అగ్ని కొండల దేశంలో మరో బూడిద కాలం -ఫొటోలు


ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం తరహాలో ఇండోనేషియా దేశస్ధులు బూడిద కాలం కూడా ఒకటుందని చదువుకోవాల్సిన రోజులు. అగ్ని పర్వతాలకు నిలయం అయిన ఇండోనేషియా ప్రజలకు అగ్ని కొండలు బద్దలు కావడం కొత్త కాకపోయినా ఈసారి మాత్రం వరుస పేలుళ్లతో భయోత్పాతం సృష్టిస్తున్నాయి. సినబాంగ్ అగ్ని పర్వతం ఆరు నెలల కాలంలో మూడోసారి బద్దలై నిప్పులు చెరుగుతుండగా దానికి కెలుద్ అగ్ని పర్వతం కూడా జత కావడంతో అనేక మంది మరణించారు.

ఫిబ్రవరి 14 తేదీన జావా ద్వీపంలోని కెలుద్ అగ్ని పర్వతం భారీ శబ్దాలు చేస్తూ పేలిపోయింది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారని ది అట్లాంటిక్ పత్రిక తెలిపింది. భారీ పరిమాణంలో బూడిద వెదజల్లడంతో ఇళ్ళు, రోడ్లు, పొలాలు అన్నీ బూడిద కింద కప్పబడిపోయాయి. ఫలితంగా లక్ష మందికి పైగా ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

కెలుద్ విస్ఫోటనం ఎంత భారీగా ఉన్నదంటే దాదాపు 100 (160 కి.మీ) మైళ్ళ దూరం వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి. అనగా విజయవాడలో అగ్ని పర్వతం ఉందనుకుంటే దాని పేలుడు శబ్దాలు ఒకవైపు రాజమండ్రి, మరోవైపు ఒంగోలు, ఇంకోవైపు సూర్యపేటలు దాటి వినిపించాయన్నట్లు!

ఇప్పటికే రెండు సార్లు బద్దలై పెద్ద మొత్తంలో లావా, బూడిద విరజిమ్మిన సినబాంగ్ అగ్ని పర్వతం కూడా మరోసారి పేలిపోయింది. జనవరి చివరిలో భారీ పేలుడు నమోదు చేసిన సినబాంగ్ అగ్ని పర్వతం దూకుడు కారణంగా ఇప్పటి వరకూ 16 మంది మరణించారు. దేశవ్యాపితంగా ఉన్న 150 అగ్ని పర్వతాల్లో ఎప్పుడు ఏవైపు నుండి ప్రమాదం వస్తుందోనని ప్రజలు, ప్రభుత్వము ఆందోళన చెందుతున్నారు.

ఈ అగ్నిపర్వతాల చురుకుదనం వలన సమీప గ్రామీణుల జీవనం అస్తవ్యస్తం అయిపోయింది. సొంత ఊళ్ళకు ఎప్పుడు తిరిగి వెళ్లాలో తెలియని పరిస్ధితిలో అనేకమంది ఉన్నారు. అసలు తిరిగి వెళ్లగలమా అని కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఇంకేదన్నా ప్రకృతి విపత్తు అయితే తగిన రక్షణ చర్యలు తీసుకోగలం గానీ అగ్ని పర్వతం నుండి రక్షణ చర్యలు ఏం తీసుకోగలం అని ప్రభుత్వాధికారులు నిట్టూరుస్తున్నారు. జనం మాత్రం పంటలు, ఇళ్ళు, గొడ్డు, గోదా కాపాడుకోలేక నష్టపోతున్నారు.

ఈ ఫోటోలను ది అట్లాంటిక్ అందజేసింది.

2 thoughts on “అగ్ని కొండల దేశంలో మరో బూడిద కాలం -ఫొటోలు

వ్యాఖ్యానించండి