పెప్పర్ స్ప్రే కాదు, నిషేదిత రసాయనం


‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ ను లోక్ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోడానికి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే జల్లారని అందరూ భావిస్తున్నారు. పత్రికలు కూడా అదే చెప్పాయి. లగడపాటి కూడా తాను పెప్పర్ స్ప్రే చల్లానని చెప్పారు. అయితే ఆయన జల్లింది పెప్పర్ స్ప్రే కాదని మరింత ప్రమాదకరమైన నిషేధిత రసాయనం అని తెలుస్తోంది.

లగడపాటి తెచ్చిన కేనిస్టర్ లో ఉన్నది యుద్ధాల్లో సైతం నిషేధించిన కేప్సాయ్సిన్ అని ది హిందు తెలిపింది. కాప్సికమ్ మొక్కల పండ్ల నుంచి గానీ, మిరప మొక్కల నుంచి గానీ దీనిని తయారు చేస్తారని తెలుస్తోంది. ఈ మొక్కల నుండి తీసిన కాప్సాయ్సిన్ రసాయనాన్ని రెసిన్ గా మార్చి నీటితోనూ, మిశ్రమాన్ని స్ధిరీకరించే పదార్ధంతోనూ కలిపి కేనిస్టర్ లో పీడనంలో ఉండేలా (pressurise) చేస్తారు.

రసాయన ఆయుధాల సదస్సు ఈ రసాయన పదార్ధాన్ని యుద్ధంలో వినియోగించడాన్ని నిషేధించింది. అల్లర్లను చెదరగొట్టడానికి పోలీసులు వినియోగించే రసయానాల్లో కూడా ఇది ఉండకూడదని సదస్సు నిషేదించింది.

ఆత్మరక్షణ నిమిత్తం ఒక వ్యక్తి మొఖంపై ఈ స్ప్రేను జల్లినపుడు అతడు/ఆమె వెంటనే కళ్ళు మూసుకునేలా చేస్తుంది. ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముక్కుల వెంట నీరు కారడం, తీవ్రమైన దగ్గు కలిగిస్తుంది. ఇది నీటిలో కరిగేది కాదు. కాబట్టి నీళ్ళతో మొఖం కడుక్కున్నప్పటికీ దీని ప్రభావం వదలదు. రెండు మూడు గంటల తర్వాత దానంతట అదే ప్రభావాన్ని కోల్పోవాలి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

స్ప్రే ప్రయోగించబడిన వ్యక్తి ఆరోగ్యం బలహీనంగా ఉన్నట్లయితే అది ఒక్కోసారి ప్రాణాంతక పరిస్ధితికి దారి తీయవచ్చు. “ఈ స్ప్రేలో మంట పుట్టించే పదార్ధం ఉంటుంది. వాస్తవంగా కాలడం అంటూ ఏమీ జరగదు గానీ, కాలిన అనుభూతిని కలిగిస్తుంది. ఆస్త్మా రోగులు గానీ లేదా అలర్జీ కారక పదార్ధాలకు స్పందించే లక్షణాలు ఉన్నవారు గానీ దీనికి గురయితే వారి పరిస్ధితి క్లిష్టం అవుతుంది” అని చెన్నైలోని ఇ.ఎన్.టి సర్జన్ మోహన్ కామేశ్వరన్ చెప్పారని ది హిందు తెలిపింది.

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత ఈ స్ప్రే అమ్మకాలు బాగా పెరిగాయని తెలుస్తోంది. విదేశాల్లో ఈ స్ప్రే పై నిషేధం ఉన్నప్పటికీ భారత దేశంలో నిషేధం లేదు. ఒక్కో కేనిస్టర్ లో 50 నుండి 100 మిల్లీ లీటర్ల వరకు ఉండవచ్చు.

యూరోపియన్ పార్లమెంటుకు చెందిన సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ ఆప్షన్స్ నివేదిక (1998లో ప్రచురితం) ప్రకారం ఈ స్ప్రే వలన 15 నుండి 30 నిమిషాల పాటు తాత్కాలికంగా గుడ్డితనం సంభావిస్తుంది. 3 నుండి 15 నిమిషాల పాటు శరీరం పై భాగం ఆకస్మికంగా ఊపులకు గురవుతుంది.

స్ప్రే వినియోగం ఇండియాలో నిషేదితం కాదు. అయితే దీన్ని తయారు చేసేవారు మాత్రం ప్రభుత్వం నుండి తగిన లైసెన్స్ తీసుకోవాలి.

స్ప్రే వినియోగం ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉద్దేశించినది. అనగా క్రిమినల్స్ దాడి నుంచి ఆత్మరక్షణ కోసం ఉద్దేశించినదే తప్ప రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగించడానికి ఉద్దేశించింది కాదు. ఆడపిల్లలు, మహిళలు మాత్రమే దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దొంగలు, దోపిడిదారులు, హంతకుల నుండి ప్రమాదం ఉందనుకుంటే పురుషులు కూడా వినియోగిస్తారు.

ప్రజా ప్రతినిధులు ప్రజా పాలన కోసం కూర్చొని ఉండే లోక్ సభలో ఆత్మ రక్షణ కోసం స్ప్రే జల్లానని చెప్పడం ద్వారా లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో దొంగలు, దోపిడీదారులు, హంతకులు కూర్చొని ఉన్నారని చెప్పదలిచారా?

వ్యాఖ్యానించండి