బ్రిటన్ ను మళ్ళీ ఊపేసిన తుఫాను, మరొకటి తయారు -ఫోటోలు


రెండు నెలలుగా ఎడతెరిపి లేని మంచు తుఫానులతో, వర్షాలతో, వరదలతో తడిసి ముద్దయిన ఇంగ్లండ్ ను బుధవారం నుండి శుక్రవారం వరకు మరో తుఫాను ఊపేసింది. 108 కి.మీ వేగంతో వీచిన గాలులకి పశ్చిమ, నైరుతి ఇంగ్లండ్ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కురుస్తున్న వర్షాన్ని ఇముడ్చుకోవడానికి భూగర్భంలో ఇక ఖాళీ లేదనీ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా అనేక కాలనీలు, నగరాలు, పల్లెలు, రోడ్లు జలమయమై విశాలమైన తటాకాలను తలపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలోనే అత్యధిక వరదలు నమోదు చేసిన చలికాలంగా ఇప్పటి చలికాలం రికార్డులకు ఎక్కనుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంగ్లండ్ లో తాజా వరదల, తుఫాన్ల పరిస్ధితిపై వివిధ వార్తా సంస్ధలు చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.

130,000 కుటుంబాలు విద్యుత్ లేక చీకట్లో మునిగిపోయాయి.

తీవ్ర గాలులకు కూలిపోయిన చెట్టును తొలగించబోతూ విద్యుత్ షాక్ తగిలి విల్ట్ షైర్ లో ఒక వ్యక్తి చనిపోగా, రోడ్డుపై కూలిన చెట్టును తప్పించబోయి మరో కారును గుద్ది మరోకాయన చనిపోయారు.

తుఫాను బాధితులకు సాయం చేయడానికి ‘డబ్బు సమస్య కాదు’ అని ప్రధాని కామెరాన్ చేసిన ప్రకటనను ఎవరూ నమ్మడం లేదు. సిగ్గు పడకుండా విదేశీ సాయం తీసుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, పత్రికలు కోరుతున్నారు. ఈ మేరకు డెయిలీ మెయిల్ పత్రిక తయారు చేసిన పిటిషన్ పై ఇప్పటివరకు 180,000 మంది సంతకం (డిజిటల్) చేశారు.

వరదల వల్ల రోడ్లు ఎక్కడ ఉన్నదీ తెలియకపోవడంతో వేలాది మంది ప్రయాణీకులు, వాహనాలు రోడ్లపై ఇరుక్కుపోగా అనేక చోట్ల వివిధ రకాల ట్రాఫిక్ కష్టాలు జనాన్ని వేధిస్తున్నాయి. వరదల ధాటికి రైళ్లు మధ్యలో నిలిచిపోగా అందులో ప్రయాణీకులు అందులో చిక్కుకుపోయారు.

అట్లాంటిక్ సముద్రంలో ఉన్న పరిస్ధితుల కారణంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరిన్ని రోజులు కొనసాగుతాయి. మరో తుఫాను ఇంగ్లండ్ ను ముంచెత్తడానికి తయారుగా ఉంది.

ధేమ్స్ నది సాధారణ స్ధాయి కంటే 4 రెట్లు శక్తితో ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల గత 60 యేళ్లలో అత్యధిక ఎత్తుకు ధేమ్స్ పొంగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దానితో 1000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

బ్రిటన్ ఆర్ధిక రికవరీని సైతం దెబ్బ తీయగల శక్తి ప్రస్తుత వాతావరణ పరిస్ధితులకు ఉన్నదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ మార్క్ కార్ని ఆందోళన వ్యక్తం చేశాడు.

వాయవ్య ఇంగ్లండ్, లాంక్ షైర్, మెర్సీ సైడ్, సౌత్ యార్క్ షైర్, మాంచెష్టర్, ఆక్స్ ఫర్డ్, బాన్ బరీ, ఈశాన్య ఇంగ్లండ్, వేల్స్ తదితర అన్నీ ప్రాంతాల్లోనూ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్ల పరిస్ధితి దాదాపు అదే విధంగా ఉంది. కొన్ని చోట్ల వంతెనలను మూసేశారు.

1600 మంది సైనికులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. అవసరం అనుకుంటే వినియోగించడానికి మరో 2,000 మందిని సిద్ధంగా ఉంచారు.

“ఇది అత్యంత ప్రత్యేకమైన విపత్తు. 1776 తర్వాత ఇంత భారీ వర్షాలు కురవలేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కురిసిన వర్షపాతం గత 250 యేళ్లలో ఎన్నడూ కురవలేదని చెప్పవచ్చు” అని ఎన్విరాన్ మెంటల్ ఏజన్సీ డైరెక్టర్ టోబి విల్సన్ చెప్పారని మెయిల్ ఆన్ లైన్ తెలిపింది.

ఇంత విపరీత వాతావరణ పరిస్ధితికి గ్లోబల్ వార్మింగ్ తప్ప మరో కారణం కనిపించడం లేదనీ, వేడి వాతావరణం ఎల్లప్పుడూ మరిన్ని వర్షాలను తెస్తుందన్నది స్ధిరపడిన వాస్తవం అనీ పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

Photos: Daily Mail

 

One thought on “బ్రిటన్ ను మళ్ళీ ఊపేసిన తుఫాను, మరొకటి తయారు -ఫోటోలు

వ్యాఖ్యానించండి