాలి. ఈ చర్చలన్నీ ముగియాలంటే సమయం తీసుకుంటుంది. కొత్త బడ్జెట్ సంవత్సరం వచ్చేస్తుంది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు. పాత ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే వారి విధానాలను కొత్త ప్రభుత్వం మోయాల్సిన పరిస్ధితి వస్తుంది. ఈ పరిస్ధితిని తప్పించడానికి ఎన్నికల సంవత్సరంలో వోట్-ఆన్-అకౌంట్ ను ప్రభుత్వాలు ఆశ్రయిస్తాయి.

ప్రభుత్వం దేశ ఆదాయం, రుణాలను ‘కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా’లో ఉంచాలని రాజ్యాంగం నిర్దేశించింది. దీనిలో నుండి నిధులు తీయాలంటే పార్లమెంటు అనుమతి కావాలి. బడ్జెట్ సంవత్సరంలో కొంత భాగానికి సరిపడా ఖర్చులకు గాను పార్లమెంటు ఓటును ప్రభుత్వం కోరుతుంది. ఇదే వోట్-ఆన్-అకౌంట్.    

సాధారణంగా బడ్జెట్ అనేది ఏప్రిల్ నుండి మార్చి వరకు 12 నెలల పాటు వచ్చే ఆదాయాన్ని లెక్క గట్టి, దాన్ని ఎలా ఖర్చు చేస్తారో వివరిస్తుంది. ఖర్చులకు సరిపోను ఆదాయం లేదని భావిస్తే అలా లేని మొత్తం ఎలా పూడ్చుతారో చెబుతుంది. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల ముందు దేహి అంటారా లేక మార్కెట్ నుండి రుణాలు సేకరిస్తారా లేక కొత్త పన్నులు వేసి ఆదాయం పెంచుకుంటారా తదితర వివరాలు పూర్తి స్ధాయి బడ్జెట్ లో ఉంటాయి.

వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ లో ఉండేది కేవలం ఖర్చుల లెక్కలే. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేవరకు ప్రభుత్వం తలపెట్టిన ఖర్చులకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రభుత్వం కోరుతుంది. దీనిపైన చర్చలేవీ పెద్దగా జరగవు. సభల్లో ఆమోదానికి సమయం కూడా తీసుకోరు. సాధారణంగా వోట్-ఆన్-అకౌంట్ ను రెండు నెలలకు ఆమోదిస్తారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ఇంకా సమయం పడుతుందని భావిస్తే ఈ రెండు నెలల కాలాన్ని పొడిగించుకోవచ్చు. పార్లమెంటు సమావేశాల రెండు సెషన్ల మధ్య కాలం 6 నెలలకు మించగూడదు. కాబట్టి వోట్-ఆన్-అకౌంట్ కూడా 6 నెలలకు మించి పొడిగించకూడదు. ఆ లోపు పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి.  

కొత్త ప్రభుత్వం వచ్చాక వోట్-ఆన్-అకౌంట్ ను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తి స్ధాయి బడ్జెట్ ను ప్రతిపాదిస్తుంది. పాత ప్రభుత్వానికి ఒక ఫిస్కల్ ప్లాన్ (ఆదాయ-వ్యయ పధకం), కొత్త ప్రభుత్వానికి మరొక ఫిస్కల్ ప్లాన్ ఉండొచ్చు. ఎవరెవరికి ఎంత కేటాయించాలి, ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టాలి తదితర అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఎన్నికల సం. లో పాత ప్రభుత్వం పూర్తి స్ధాయి బడ్జెట్ ప్రవేశపెడితే పాత ప్రభుత్వం తన ఫిస్కల్ ప్లాన్ ను కొత్త ప్రభుత్వంపై బలవంతంగా రుద్దినట్లు అవుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్ధను అవమానపరచడం అవుతుందనీ, పెద్ద మనుషులు వ్యవహారించాల్సిన పద్ధతి కాదనీ ఒక సాధారణ అవగాహన.

పూర్తి స్ధాయి బడ్జెట్ లో ప్రత్యక్ష పన్నుల్లో మార్పులు చేయొచ్చు. వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ లో ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రత్యక్ష పన్నుల్లో చేసే మార్పులను ఫైనాన్స్ బిల్లుతో కలిపి ఆమోదించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ బిల్లు అంటే పూర్తి స్ధాయి బడ్జెట్ కనుక ప్రత్యక్ష పన్నులను యధావిధిగా కొనసాగిస్తారు. పరోక్ష పన్నుల్లో కొన్ని మార్పులు చేయవచ్చు. ఉదాహరణకి వాహనాల పైన వేసే ఎక్సైజ్ పన్ను 12% నుండి 8%కి తగ్గిస్తున్నామని ఈ రోజు బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి పి.చిదంబరం చెప్పారు. అనగా ఆ మేరకు వాహనాల ధరలు తగ్గుతాయి. (కారు కొనే వినియోగదారుడి నుండి రిటైల్ అమ్మకందారు ద్వారా పరోక్షంగా కేంద్రం వసూలు చేసే పన్ను గనక ఎక్సైజ్ పన్ను పరోక్ష పన్ను.)

ఎన్నికల సంవత్సరంలో ఖచ్చితంగా వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టాలన్న నియమం ఏమీ లేదు. రాజ్యాంగ నిబంధనలు కూడా ఏమీ లేవు. ఇది కేవలం పాలకుల వివేకానికి సంబంధించిన వ్యవహారం. కొంతమంది వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ అన్నా మధ్యంతర బడ్జెట్ అన్నా ఒకటే అని చెబుతారు. కానీ అది నిజం కాదు. వోట్-ఆన్-అకౌంట్ లో కేవలం ఖర్చుల లెక్కలే ఉంటాయి. మధ్యంతర బడ్జెట్ లో సదరు మధ్యంతర కాలంలోని ఆదాయాలు కూడా కలిసి ఉంటాయి.   

కాబట్టి పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ కాకుండా వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కారణాలు ఇలా చెప్పుకోవచ్చు.

  • పూర్తి స్ధాయి బడ్జెట్ ను చర్చించి ఆమోదించడానికి పాత ప్రభుత్వానికి సమయం ఉండదు.
  • కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తి బడ్జెట్ ఆమోదించేలోపు ఖర్చులు గడవాలి.
  • ఏయే మార్గాల ద్వారా ఆదాయం పొందాలో, వాటిని ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకునే సహజ అధికారం కొత్త ప్రభుత్వానిదే తప్ప పాత ప్రభుత్వానిది కాదు.
  • పాత ప్రభుత్వ విధానాలను కొత్త ప్రభుత్వంపై మోపడం సరైన ప్రజాస్వామిక పద్ధతి కాదు.
  • బడ్జెట్ ప్లాన్ లేదా ఫిస్కల్ ప్లాన్ విషయంలో పాత-కొత్త ప్రభుత్వాల మధ్య తేడాలు ఉంటాయి.

వ్యాఖ్యానించండి