ఏర్లు వూళ్ళు ఏకమయ్యేనూ… ఇంగ్లండ్ వరదలు -ఫొటోలు


నైరుతి ఇంగ్లండ్ లోని పల్లపు మైదానాలను వరదలు ముంచెత్తి ఇప్పటికీ నెల పైనే అవుతోంది. అయినా ఆ ప్రాంతం ఇంకా వరద నీటి నుండి బైట పడలేదు. ఈ ప్రాంతం మొత్తం దాదాపు నీటి కింద కాలం వెళ్ళబుచ్చుతోంది. అనేక గ్రామాలను వరద నీరు చుట్టు ముట్టడంతో కాస్త మెరక మీద ఉన్న గ్రామాలు చిన్నపాటి ద్వీపాల్లా కనిపిస్తున్నాయి. గ్రామాల నివాసులు ఒకరి నుండి మరొకరికి సంబంధాలు లేకుండా పోయాయి. సోమర్ సెట్ నివాసులు తమ దుస్ధితికి భారీ వర్షాలనే కాకుండా ప్రభుత్వ క్రియా శూన్యతను కూడా నిందిస్తున్నారు.

కాబట్టి ప్రభుత్వాల క్రియా శూన్యత భారత ప్రభుత్వం గుత్త సొత్తు కాదన్నమాట! సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ క్రియా శూన్యతలో డిగ్రీలు, పి.జిలు చేసి ఉన్నాయి. బహుశా పరిశోధనలు చేసి డాక్టరేట్లు కూడా పుచ్చుకుని ఉంటాయి. కాకపోతే ‘అభివృద్ధి చెందిన’ దేశాలు కనుక వాటిని ఎలా కప్పి పుచ్చుకోవాలో కూడా వాటికి తెలుసు.

నదులు పెద్ద ఎత్తున పూడుకుపోవడంతో వరద నీటి ప్రవాహానికి నదుల్లో చోటు దొరక్క ఇళ్ళు, రోడ్లు, కాలనీల మీదికి వచ్చేశాయని, నదుల్లో డ్రెడ్జింగ్ (పూడిక తీత) చేయమని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తోడు గ్లోబల్ వార్మింగ్ జత కలవడంతో ఇక వరదలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కవి గారన్నట్లు ‘ఏర్లు, వూళ్ళు ఏకమయ్యేనూ… నీళ్ళ కరువే తీరి పొయ్యేనూ…” అన్నట్లు తయారయ్యింది పరిస్ధితి.

వరదలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే సహాయక చర్యల కోసం ప్రభుత్వం సైన్యాన్ని కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది. వరదలో మునిగిన అనేక ఆస్తుల నుండి జనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. పర్యావరణ సంస్ధ ఛైర్మన్ క్రిస్ స్మిత్ వరద ప్రాంతాన్ని సందర్శించినప్పుడు జనం నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం కూడా పర్యావరణ ఏజన్సీ మీదికి నెపం నెట్టి బాధ్యత నుంచి తప్పుకుంది.

సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారు ఫిబ్రవరి 9 నాటికి రోజుకు 3 మిలియన్ టన్నుల నీటిని నివాస ప్రాంతాల నుండి తోడి పోస్తున్నారని ఒక అంచనా. కొన్ని చోట్ల సముద్రం నుండి భారీ యెత్తున విరుచుకు పడిన అలల ధాటికి సముద్ర గోడలు విరిగి పడిపోయాయి. ఫలితంగా రైల్వే ట్రాక్ లోని కొంత భాగం సముద్రంలోకి లాగివేయబడింది. కొండ చరియలు, మట్టి చరియలు విరిగి పడడం వల్ల కొన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది.

నెల రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఉత్తర అట్లాంటిక్ జెట్ స్ట్రీమ్ ప్రవాహం అసాధారణ రీతిలో శక్తివంతంగా ఉండడం కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరదల ధాటికి ఇప్పటికే 1.6 బిలియన్ డాలర్ల జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. డిసెంబర్, జనవరి రెండు నెలలకు కలిపి 372.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందని బ్రిటిష్ మెట్ కార్యాలయం తెలియజేసింది.

ఈ కింది ఫోటోలు నైరుతి బ్రిటన్ లోని వివిధ చోట్ల రికార్డయిన వరద భీభత్సం దృశ్యాలు. ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందజేసింది.

వ్యాఖ్యానించండి